'సర్దార్ పటేల్ను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది'
హైదరాబాద్ : చైనా యుద్ధంలో ఈశాన్య రాష్ట్రాలను అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు గాలికొదిలేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. శనివారం హైదరాబద్లో అంబేద్కర్ విగ్రహం నుంచి సర్దార్ వల్లభాయ్పటేల్ విగ్రహం వరకు రన్ ఫర్ యూనిటీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ... కుహన లౌకిక వాదులు మోదీ ప్రభుత్వాన్ని సహించలేకపోతున్నాయని విమర్శించారు.
దేశాన్ని నిర్మించిన సర్దార్ పటేల్ను కాంగ్రెస్ మరిచిపోయిందని మండిపడ్డారు. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలను కూడా మరిచిపోయిందన్నారు. ఇది దారుణమైన విషయమని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ప్రపంచం భారత్ వైపు చూస్తుంటే... కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు.
గతంలో ఢిల్లీ చర్చిలో దాడులు, బెంగాల్లో నన్ రేప్ విషయంలో వచ్చిన నివేదికలపై వీళ్లు ఎందుకు మాట్లాడరు అంటూ కిరణ్ రిజిజు కాంగ్రెస్ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.