సాక్షి, కడప: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి పోరాడుతూనే ఉందని చెప్పారు. చట్టసవరణ చేసైనా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని, దీనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందన్నారు.
పార్లమెంట్‌లో విభజన హామీలపై చర్చ జరపకుంటే చరిత్ర హీనులవుతారని ధ్వజమెత్తారు. అవిశ్వాస తీర్మానాన్ని చివరి అస్త్రంగా ఉపయోగిస్తామన్నారు. 2019లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ పైనే పెడతారని చెప్పారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు అవకాశవాది: సీఆర్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మొదటి లేఖ రాసింది సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ అని మాజీ మంత్రి సి. రామచంద్రయ్య గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు అధిక సంఖ్యలో వస్తాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశవాదని, అవకాశాన్ని బట్టి ఆయన మారిపోతుంటారని దుయ్యబట్టారు. భూములు కబ్జా చేసిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment