అసెంబ్లీ హామీల్లో అమలైనవెన్ని? | How many 'Assembly promises' did implemented chandrababu? | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ హామీల్లో అమలైనవెన్ని?

Published Mon, Aug 21 2017 4:10 AM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM

అసెంబ్లీ హామీల్లో అమలైనవెన్ని? - Sakshi

అసెంబ్లీ హామీల్లో అమలైనవెన్ని?

ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారు. ప్రజలు నమ్మి ఓటేశారు. మూడున్నరేళ్లయింది. నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు మరలా అనేక హామీల వర్షం కురిపిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ మూడేళ్లలోనే అమలు చేసేశామని కూడా చెబుతున్నారు. అసలు చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పారు? రాజధానిని ప్రకటిస్తూ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో ఏం చెప్పారు? ఆ హామీల పరిస్థితి ఏమిటి? అన్న దానిపై రాష్ట్రంలో విస్తృత చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో జిల్లాలకు సంబంధించి ఇచ్చిన హామీలలో ముఖ్యమైనవాటి పరిస్థితి చూద్దాం..
– సాక్షి, అమరావతి
 
సిక్కోలుకు ఒట్టిచేయి...
సిక్కోలు (శ్రీకాకుళం) స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి,  జిల్లాలో నూతన పారిశ్రామిక నగరం ఏర్పాటు, భావనపాడు, కళింగపట్నంలో పోర్టుల నిర్మాణం కల్లలుగానే మిగిలిపోయాయి.  జిల్లాలో ఎయిర్‌పోర్టు, ఫుడ్‌పార్కు, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్, ఆర్కిటెక్చర్‌ ఏర్పాటు జాడే లేదు. వంశధార, నాగావళి నదులపై నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి.. ఒట్టి హామీగానే మిగిలిపోయింది.  తేలినీలాపురం పక్షుల సంరక్షణ, బౌద్ధ కట్టడాలు, శ్రీకూర్మం, అరసవెల్లి దేవాలయాలను,  బారువ బీచ్‌ను కలుపుతూ పర్యటక కేంద్రాలుగా అభివృద్ధి పట్టించుకున్న పాపాన పోలేదు. 
 
విజయనగరం ‘స్మార్ట్‌’ కలే..
జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణాన్ని స్మార్ట్‌ సిటీగా మార్చుతామన్న బాబు మాట నిలబెట్టుకోలేదు. వైద్య కళాశాల ఏర్పాటు మూడేళ్లుగా కలగానే మిగిలింది. పారిశ్రామిక నగరం నిర్మాణం హామీ అమలు ఊసే లేదు.  ఫుడ్‌పార్కు జాడ లేదు. గిరిజన యూనివర్సిటీ, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ పార్కు, సంగీత లలిత కళల అకాడమీ,  గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు తదితర బాసలన్నీ గాలికి వదిలేశారని జిల్లా వాసులు అంటున్నారు. 
 
విశాఖ మెగా సిటీ ఏదీ?
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు, విశాఖపట్నం మెగా సిటీగా అభివృద్ధి అన్న బాబు హామీలు బాసలుగానే మిగిలాయి. వీసీఐసీ పారిశ్రామిక వాడ ఏర్పాటు, మెట్రోరైలు ప్రాజెక్టు,  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్, మెగా ఐటీ హబ్, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రం,  ఫుడ్‌ పార్కు, ఎగ్జిబిషన్, కన్వెన్షన్‌ సెంటర్, గంగవరం ఎల్‌. ఎన్‌.జి. టెర్మినల్‌.. ఊసే లేదు. విమానాశ్రయానికి కూడా అంతర్జాతీయ స్థాయి హోదా ఇంకా రాలేదు.
 
‘తూర్పు’నకు ఒట్టి మాటలే.. 
కాకినాడ, రాజమండ్రి నగరాలు స్మార్ట్‌  సిటీలుగా అభివృద్ధి. పెట్రోలియం యూనివర్సిటీ, పెట్రోలియం కారిడార్, కాకినాడ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం, పోర్టు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ పార్కు, వీసీఐసీ కారిడార్‌లో కాకినాడ, తెలుగు విశ్వవిద్యాలయం, కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ, ఫుడ్‌ పార్కు, భూ ఉపరితల జలమార్గాలు, ఆక్వా కల్చర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు.. మాటలుగానే మిగిలాయి. జిల్లాకు సీఎం ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. 
 
పశ్చిమ బాసలు గోదాట్లోనే...
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్, క్రాఫ్ట్, నర్సాపూర్‌లో పోర్టు, తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు, సిరామిక్, ఆయిల్‌పామ్‌ పరిశ్రమలు, కొల్లేరు సరస్సు పర్యాటక ప్రాంతం, జలమార్గాల అభివృద్ధి, చింతలపూడిలో బొగ్గు వెలికితీత, కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమలు, మెట్ట ప్రాంతాల్లో డ్రిప్‌ ఇరిగేషన్, ఆక్వాకల్చర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్, ఉద్యానవన పరిశోధన కేంద్రం ఏర్పాటు హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు కమీషన్ల బారిన పడి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 
 
హామీలు కృష్ణార్పణం
కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పోర్టు,  ఆయిల్‌ రిఫైనరీ, క్రాకరీ యూనిట్, వీజీటీఎం మెట్రోరైలు, ఆటోమొబైల్‌ , లాజిస్టిక్‌హబ్, ఫుడ్‌పార్కు, మెగాసిటీ, స్మార్ట్‌ సిటీ, ఆక్వా కల్చర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్, టెక్స్‌టైల్‌ పార్కు, భవానీ దీవుల టూరిజం సర్క్యూట్, అవనిగడ్డలో మిస్సైల్‌ పార్కు, ఐటీ హబ్, కూచిపూడి  అకాడెమీ, నూజివీడులో మామిడి పరిశోధన కేంద్రం ఏర్పాటు, గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా విస్తరణ  హామీలు నీటి మూటలుగానే మిగిలాయి.
 
గుంటూరులో జాడలేని ఎయిమ్స్‌
గుంటూరు జిల్లాలో టెక్స్‌టైల్‌పార్కు, ఫుడ్‌ పార్కు, నాగార్జున కొండ అమరావతి టూరిజం సర్క్యూట్, నాగార్జున సాగర్‌ థీమ్‌ పార్కు, సౌర విద్యుత్కేంద్రం మాటలకే పరిమితమయ్యాయి. వీజీటీఎం మెట్రోరైలు, ఎయిమ్స్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ,  స్మార్ట్‌ సిటీ, ఫుడ్‌ పార్కు,  నాగార్జున సాగర్‌ ఎయిర్‌ పోర్టు ఉత్తిమాటలుగా మారాయి. 
 
కర్నూలులో కర్మాగారాలెక్కడ?
కర్నూలు జిల్లాకు బాబు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. స్మార్ట్‌ సిటీగా కర్నూలు, కొత్త విమానాశ్రయం ఏర్పాటు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, అవుకులో పారిశ్రామికవాడ, హైదరాబాద్‌  బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో కర్నూలు, టెక్స్‌టైల్‌ క్లస్టర్, కోయిలకుంట్లలో సిమెంటు ఉత్పత్తుల హబ్, న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్, పర్యాటకాభివృద్ధి, విత్తనోత్పత్తి కేంద్రం, రైల్వే వ్యాగన్ల మరమ్మతుల కర్మాగారం, మైనింగ్‌ స్కూలు, ఫుడ్‌ పార్కు, స్విమ్స్‌ తరహాలో కర్నూలులో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి... అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. 
 
సీఎం సొంత జిల్లాకూ మొండిచేయి
సీఎం సొంత జిల్లా చిత్తూరు జిల్లాకు ఇచ్చిన హామీలు కూడా ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. కుప్పం ఎయిర్‌పోర్టు,  అపోలో హెల్త్‌ సెంటర్, హార్టికల్చర్‌ జోన్, తిరుపతి మెగా సిటీగా అభివృద్ధి. ఫుడ్‌ పార్కు, మెట్రో రైలు, శ్రీకాళహస్తి , తిరుపతి, కాణిపాకం, ఆధ్యాత్మిక, పర్యాటక సర్క్యూట్‌  ఏదీ అమలు కాలేదు.
 
కల్లలుగా నెల్లూరు హామీలు
నెల్లూరు జిల్లాకు చేసిన బాసలు కలగానే మిగిలాయి. విశాఖపట్నం  చెన్నై, బెంగళూరు చెన్నై పారిశ్రామిక వాడల ఏర్పాటు, ఆటోమొబైల్‌ హబ్, ఎయిర్‌పోర్టు, దుగరాజపట్నం పోర్టు, పులికాట్‌ సరస్సు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి, స్మార్ట్‌ సిటీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, మెరైన్‌ ఇన్‌స్టిట్యూట్, ఎరువుల కర్మాగారం హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. 
 
వైఎస్సార్‌ జిల్లాకు ఉత్తిచేయి..
వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటు హామీ నీటి మూటగా మిగిలింది. స్టీల్‌ప్లాంటు ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ కేంద్ర ప్రభుత్వంపై  కనీస ఒత్తిడి తేవడంలేదు. సిమెంటు పరిశ్రమలు, ఖనిజాధార పరిశ్రమలు, పారిశామ్రిక స్మార్ట్‌ సిటీ,  ఫుడ్‌ పార్కు, ఉర్దూ యూనివర్సిటీ,  గార్మెంట్‌ క్లస్టర్‌. రేణిగుంట రాజంపేట కడప మధ్య నాలుగులేన్ల రహదారుల నిర్మాణం హామీలేవీ అమలు కాలేదు.
 
‘అనంత’ హామీలు కాగితాల్లోనే..
దేశంలోనే అత్యంత కరువు ప్రాంతంగా అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. జిల్లాలో ఉద్యాన యూనివర్సిటీ, సెంట్రల్‌ యూనివర్సిటీ, ఎయిమ్స్‌ అనుబంధ కేంద్రం, నూతన పారిశ్రామిక నగరం, స్మార్ట్‌ సిటీ, బెంగుళూరు  చెన్నై కారిడార్‌లోకి హిందూపురం. టెక్స్‌టైల్‌ పార్కు, ఫుడ్‌ పార్కు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ క్లస్టర్, సౌర, పవన విద్యుదుత్పత్తి. పెనుగొండలో ఇస్కాన్‌ ప్రాజెక్టు, పుట్టపర్తి ఆధ్యాత్మిక నగరం, పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం, కుద్రేముఖ్‌ ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్టు, హంద్రీ  నీవా ప్రాజెక్టు పూర్తి. వంద శాతం డ్రిప్, తుంపరసేద్యం హామీలు నీటిమూటలుగానే మిగిలాయి.
 
ప్రకాశంలో పారిశ్రామిక నగరం ఏది?
ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. దొనకొండ పారిశ్రామిక నగరం, మైన్స్‌ యూనివర్సిటీ, మినరల్‌ సైన్సెస్, ఒంగోలు ఎయిర్‌పోర్టు, కనిగిరిలో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి జోన్, రామాయపట్నం పోర్టు, ఫుడ్‌ పార్కు, వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ఏడాదిలో పూర్తి. స్మార్ట్‌ సిటీ, ఆక్వా కల్చర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు అన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement