బయటపడ్డ చంద్రబాబు అసత్య ప్రచారం
►మహిళను అత్యాచారం చేసి, హత్య చేశారని చంద్రబాబు ప్రచారం
►రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నీచమైన ఆరోపణలు
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అసత్య ప్రచారం బయటపడింది. ఓ మహిళను అత్యాచారం చేసి హతమార్చారంటూ ఆమె ఫొటో చూపిస్తూ ఆయన ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే వైఎస్‌ఆర్ సీపీ నేతలపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్దమని తేలిపోయాయి. చంద్రబాబు చూపిన ఫొటోలోని మహిళ మీడియా ముందుకొచ్చి... తాను బతికే ఉన్నానంటూ చెప్తోంది.
రాజకీయ లబ్ధి కోసం అంత నీచమైన ఆరోపణలు చేస్తారా అంటూ బాధిత మహిళ కన్నీరు పెట్టుకుంది. బాధిత మహిళ షమీమ్ మాట్లాడుతు..‘ చనిపోయింది నేను కాదు, ఆ ఫోటోలో ఉన్న నా పక్కన ఉన్న పిల్ల. ఈ ఫోటోను పదే పదే సిటీ కేబుల్‌లో ప్రసారం చేస్తున్నారు. అయితే అందులో నన్నే ఎక్కువసార్లు చూపిస్తున్నారు.’ అంటూ తన భర్తతో కలిసి మీడియా ముందుకు వచ్చింది. మరోవైపు బాధితురాలి కుటుంబీకులు కూడా చంద్రబాబు అసత్య ప్రచారంపై మండిపడుతున్నారు. సీఎం స్థాయి వ్యక్తి...రాజకీయ లబ్ది కోసం ఇంతకు దిగజారుతా అని మండిపడుతున్నారు.
ఎదురు తిరిగిన మహిళలు..
మరోవైపు ప్రచారం ముగిసినా, నంద్యాలలో టీడీపీ నేతలు ప్రలోభాల పర్వం విచ్చలవిడిగా కొనసాగుతోంది. పలు బస్తీల్లో మహిళా ఓటర్లను ప్రలోభపెడుతూ ముక్కుపుడకలు, చీరలు పంపిణీ చేశారు. అయితే రోల్డ్‌గోల్డ్ ముక్కుపుడకలు, డ్యామేజీ చీరలు ఇస్తారా?. ఓట్ల కోసం మోసం చేస్తారా అంటూ ఆగ్రహంతో మహిళలు ఎదురు తిరిగారు. దీంతో చేసేదేమీ లేక టీడీపీ నేతలు పలాయనం చిత్తగించారు.
స్థానికేతర నేతల మకాం..
అలాగే నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో టీడీపీ నేతలలు ఇష్టారాజ్యంగా వ‍్యవహరిస్తున్నారు. ఇతర ప్రాంతాలవారు నంద్యాలలో ఉండకూడదని ఎన్నికల సంఘం ఆదేశించినా, స్థానికేతర టీడీపీ నేతలు మాత్రం యథేచ్చగా వాహనాల్లో తిరుగుతున్నారు. ఓటర్లకు మద్యం, డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం స్థానికేతర టీడీపీ నేతలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతిపక్షం వైఎస్‌ఆర్ సీపీ ...నంద్యాలో అదనపు కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేస్తోంది.