
2022 నాటికి అందరికీ ఇళ్లు: వెంకయ్య
విజయవాడ బ్యూరో: సర్దార్ పటేల్ పేరుతో త్వరలోనే కొత్త గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించి 2022 నాటికి దేశంలో పేదలందరికీ ఇళ్లు కట్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆయన శుక్రవారం నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను త్వరలోనే అమలు చేస్తామని భరోసానిచ్చారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. రెండు ప్రభుత్వాలు విభేదాలను వీడి పనిచేయాలని సూచించారు. మతతత్వం అంటూ పడికట్టు పదాలతో కాలక్షేపం చేసే కమ్యూనిస్టులు అవసాన దశలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా భారత్‌ను బీజేపీ తీర్చిదిద్దుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన మాట్లాడుతూ దేశాన్ని అగ్రగామిగా చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు.