హైదరాబాద్ విలీనం పటేల్ ఘనతే!
సాక్షి, హైదరాబాద్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ లేకుంటే నేడు హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగమై ఉండేది కాదేమోనని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. మనమంతా భారతీయులమని గర్వంగా చెప్పుకొంటున్నామంటే ఆ కీర్తికి పటేల్ మాత్రమే కారణమని, హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేసిన ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ను నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు... హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం 7.45కు అసెంబ్లీ నుంచి ట్యాంక్‌బండ్ వరకు ‘ఐక్యతా పరుగు’ను నిర్వహించారు. దీనిని రాజ్‌నాథ్‌సింగ్ జెండావూపి ప్రారంభించారు.
అంత కు ముందు ఆయన అసెంబ్లీ ఎదురుగా ఉన్న పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. అనంతరం ప్రసంగిస్తూ.. భారతదేశం అఖండంగా, సమగ్రంగా ఉండడం ఇష్టంలేని ఆంగ్ల పాలకులు.. వెళ్లిపోయేముందు వందలాది సంస్థానాలకు స్వతంత్ర నిర్ణయాధికారం ఇచ్చారని.. దాంతో అల్లర్లు కూడా చెలరేగాయని గుర్తుచేశారు. అనంతరం దేశంలోని 562 సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసిన ఘనత పటేల్‌కే దక్కుతుందన్నారు. పటేల్ జయంతి సందర్భంగా దేశం సమైక్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. కాగా ఐక్యతాపరుగులో పాల్గొనడానికి తరలి వచ్చిన పాఠశాలల విద్యార్థులు, బీజేపీ కార్యకర్తలతో రాజ్‌నాథ్‌సింగ్ తెలుగులో సమైక్య ప్రతిజ్ఞ చేయించడం ఆకట్టుకుంది. అసెంబ్లీ నుంచి బయలుదేరిన ఈ ర్యాలీ ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. చివరగా బీజేపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, మురళీధర్‌రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా, పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
నేర నిరోధానికి వ్యూహాలు రచించాలి: రాజ్‌నాథ్ సింగ్
పోలీసు అధికారులు ఏదైనా ఘటన జరగడానికి ముందే దాన్ని గుర్తించాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మావోయిజం వంటి వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి, సైబర్ నేరాలు నిరోధించడానికి వ్యూహాలు సిద్ధం చేయూలని సూచించారు. 2013-14 గణాంకాల ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లో కంటే ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ పెరుగుదల నమోదు కావడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమన్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీలో (ఎన్‌పీఏ) శుక్రవారం జరిగిన 66వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్‌కు రాజ్‌నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఈ 66వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల్లో 21 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని, ఈ సంఖ్య 50 శాతానికంటే ఎక్కువ కావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రస్తావన లేని ప్రసంగం
కేంద్ర హోం మంత్రి ప్రసంగంలో ఎక్కడా తెలంగాణ రాష్ట్ర ప్రసావన రాలేదు. ప్రసంగం ప్రారంభంలో అధికారులకు స్వాగతం పలుకుతూ ‘ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు’అని వ్యాఖ్యానించడంతో పలువురు విస్మయానికి గురయ్యారు.