=జనవరి 18న చలో అసెంబ్లీ
=శాసనసభ్యులందరూ పాల్గొనాలి
=సమైక్యాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం డిమాండ్
తిరుపతి, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన బిల్లుకు వ్యతిరేకంగా అఫిడవిట్లు సమర్పించిన వారినే నిజమైన సమైక్యవాదులుగా గుర్తిస్తామని సమైక్యాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం స్పష్టం చేసింది. సోమవారం తిరుపతిలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో శాప్స్, సైమైక్యాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం సంయుక్తంగా ‘రాష్ట్ర విభజన-మన కర్తవ్యం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి.
ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ.పటేల్ మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర విభజనకు ఒడిగడుతున్నారన్నారు. విభనకు మద్దతు ఇస్తున్న బీజేపీ ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని నిర్వహించడం హాస్యాస్పదమని విమర్శిం చారు. అయితే విభజన బిల్లులో శాస్త్రీయత లేదని, ఈ బిల్లు వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందని బీజేపీ ఇప్పుడు ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
పోలవరంను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మాట మార్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా మారుస్తామని చెప్పడం దారుణమన్నారు. ఒక ప్రాంతాన్ని విమర్శిస్తూ జాతీయ భావాలను దెబ్బతీసి రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 19లను దెబ్బతీస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విభజనకు సహకరిస్తున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులను చరిత్ర క్షమించదని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల సంఘం అధ్యక్షుడు అశోక్‌రాజు అన్నారు. ఆర్ అండ్ బీ డెప్యూటీ ఎగ్జిగ్యూటివ్ ఇంజినీర్ శేషారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ.రమణ మాట్లాడారు.
ఇవీ తీర్మానాలు
ఈనెల 18న చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టాలని తీర్మానించారు. జనవరి ఒకటో తేదీ అందరి ఇళ్లముం దు సమైక్యాంధ్ర ముగ్గులు వేసేలా ప్రచారం చేయాలని, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సమైక్యాంధ్రకు మద్దతుగా అఫిడవిట్లను రాష్ట్రపతికి, స్పీకర్‌కు పంపాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు ఆమోదించారు. ఉద్యమంలో అన్ని జేఏసీలు ఒకే తాటిపై నిలిచి పోరాడాలని, రాజకీయనాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం మాని సమైక్య రాష్ట్రం కోసం చేయిచేయి కలిపి నడవాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపు చలో పార్లమెంట్ చేపట్టాలని నిర్ణయించారు. కార్యక్రమంలో వివిధ జేఏసీల నాయకులు ఎం.రమేష్, టి.గోపాల్, సంతానం, రాజేంద్రప్రసాద్‌రెడ్డి, కన్నయ్య, ద్వారకనాథరెడ్డి, ప్రతాప్, డాక్టర్ రాజయ్య పాల్గొన్నారు.
అఫిడవిట్లు ఇస్తేనే నమ్ముతాం
Published Tue, Dec 31 2013 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement