న్యూఢిల్లీ:
- వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి(జేపీసీ) పంపింది.
- పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో గురువారం కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ప్రవేశ పెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం, వైఎస్సార్‌సీపీ, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, కమ్యూనిస్టు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగాయి.
బిల్లును సమర్ధించుకున్న రిజిజు
మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వక్ఫ్ చట్టంలోని సమస్యలను పరిష్కరించలేకపోయినందున తమ ప్రభుత్వం సవరణలు తీసుకురావాల్సి వచ్చిందన్నారు.
‘మీకు చేతకాకపోవడంతో ఈ సవరణలు తీసుకురావాల్సి వచ్చింది. మేం ఎన్నికైన ప్రజాప్రతినిధులం, ఈ బిల్లుకు మద్దతివ్వండి, కోట్లాది మంది ప్రజల మన్ననలు పొందుతారు.. కొందరు వక్ఫ్ బోర్డులను కబ్జా చేశారు. సామాన్య ముస్లింలకు న్యాయం చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చాం. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు మాఫియాగా మారాయని చాలామంది ప్రతిపక్ష నాయకులు నన్ను వ్యక్తిగతంగా కలిసి చెప్పారు. నేను వారి పేర్లను బహిరంగంగా చెప్పి వారి రాజకీయ జీవితాన్ని నాశనం చేయలేను’ అని రిజిజు తెలిపారు.
ఇది రాజ్యాంగ విరుద్ధ బిల్లు: కాంగ్రెస్
ఇది క్రూరమైన బిల్లు అని, రాజ్యాంగంపై దాడి చేయడమేనని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. కేంద్రం మత స్వేచ్చను ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించాలనే నిబంధనను ఆయన వ్యతిరేకించారు.
ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి: వైఎస్సార్‌సీపీ
ఈ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే మందు ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఇక, ఈ బిల్లును వైఎస్సార్‌సీపీ, టీఎంసీ, ఎస్పీ, కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. అలాగే, టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి.
రాజకీయ కుట్రతోనే సవరణ బిల్లు: ఎస్పీ
రాజ్యంగ స్పూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని సమాజ్‌వాదీ పార్టీ విమర్శలు గుప్పించింది. రాజకీయ కోణంలో భాగంగా ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టినట్లు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు.. బోర్డులో సభ్యులను ఎందుకు నామినేట్ చేయాలని ప్రశ్నించారు. ఏ మత సంస్థలలోనూ తమ కమ్యూనిటీకి చెందని వ్యక్తులు భాగస్వామ్యంగా ఉండరని, వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతరులను చేర్చడంలో ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.
అంతకముందు వక్ఫ్ బోర్డులకు చెందిన భూములను సవరణల ముసుగులో విక్రయించాలని బీజేపీ భావిస్తోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ‘వక్ఫ్ బోర్డ్ సవరణలన్నీ కేవలం ఒక సాకు మాత్రమే. రక్షణ, రైల్వే, నాజుల్ భూముల మాదిరి వక్ఫ్ భూములను విక్రయించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.
స్టాండింగ్ కమిటీకి పంపాలి: ఎన్సీపీ
బిల్లును సభకు తీసుకురావడానికి ముందు ప్రభుత్వం సమగ్ర సంప్రదింపులు జరపలేదని ఎన్సీపీ(శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే అన్నారు. విస్తృత సంప్రదింపుల కోసం ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ఇత ఉన్నపళంగా కేంద్రం ఈ బిల్లు తీసుకురావడానికి వక్ఫ్ బోర్డులో అకస్మాత్తుగా ఏమి జరిగింది అని ప్రశ్నించారు.
ఇది మైనారిటీ వర్గానికి వ్యతిరేకమని డీఎంకే ఎంపీ కనిమొళి విమర్శించారు. హిందూ దేవాలయాలను నిర్వహించడం క్రిస్టియన్, ముస్లింలకు సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన మహమ్మద్ బషీర్, సిపిఎంకు చెందిన కె రాధాక్రిష్ణ్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు
మత స్వేచ్ఛకు భంగం: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..
వక్ఫ్ బిల్లుతో మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. వక్ఫ్ సవరణ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, అధికారాల విభజనకు విఘాతం కలిగిస్తుంది. వక్ఫ్ ఆస్తులు మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ఉన్నాయి. ఆర్టికల్-25కి భంగం కలిగేలా ఈ బిల్లు ఉంది. అల్లా పేరు మీద ఆస్తిని విరాళంగా ఇచ్చే అవకాశం లేకుండా చేశారు. దర్గా, మసీదుల ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు
కాగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఆ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు దీనిని తీసుకువచ్చారు. ఈ బిల్లుకు టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే మద్దతు తెలిపాయి. బిల్లుపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి
రాష్ట్ర వక్ఫ్ బోర్డుల అధికారులు, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, సర్వే, ఆక్రమణలు తొలగింపుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడడమే ఈ చట్టం లక్ష్యం. 1995 వక్ఫ్ చట్టంలోని 44 సెక్షన్లను సవరించాలని కోరుతూ కేంద్రం ఈ బిల్లును ప్రతిపాదించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని, వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని బిల్లు ప్రతిపాదిస్తుంది.
మహిళల వారసత్వ సంపదకు రక్షణ కల్పించాలన్నది మరో కీలక ప్రతిపాదన. అంతేగాక వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతర సభ్యులను చేర్చాలనే నిబంధన ప్రతిపాదిత చట్టంలో వివాదాస్పద అంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment