
సాక్షి, అనంతపురం : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. మడకశిరలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ పాలకవర్గ సభ్యుల్లో అర్హులు కానీ వారిని, అన్యమతస్తులను నిమమించి ప్రభుత్వం అపచారం చేసిందని అన్నారు. ఇది పొరపాటు కాదని, అహంకార పూరిత చర్యని ఆయన వాఖ్యానించారు. తాను ఇతర మతాల వారిని, వారి ఆచారాలను గౌరవిస్తానని, ఇది భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. భేషజాలకు పోకుండా వివాదాస్పదులను తొలగించి, అర్హులైన వారిని నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు బీజేపీతో బహిరంగ కాపురం చేసిన ప్రాంతీయ పార్టీలు, నేడు దొంగ చాటుగా కాపురం చేస్తున్నాయని తెలిపారు. బీజేపీ మంత్రి భార్యకి టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించడమే ఇందుకు నిదర్శనమని రఘవీరా ఆరోపించారు.