రాహుల్ గాంధీ, దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఆయన భావి భారత ప్రధాని అవుతారా ? అనే దాని కంటే ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెళ్లెప్పుడవుతుంది బాబూ అంటూ అభిమానులు పాటలు పాడుతున్నారు. గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి అడపాదడపా కెమెరా కంటికి చిక్కినా ఆయన పెళ్లి ఎప్పుడనేది మిలియన్ డాలర్ ప్రశ్నే...ఘనమైన కుటుంబ నేపథ్యంతో వారసత్వ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాహుల్‌ని మొదట్లో అందరూ పప్పూ అని ఎద్దేవా చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పటికీ రాజకీయాలు రంజుగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా విదేశాలకు వెళ్లిపోయేవారు. ఎందుకు వెళ్లేవారో ఎక్కడికి వెళ్లేవారో కొందరు సన్నిహితులకి తప్ప మరెవరికీ తెలిసేది కాదు.
అంతేకాదు ఎన్నోసార్లు తన రాజకీయ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. ప్రజాప్రతినిధుల్ని అనర్హత వేటు నుంచి తప్పించడానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కాపీని విలేకరుల సమావేశంలో అందరి ఎదుట ముక్కలు ముక్కలు చేశారు. ఓ రకంగా చూస్తే అది మంచి పనే అయినప్పటికీ సొంత ప్రభుత్వాన్నే ఇరుకునపెట్టినట్టయింది. దీంతో అందరూ రాహుల్‌ని రాజకీయ వ్యూహాలు ఏమీ చేతకాని వాడిగా ముద్ర వేశారు. ఇంతలో ఏ దేశానికి వెళ్లి శిక్షణ పొందాడో ఏమో కానీ హఠాత్తుగా రాహుల్‌లో చాలా మార్పు కనిపించసాగింది. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఎవరికీ చెప్పాపెట్టకుండానే ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మరో రోజు హఠాత్తుగా హైదరాబాద్ చట్నీస్ రెస్టారెంట్‌లో ప్రత్యక్షమయ్యారు. మందసోర్ రైతుల్ని పరామర్శించడానికి ఏకంగా బైక్‌పైనే వెళ్లారు. ఇక కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక తనపై ఉన్న పప్పూ ముద్రని తొలగించుకొని ఎన్నికల బరిలో మోదీని దీటుగా ఎదుర్కొనే వ్యూహాల్లో కొంతవరకు పై చేయి సాధిస్తున్నారు.
కేంద్రంపై అవిశ్వాసం చర్చ సందర్భంగా అప్పటివరకు మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్, అంతలోనే ఆయన సీటు దగ్గరకి వెళ్లి కౌగిలించుకున్నారు. మళ్లీ తన సీటుకి తిరిగొచ్చాక కన్నుగొట్టి అందరినీ విస్మయంలోకి నెట్టేశారు. విదేశీ పర్యటనల సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ నేతల్ని ఆలింగనం చేసుకున్నట్టే రాహుల్ తాను కూడా చేశారు. కాంగ్రెస్ అంటే ప్రేమను పంచే పార్టీ అని, విద్వేషాల్ని నూరిపోసేది కాదని రిటార్ట్‌లు ఇస్తున్నారు. హిందూత్వ ఓట్లను ఆకర్షించడానికి మానస సరోవర యాత్ర చేసినా, బీజేపీ సవాల్‌ను స్వీకరించి తన కులగోత్రాలు ఇవీ అని బహిరంగంగా వెల్లడించినా అది రాహుల్‌కే సాధ్యమైంది.. అయికిడొలో బ్లాక్‌బెల్ట్ సాధించిన రాహుల్ ప్రతీరోజూ గంట సేపు ప్రాక్టీస్ చేస్తారు. మరి అయికిడొలో ప్రత్యర్థుల్ని మట్టి కరిపించినట్టే ఈ ఎన్నికల్లో మోదీని రాహుల్ ఓడించగలరా ?
- నెహ్రూ గాంధీ కుటుంబంలో నాలుగో తరానికి చెందినవారు. రాజీవ్, సోనియా దంపతులకు 1970, జూన్ 19న జన్మించారు.
- డెహ్రాడూన్ డూన్ స్కూలులో పాఠశాల విద్య అభ్యసించారు.
- రాజీవ్ గాంధీ హత్యానాంతరం రాహుల్‌ని భద్రతా కారణాల రీత్యా ఫ్లోరిడాలోని రాలిన్స్ కాలేజీకి పంపించారు. అక్కడ ఆయన తన ఆనవాళ్లే ఎవరికీ తెలీకుండా ఒక సాధారణ విద్యార్థిలాగే విద్యనభ్యసించారు. పేరు కూడా మార్చేసుకొని రాల్ వించీ అని పెట్టుకున్నారు.
- 1995లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశారు.
- రాహుల్ గాంధీ గర్ల్‌ఫ్రెండ్‌పై రోజుకో ఊహాగానం అప్పట్లో రావడంతో 2004లో తన స్పానిష్ గర్ల్‌ఫ్రెండ్ వెరోనికా కర్టెల్లి గురించి స్వయంగా మీడియాకు వెల్లడించారు. వెనిజులాలో ఆమె ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్నారని చెప్పారు. పెళ్లెప్పుడు అనడిగితే సమాధానం దాటవేశారు
- 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ తన తండ్రి నియోజకవర్గమైన అమేథీ నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించారు
- 2007లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ప్రధాన కార్యదర్శి అయ్యారు
- 2013లో పార్టీకి ఉపాధ్యక్షుడు అయ్యారు
అయినా ఎన్నడూ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టలేదు. అమేథీ నియోజకవర్గానికి పెద్దగా చేసింది లేదు. గాంధీ, నెహ్రూ కుటుంబంపై అభిమానంతో అక్కడ రాహుల్‌కి ఓట్లు పడుతున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో సోషల్ మీడియాలో ఆయన టార్గెట్ అయ్యారు. రాహుల్‌ని పప్పూ అంటూ జోకులు మీమ్‌లతో సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోయాయి. 2017లో రాహుల్ చేతికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వచ్చాయి. అప్పుడే రాహుల్‌లో ఉన్న సత్తా బయటకి వచ్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ రాహుల్ గెలిచాడని ప్రజలు నమ్మారు. అప్పట్నుంచే ఆయనపై పప్పు ముద్ర చెరిగిపోతూ వస్తోంది. రాఫెల్ అంశంలో మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టడం, సోషల్ మీడియాలో కూడా మోదీతో పోటీపడడం వంటి అంశాలు రాహుల్‌ని బలమైన ప్రత్యర్థిగానే నిలబెట్టాయి. గత ఏడాది మూడు హిందీ రాష్ట్రాల్లో రాహుల్ ఒంటిచేత్తోనే ప్రచారం చేసి కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో పక్కా ప్రణాళికలతో లోక్‌సభ బరిలోకి దూకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment