Run for Unity
-
'సర్దార్ పటేల్‌ను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది'
హైదరాబాద్ : చైనా యుద్ధంలో ఈశాన్య రాష్ట్రాలను అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు గాలికొదిలేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. శనివారం హైదరాబద్‌లో అంబేద్కర్ విగ్రహం నుంచి సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహం వరకు రన్ ఫర్ యూనిటీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ... కుహన లౌకిక వాదులు మోదీ ప్రభుత్వాన్ని సహించలేకపోతున్నాయని విమర్శించారు. దేశాన్ని నిర్మించిన సర్దార్ పటేల్‌ను కాంగ్రెస్ మరిచిపోయిందని మండిపడ్డారు. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలను కూడా మరిచిపోయిందన్నారు. ఇది దారుణమైన విషయమని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ప్రపంచం భారత్ వైపు చూస్తుంటే... కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. గతంలో ఢిల్లీ చర్చిలో దాడులు, బెంగాల్లో నన్ రేప్ విషయంలో వచ్చిన నివేదికలపై వీళ్లు ఎందుకు మాట్లాడరు అంటూ కిరణ్ రిజిజు కాంగ్రెస్ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. -
హైదరాబాద్ విలీనం పటేల్ ఘనతే!
సాక్షి, హైదరాబాద్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ లేకుంటే నేడు హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగమై ఉండేది కాదేమోనని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. మనమంతా భారతీయులమని గర్వంగా చెప్పుకొంటున్నామంటే ఆ కీర్తికి పటేల్ మాత్రమే కారణమని, హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేసిన ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. పటేల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ను నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు... హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం 7.45కు అసెంబ్లీ నుంచి ట్యాంక్‌బండ్ వరకు ‘ఐక్యతా పరుగు’ను నిర్వహించారు. దీనిని రాజ్‌నాథ్‌సింగ్ జెండావూపి ప్రారంభించారు. అంత కు ముందు ఆయన అసెంబ్లీ ఎదురుగా ఉన్న పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. అనంతరం ప్రసంగిస్తూ.. భారతదేశం అఖండంగా, సమగ్రంగా ఉండడం ఇష్టంలేని ఆంగ్ల పాలకులు.. వెళ్లిపోయేముందు వందలాది సంస్థానాలకు స్వతంత్ర నిర్ణయాధికారం ఇచ్చారని.. దాంతో అల్లర్లు కూడా చెలరేగాయని గుర్తుచేశారు. అనంతరం దేశంలోని 562 సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసిన ఘనత పటేల్‌కే దక్కుతుందన్నారు. పటేల్ జయంతి సందర్భంగా దేశం సమైక్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. కాగా ఐక్యతాపరుగులో పాల్గొనడానికి తరలి వచ్చిన పాఠశాలల విద్యార్థులు, బీజేపీ కార్యకర్తలతో రాజ్‌నాథ్‌సింగ్ తెలుగులో సమైక్య ప్రతిజ్ఞ చేయించడం ఆకట్టుకుంది. అసెంబ్లీ నుంచి బయలుదేరిన ఈ ర్యాలీ ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. చివరగా బీజేపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, మురళీధర్‌రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా, పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. నేర నిరోధానికి వ్యూహాలు రచించాలి: రాజ్‌నాథ్ సింగ్ పోలీసు అధికారులు ఏదైనా ఘటన జరగడానికి ముందే దాన్ని గుర్తించాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మావోయిజం వంటి వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి, సైబర్ నేరాలు నిరోధించడానికి వ్యూహాలు సిద్ధం చేయూలని సూచించారు. 2013-14 గణాంకాల ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లో కంటే ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ పెరుగుదల నమోదు కావడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమన్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీలో (ఎన్పీఏ) శుక్రవారం జరిగిన 66వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్‌కు రాజ్‌నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఈ 66వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల్లో 21 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని, ఈ సంఖ్య 50 శాతానికంటే ఎక్కువ కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రస్తావన లేని ప్రసంగం కేంద్ర హోం మంత్రి ప్రసంగంలో ఎక్కడా తెలంగాణ రాష్ట్ర ప్రసావన రాలేదు. ప్రసంగం ప్రారంభంలో అధికారులకు స్వాగతం పలుకుతూ ‘ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు’అని వ్యాఖ్యానించడంతో పలువురు విస్మయానికి గురయ్యారు. -
ఘనంగా రన్ ఫర్ యూనిటీ
సాక్షి, ముంబై: సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్కవారం ఉదయం గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ‘రన్ ఫర్ యూనిటీ’ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం నారిమన్ పాయింట్‌లోని ఎయిర్ ఇండియా బిల్డింగ్ నుంచి ప్రారంభమై మెరైన్ డ్రైవ్‌లోని పార్శీ జింఖానా వద్ద ముగిసింది. రెండు కి.మీ.మేర సాగిన ఈ కార్యక్రమంలో బజ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, రావ్‌సాహెబ్ దాన్వే తదితరులు పాల్గొన్నారు. వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజైన అక్టోబరు 31వ తేదీని ‘రాష్టీయ ఏక్తా దివస్’ గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా గవర్నర్ దేశ ఐక్యతను, శాంతి, భద్రతలను కాపాడేందుకు తనవంతు కృషిచేస్తానని కార్యక్రమానికి హాజరైన వారిచేత ప్రమాణం చేయించారు. అలాగే ఈ సందేశాన్ని దేశ ప్రజలందరికి చేరవేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. -
'పటేల్... దేశ సమైక్యతకు మారుపేరు'
హైదరాబాద్: భారత తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు మారు పేరు అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అభివర్ణించారు. కేంద్ర హోం మంత్రిగా ఆయన భారత జాతి గర్వపడేలా పని చేశారని తెలిపారు. శుక్రవారం ఏపీ సచివాలయ ప్రాంగణంలో సర్దార్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఉద్యోగుల చేత ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జాతీయ ఐక్యతా పరుగును జెండా ఊపి ప్రారంభించారు. -
పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారత్‌లో విలీనం
హైదరాబాద్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో జాతీయ సమైక్యతా పరుగును ప్రారంభించారు. అంతకు ముందు ఆయన అసెంబ్లీ ముందున్న పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ఐకమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ జయంతి హైదరాబాద్‌లో జరుపుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారతదేశంలో విలీనమైందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ విభజన సమయంలో పటేల్ కీలక పాత్ర వహించారని కొనియాడారు. మోదీ సంకల్పించిన జాతీయ ఐక్యతా పరుగును విజయవంతం చేయాలని రాజ్‌నాథ్ కోరారు. ఐక్యతా రన్ పటేల్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ వరకు కొనసాగుతుంది. పటేల్ జయంతిని జాతీయ ఏక్తా దివస్‌గా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ప్రజల్లో సమైక్యతా భావాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు నగరానికి చెందిన బీజేపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ రాజేంద్ర నగర్ లోని సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు. 66వ బ్యాచ్ ఐపీఎస్ లు శిక్షణ పూర్తి చేసుకోగా,ఈ ముగింపు కార్యక్రమంలో రాజ్ నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
'కుట్రలను ఉక్కుపాదంతో అణిచిన సర్దార్ పటేల్'
న్యూఢిల్లీ: భారతదేశాన్ని ఏకీకృతం చేయడానికే ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్‌పటేల్ జీవితం అంకితం చేశారని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పటేల్ జీవితం ఎందరికో స్పూర్తిదాయకమని చెప్పారు. సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద నిర్వహించిన జాతీయ ఏక్ తా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన పటేల్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... దేశాన్ని ఐక్యంగా ఉంచే క్రమంలో సర్దార్ పటేల్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. స్వాతంత్య్ర అనంతరం దేశంలోని సంస్థానాల వీలినమే పటేల్‌లో ఉన్న దేశ ఐక్యతకు నిదర్శనమని చెప్పారు. భారతదేశ స్వాతంత్ర కాంక్ష, శక్తిని చాటిన యాత్ర దండియాత్ర. ఆ యాత్రలో మహాత్మునితో కలసి అడుగులోఅడుగు వేసి నడిచిన వ్యక్తి పటేల్ అని మోదీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో దేశంలోని రైతులందరిని ఏకతాటిపై నడిపి వ్యక్తి పటేల్ అని అన్నారు. కొత్త ఉత్సాహం, లక్ష్యంతో అడుగులు వేయాలని యువతకు మోదీ పిలుపు నిచ్చారు. దేశంలో జరిగిన అనేక కుట్రను ఉక్కుపాదంతో అణిచిన వ్యక్తి పటేల్ అని తెలిపారు. అనంతరం ఐక్యమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని మోదీ ఈ సందర్భంగా విజయ్‌చౌక్ వద్ద పాల్గొన వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత ఐక్యత పరుగును జెండా ఊపి మోదీ ప్రారంభించారు. ఈ పరుగులో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. -
'మరింత మంది పేర్లు బయటపెడతాం'
ఢిల్లీ: విదేశాల్లోని బ్యాంక్ ఖాతాల్లో మూలుగుతున్న నల్లధనం విషయంలో మరింత మంది పేర్లను బయటపెడతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పష్టం చేశారు. తాము ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయడం లేదంటూనే రాబోవు రోజుల్లో మరికొంతమంది ప్రముఖుల పేర్లు బయటకొస్తాయన్నారు. అక్టోబర్ 31న హైదరాబాద్ లో 'ఐక్యతా పరుగు'(రన్ ఫర్ యూనిటీ) కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఆ కార్యక్రమంలో హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటారని మురళీధర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ నిర్వహిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇందులో పాల్గొవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. -
అఫిడవిట్లు ఇస్తేనే నమ్ముతాం
=జనవరి 18న చలో అసెంబ్లీ =శాసనసభ్యులందరూ పాల్గొనాలి =సమైక్యాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం డిమాండ్ తిరుపతి, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన బిల్లుకు వ్యతిరేకంగా అఫిడవిట్లు సమర్పించిన వారినే నిజమైన సమైక్యవాదులుగా గుర్తిస్తామని సమైక్యాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం స్పష్టం చేసింది. సోమవారం తిరుపతిలోని ఒక ప్రైవేట్ హోటల్లో శాప్స్, సైమైక్యాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం సంయుక్తంగా ‘రాష్ట్ర విభజన-మన కర్తవ్యం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ.పటేల్ మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర విభజనకు ఒడిగడుతున్నారన్నారు. విభనకు మద్దతు ఇస్తున్న బీజేపీ ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని నిర్వహించడం హాస్యాస్పదమని విమర్శిం చారు. అయితే విభజన బిల్లులో శాస్త్రీయత లేదని, ఈ బిల్లు వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందని బీజేపీ ఇప్పుడు ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరంను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మాట మార్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా మారుస్తామని చెప్పడం దారుణమన్నారు. ఒక ప్రాంతాన్ని విమర్శిస్తూ జాతీయ భావాలను దెబ్బతీసి రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 19లను దెబ్బతీస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విభజనకు సహకరిస్తున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులను చరిత్ర క్షమించదని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల సంఘం అధ్యక్షుడు అశోక్‌రాజు అన్నారు. ఆర్ అండ్ బీ డెప్యూటీ ఎగ్జిగ్యూటివ్ ఇంజినీర్ శేషారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ.రమణ మాట్లాడారు. ఇవీ తీర్మానాలు ఈనెల 18న చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టాలని తీర్మానించారు. జనవరి ఒకటో తేదీ అందరి ఇళ్లముం దు సమైక్యాంధ్ర ముగ్గులు వేసేలా ప్రచారం చేయాలని, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సమైక్యాంధ్రకు మద్దతుగా అఫిడవిట్లను రాష్ట్రపతికి, స్పీకర్‌కు పంపాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు ఆమోదించారు. ఉద్యమంలో అన్ని జేఏసీలు ఒకే తాటిపై నిలిచి పోరాడాలని, రాజకీయనాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం మాని సమైక్య రాష్ట్రం కోసం చేయిచేయి కలిపి నడవాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపు చలో పార్లమెంట్ చేపట్టాలని నిర్ణయించారు. కార్యక్రమంలో వివిధ జేఏసీల నాయకులు ఎం.రమేష్, టి.గోపాల్, సంతానం, రాజేంద్రప్రసాద్‌రెడ్డి, కన్నయ్య, ద్వారకనాథరెడ్డి, ప్రతాప్, డాక్టర్ రాజయ్య పాల్గొన్నారు. -
దేశ సమైక్యతను చాటుదాం
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : జాతి సమైక్యతను చాటేలా చేపడుతున్న సర్ధార్ వల్లాభాయ్ పటేల్ భారీ విగ్రహ నిర్మాణ బృహత్తర కార్యక్రమానికి ప్రజలంతా వజ్ర సంకల్పంతో సహకరించాలని స్టాచ్యూ ఆఫ్ రన్ ఫర్ యూనిటీ జిల్లా సమన్వయకర్త ముల్కల్ల మల్లారెడ్డి పిలుపునిచ్చారు. పటేల్‌ను స్మరిస్తూ దేశ ఐక్యత కోసం ఆదివారం ఉదయం 7-30 గంటలకు ఐక్యతా పరుగును మంచిర్యాలలో నిర్వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఐక్యతా పరుగుపై జాతీయ స్థాయిలో ప్రసంగించగా ఎల్సీడీల ద్వారా స్థానిక ఐబీ చౌరస్తాలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. పటేల్ జీవిత విశేషాలను తెలియజేస్తూ ఆ మహానీయుడి భారీ విగ్రహ నిర్మాణంలో ఐక్యత చాటుతూ ఆయన రుణం తీర్చుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్దదిగా సర్ధార్ వల్లబాయ్ పటేల్ విగ్రహ నిర్మాణాన్ని గుజరాత్ రాష్ట్రంలోని నర్మద నది ఒడ్డున చేపడుతున్నట్లు తెలిపారు. దేశ సమైక్యత కోసం ఆయన ఎంతో శ్రమించారని కొనియూడారు. ముఖ్యంగా తెలంగాణలో రజాకార్ల ఆకృత్యాలకు చరమగీతం పాడి నిజాం నవాబును లొంగదీసుకుని 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు విమోచనం కల్పించారని గుర్తు చేశారు. అందుకే ఆ మహనీయుడి విగ్రహ నిర్మాణంలో విధిగా పాలుపంచుకోవాల్సిన అవసరముంద ని అన్నారు. స్టాచ్యూ ఆఫ్ రన్ ఫర్ యూనిటీ జిల్లా చైర్మన్ గురిజాల రాధాకిషన్‌రావు, మంచిర్యాల బాధ్యుడు గోనె శ్యాంసుందర్‌రావు, స్వాతంత్ర సమరయోధుడు కె.వి.రమణయ్య, పార్టీలకు అతీతంగా పాల్గొన్న నాయకుడు కెవి.ప్రతాప్, గొంగళ్ల శంకర్, కల్వల జగన్మోహన్రావు, పూరెళ్ల పోచమల్లు, మల్లేశ్, పెద్దపల్లి పురుషోత్తం, తులా ఆంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, పల్లె భూమేశ్, ప్రభ, లింగన్నపేట విజయ్‌కుమార్, పాటు వివిధ పార్టీల నాయకులు, కళాశాలల యాజమాన్యం, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా స్టాచ్యూ ఆఫ్ రన్ ఫర్ యూనిటీ పరుగు ఐబీ నుంచి పురవీధుల గుండా జాతీయ రహదారి మీదుగా ఐబీ వరకు సాగింది. పరుగులో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఆదిలాబాద్‌లో అట్టహాసంగా.. ఆదిలాబాద్ స్పోర్ట్స్ : జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో ఏక్తా ట్రస్ట్, బీజేపీ సమన్వయంతో ఆదివారం రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహక ఇన్చార్జి వకుళాభరణం ఆదినాథ్ ఆధ్వర్యంలో పౌర సమాజం అధ్యక్షుడు డాక్టర్ కల్యాణ్‌రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి పరుగును ప్రారంభించారు. అంతకుముందు ఎఫ్ఎం రేడియో ద్వారా గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రసంగాన్ని విన్నారు. అనంతరం పరుగును పట్టణంలోని డైట్ మైదానం నుంచి వినాయక్ చౌక్, అశోక్‌రోడ్, గాంధీచౌక్, శివాజీ చౌక్, అంబేద్కర్ చౌక్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. కల్యాణ్‌రెడ్డి మాట్లాడుతూ, భారతదేశ సమైక్యతకు వల్లాభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. జూడాల అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, నియోజకవర్గ ఇన్చార్జి జనగం సంతోష్, గిరిజన మోర్చ జాతీయ కార్యదర్శి శ్రీరాంనాయక్, కిసాన్‌మోర్చ అధ్యక్షుడు దీపక్‌సింగ్ షెకావత్, నాయకులు పాల్గొన్నారు. -
ఐక్యతకు స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్
చేవెళ్ల, న్యూస్‌లైన్ : రైతు బాంధవుడు, దేశ ఐక్యతకు స్ఫూర్తిగా నిలిచిన దేశ మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్ గౌడ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహ నిర్మాణ యజ్ఞంలో భాగంగా బీజేపీ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపుమేరకు ఆదివారం చేవెళ్లలో విద్యార్థులతో పెద్దఎత్తున ఐక్యతా రన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అయ్యప్ప దేవాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో అంజన్‌కుమార్ గౌడ్ మాట్లాడారు. బ్రిటిష్ వారు శిస్తు చెల్లించని రైతుల భూములను స్వాధీనం చేసుకుంటుంటే తీవ్రంగా ప్రతిఘటించి భూములను వారికి తిరిగి ఇప్పించిన ధీశాలి సర్దార్ పటేల్ అన్నారు. స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సుమారు 535 సంస్థానాలను విలీనం చేసిన ఘనత పటేల్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. నిజాం ఎంత మొండికేసినా సైనికచర్యతో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయించిన ఉక్కుమనిషి వల్లభాయ్ పటేల్ అని నివాళులర్పిం చారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ వల్లభాయ్ పటేల్‌ను స్ఫూర్తిగా తీసుకొని దేశ సమైక్యత, సమగ్రత కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ యూనిటీ రన్ కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో రికా ర్డు సాధించబోతున్నదని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జాగృతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి, వివేకానంద జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్‌రెడ్డి, శ్రీచైతన్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్, బీజేపీ జిల్లా కార్యవర్గసభ్యుడు ఆంజనేయులుగౌడ్, మండల జేఏసీ కన్వీనర్ మర్ప ల్లి కృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైదిగా గుజరాత్లో ఏర్పాటు చేయనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి అందరూ తోడ్పాటునందించాలని కోరారు. అనంతరం అయ్యప్ప దేవాలయం నుంచి వైఎస్సార్ చౌరస్తా వరకు ఐక్యతా పరుగును నిర్వహించారు. వందలాది విద్యార్థులు జాతీయ పతాకాలు చేతబూని వందేమాతరం... భారత్‌మాతాకీ జై నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పరుగుతీశారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కంజర్ల ప్రకాశ్, జిల్లా నాయకులు జంగారెడ్డి, దేవర గోపాల్‌రెడ్డి, అత్తెల్లి విఠల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, చిలుకూరు గోపాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎ.శ్రీనివాస్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఎం.బాల్‌రాజ్, క్యామ పద్మనాభం, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఖమ్మం, కొత్తగూడెంలో ‘రన్‌ఫర్ యూనిటీ’
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: సర్దార్ వల్లబాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఖమ్మంనగరంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెవీలియన్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ రన్ టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. పెవీలి యన్ గ్రౌండ్ నుంచి బయలుదేరిన ఈ రన్ మయూరిసెంటర్, బస్టాండ్, వైరా రోడ్, జడ్పీ సెంటర్, కలెక్టరేట్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు మీదుగా సర్దార్ పటేల్ స్టేడియం వరకు సాగింది. తొలుత సర్దార్ వల్లబాయ్ పటేల చిత్ర పటానికి రంగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం తర్వాత ముక్కలు చెక్కలుగా ఉన్న భారతావనిని ఒక్కటి చేసిన మహనీయుడు పటేల్ అని కొనియాడారు. నిజాం నిరంకుశ పాలనకు తెరదించి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛావాయువులు ప్రసాదించారని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కో ఆర్డినేటర్ దొడ్డా రమేష్, నాయకులు జయచంద్రారెడ్డి, గెంటెల విద్యాసాగర్, డి. సత్యనారాయణ, పుల్లేశ్వరావు,కొండి ప్రభాకర్, నంద్యాల శ్రీనివాసరావు, కీసర జైపాల్‌రెడ్డి, పిట్టల లక్ష్మీనారాయణ, కృష్ణలత, కటేపల్లి లక్ష్మీనారాయణ, రవీందర్, పద్మావతి, ఉపేందర్, రెజోనెన్స్ నాగేందర్, ఆర్జేసి కృష్ణ, దరిపల్లి కిరణ్, శేషగిరి, కృష్ణవేణి, ఎం. నారాయణ, వెంకటేశ్వరగుప్త పాల్గొన్నారు. కొత్తగూడెంలో.. లక్ష్మీదేవిపల్లి: మన దేశ ప్రథమ హోం శాఖామంత్రి సర్దార్ వల్లబాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా ఆదివారం కొత్తగూడెం మండలలోని లక్ష్మీదేవిపల్లి పంచాయతీలో ఏక్తా ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ జరిగింది. విశ్వరూప థియేటర్ నుంచి సూపర్‌బజార్ సెంటర్ వరకు ఇది సాగింది. ప్రదర్శకులు అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏక్తా ట్రస్ట్ నాయకులు జివికె.మనోహర్, కంచర్ల చంద్రశేఖర్‌రావు, జెవిఎస్.చౌదరి మాట్లాడుతూ.. వల్లభాయ్ పటేల్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో నిర్మించేందుకు దేశవ్యాప్తంగా పాత ఇనుము సేకరణ సాగుతోందన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు తొగరు రాజశేఖర్, కనకరాజు, బండి రాజ్‌గౌడ్, టి.నరేంద్రబాబు, సంగం చందర్, పిట్టల కమల, ఇలిగాల మొగిలి, పి.కాశీహుస్సేన్, వి.మల్లేష్, మోరె భాస్కర్, గుమలాపురం సత్యనారాయణ పాల్గొన్నారు. -
రన్ ఫర్ యూనిటీకి స్పందన
తిరువళ్లూరు, న్యూస్‌లైన్:సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి వేడుకలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడి ప్రతిష్టాత్మకంగా పిలుపు నిచ్చిన రన్ పర్ యూనిటీకి తిరువళ్లూరులో అపూర్వ స్వాగతం లభించింది. తిరువళ్లూరు బీజేపీ నగర అధ్యక్షుడు బాలాజీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ నేతలు సుఖదేవ్, జానకిరామన్, దురైపాండ్యన్ హాజరయ్యారు. రన్ పర్ యూనిటీ పరుగుపందెంలో పాల్గొనడానికి తిరువళ్లూరు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు హాజరయ్యారు. తిరువళ్లూరు ఆయిల్ మిల్ నుంచి ప్రారంభమైన పరుగుపందెం దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కామరాజర్ విగ్రహం వరకు సాగింది. ఈ పందెంలో పాల్గొన్న పలువురు యువకులు దేశ సమైక్యత కోసం పాల్గొన్నట్టు వివరించారు. అనంతర ం ముగింపు సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ రన్ పర్ యూనిటీ పేరుతో మోడి ఇచ్చిన పిలుపునకు జిల్లా నలుమూలల నుంచి వేలమంది యువకులు హాజరుకావడంపై ఆయన పట్ల యువతకు ఉన్న నమ్మకాన్ని తెలియచేస్తుందని తెలి పారు. పరుగు పందెంలో పాల్గొన్న చిన్నారులు, యువకులకు సర్టిపికెట్లు అందజేశారు. -
మోడీని పీఎం చేయండి
సాక్షి, ముంబై: తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీని ప్రధానిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ అగ్రనాయకుడు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. నగరంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ‘రన్ ఫర్ యూనిటీ’లో ఆయన పాల్గొన్నారు. ఆ పార్టీ నాయకులు మంగళ ప్రభాత్ లోడా, సునీల్ రాణే ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ర్యాలీలో స్థానిక తెలుగు ప్రజలు కూడా పాలుపంచుకోవడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. అనంతరం పద్మశాలి సమాజ సుధారక మండలి ప్రధాన కార్యదర్శి కస్తూరి హరి ప్రసా ద్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశం ప్రగతి బాటన పయనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ధర్మకర్త డాక్ట ర్ చంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శి జిందం భాస్క ర్,తదితరులు పాల్గొన్నారు. -
దేశ సమైక్యతలో పటేల్ పాత్ర అమోఘం:మోడీ
భారతదేశాన్ని సమైక్యం ఉంచేందుకు కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సర్థార్ వల్లబాయ్ పటేల్ అవిరాళా కృషి చేశారని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వెల్లడించారు. వల్లబాయ్ పటేల్ 63వ వర్థంతి సందర్భంగా ఆదివారం వడోదరాలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ యూనిటీని మోడీ జెండా ఊపి ప్రారంభించారు.అంతకు మందు ఆయన ప్రసంగిస్తూ... దేశాన్ని సమైక్యంగా ఉంచే క్రమంలో వల్లబాయ్ పటేల్ రైతులను భాగస్వాములుగా చేసిన తీరను ఈ సందర్భంగా మోడీ కొనియాడారు. ఆయన వర్థంతి సందర్భంగా దేశ ప్రజల్లో సమైక్యతను పెంపొందించేందుకు రూపొందించిన పరుగుగా ఆయన అభివర్ణించారు. భారతీయుల ఆశలు, ఆశయాలకు తీరేందుకు ఉద్దేశించిన కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వెయ్యి ప్రాంతాల్లో రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తున్నట్లు మోడీ వెల్లడించారు. అలాగే అలహాబాద్‌లో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీని బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ ప్రారంభించారు. ముంబైలో ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ప్రారంభించారు. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొంది.