వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు
పెదగంట్యాడ (విశాఖపట్నం): సముద్ర జలాల నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ (పీడబ్ల్యూక్యూ), ఎకో సిస్టం, సముద్ర తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పరిశోధనలు చేసేందుకు ఎన్‌సీసీఆర్ ప్రధాన భూమిక పోషిస్తుందని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. మంగళవారం యారాడలోని డాల్ఫిన్ నోస్‌పై కొత్తగా నిర్మించిన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (ఎన్‌సీసీఆర్) కేంద్రాన్ని ఢిల్లీ నుంచి ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.
5.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.78 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రంలో మరో 6నెలల్లో రీసెర్చ్‌కు అవసరమైన పరికరాలను సిద్ధం చేస్తామన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తీర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో విపత్తులు ఎక్కువయ్యాయని, ఇటీవల సంభవించిన తుపాన్ల వల్ల ముంబై, చెన్నై వంటి నగరాలు వణికిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 972 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న తీర ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి, తీరం వెంబడి ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా పరిశోధనలు చేయాలని మినిస్ట్రీస్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ డాక్టర్ ఎం.రవిచంద్రన్ కోరారు.
ఇప్పటివరకూ ఎన్‌సీసీఆర్ కేంద్రాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎన్విరాన్మెంట్ విభాగంలో నిర్వహిస్తూ వస్తున్నామని, ఇకపై ఈ భవనంలోకి దానిని తరలించనున్నామని ఎన్‌సీసీఆర్ డైరెక్టర్ ఎంవీ రమణమూర్తి చెప్పారు. అనంతరం ఈ కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ (ఐఐటీఎం), ఎంవోఈఎస్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.కృష్ణన్, ఎంవోఈఎస్ డైరెక్టర్ డాక్టర్ విజయ్‌కుమార్, సీపీడబ్ల్యూడీ చీఫ్ ఇంజినీర్ ఎం.వెంకటేశ్వరరావు, పలువురు శాస్త్రవేత్తలు, రీసెర్చ్ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment