విభజన తప్పే.. క్షమించండి: రఘువీరా
తిరుపతి: రాష్ర్ట విభజన విషయంలో తప్పు చేశామని, ప్రజలు క్షమించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి కోరారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా మంగళవారం ఎంఆర్‌పల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీల అంగీకారంతో విభజన చేశామని, ఇప్పుడు ఆ పాపం కాంగ్రెస్ నెత్తిన వేస్తున్నారని ఆయన అన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ సభ్యుడు తిరువక్కరుసు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే తప్పును సరిదిద్దుకుంటామని చెప్పారు. 126 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ చేసిన చిన్న తప్పునకు ప్రజలు మరణ శిక్ష విధించారని టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. తప్పు తెలుసుకున్నామని, మీ ఓటుతో మరణ శిక్షను తొలగించాలని కోరారు.
వెంకయ్య రాష్ట్రానికి చేసిందేమిటి?
విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి బండారు దత్తాత్రేయ కృషి చేస్తుంటే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయిడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమిటని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. మంగళవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాపై బీజేపీ బిల్లు పెట్టాలని ఏఐసీసీ పరిశీలకుడు కుంతీయ డిమాండ్ చేశారు.