మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : జాతి సమైక్యతను చాటేలా చేపడుతున్న సర్ధార్ వల్లాభాయ్ పటేల్ భారీ విగ్రహ నిర్మాణ బృహత్తర కార్యక్రమానికి ప్రజలంతా వజ్ర సంకల్పంతో సహకరించాలని స్టాచ్యూ ఆఫ్ రన్ ఫర్ యూనిటీ జిల్లా సమన్వయకర్త ముల్కల్ల మల్లారెడ్డి పిలుపునిచ్చారు. పటేల్‌ను స్మరిస్తూ దేశ ఐక్యత కోసం ఆదివారం ఉదయం 7-30 గంటలకు ఐక్యతా పరుగును మంచిర్యాలలో నిర్వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఐక్యతా పరుగుపై జాతీయ స్థాయిలో ప్రసంగించగా ఎల్‌సీడీల ద్వారా స్థానిక ఐబీ చౌరస్తాలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. పటేల్ జీవిత విశేషాలను తెలియజేస్తూ ఆ మహానీయుడి భారీ విగ్రహ నిర్మాణంలో ఐక్యత చాటుతూ ఆయన రుణం తీర్చుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రపంచంలోనే అతిపెద్దదిగా సర్ధార్ వల్లబాయ్ పటేల్ విగ్రహ నిర్మాణాన్ని గుజరాత్ రాష్ట్రంలోని నర్మద నది ఒడ్డున చేపడుతున్నట్లు తెలిపారు. దేశ సమైక్యత కోసం ఆయన ఎంతో శ్రమించారని కొనియూడారు. ముఖ్యంగా తెలంగాణలో రజాకార్ల ఆకృత్యాలకు చరమగీతం పాడి నిజాం నవాబును లొంగదీసుకుని 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు విమోచనం కల్పించారని గుర్తు చేశారు. అందుకే ఆ మహనీయుడి విగ్రహ నిర్మాణంలో విధిగా పాలుపంచుకోవాల్సిన అవసరముంద ని అన్నారు. స్టాచ్యూ ఆఫ్ రన్ ఫర్ యూనిటీ జిల్లా చైర్మన్ గురిజాల రాధాకిషన్‌రావు, మంచిర్యాల బాధ్యుడు గోనె శ్యాంసుందర్‌రావు, స్వాతంత్ర సమరయోధుడు కె.వి.రమణయ్య, పార్టీలకు అతీతంగా పాల్గొన్న నాయకుడు కెవి.ప్రతాప్, గొంగళ్ల శంకర్, కల్వల జగన్‌మోహన్‌రావు, పూరెళ్ల పోచమల్లు, మల్లేశ్, పెద్దపల్లి పురుషోత్తం, తులా ఆంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, పల్లె భూమేశ్, ప్రభ, లింగన్నపేట విజయ్‌కుమార్, పాటు వివిధ పార్టీల నాయకులు, కళాశాలల యాజమాన్యం, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా స్టాచ్యూ ఆఫ్ రన్ ఫర్ యూనిటీ పరుగు ఐబీ నుంచి పురవీధుల గుండా జాతీయ రహదారి మీదుగా ఐబీ వరకు సాగింది. పరుగులో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ప్రశంస పత్రాలు అందజేశారు.
ఆదిలాబాద్‌లో అట్టహాసంగా..
ఆదిలాబాద్ స్పోర్ట్స్ : జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో ఏక్‌తా ట్రస్ట్, బీజేపీ సమన్వయంతో ఆదివారం రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు.
కార్యక్రమ నిర్వాహక ఇన్‌చార్జి వకుళాభరణం ఆదినాథ్ ఆధ్వర్యంలో పౌర సమాజం అధ్యక్షుడు డాక్టర్ కల్యాణ్‌రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి పరుగును ప్రారంభించారు. అంతకుముందు ఎఫ్‌ఎం రేడియో ద్వారా గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రసంగాన్ని విన్నారు. అనంతరం పరుగును పట్టణంలోని డైట్ మైదానం నుంచి వినాయక్ చౌక్, అశోక్‌రోడ్, గాంధీచౌక్, శివాజీ చౌక్, అంబేద్కర్ చౌక్‌ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. కల్యాణ్‌రెడ్డి మాట్లాడుతూ, భారతదేశ సమైక్యతకు వల్లాభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. జూడాల అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, నియోజకవర్గ ఇన్‌చార్జి జనగం సంతోష్, గిరిజన మోర్చ జాతీయ కార్యదర్శి శ్రీరాంనాయక్, కిసాన్‌మోర్చ అధ్యక్షుడు దీపక్‌సింగ్ షెకావత్, నాయకులు పాల్గొన్నారు.
దేశ సమైక్యతను చాటుదాం
Published Mon, Dec 16 2013 7:01 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement