మాట మీద నిలబడే నిబద్ధత, నిజాలు పలికే నిజాయితీ రెండూ లేని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల తన ‘మనసులోని మాట’ను దాచుకోలేక ‘అమరావతి 2 లక్షల కోట్ల రూపాయల సంపదకు కేంద్రంగా మారేది’ అని అసలు నిజాన్ని బయటకు వెళ్లగక్కారు. తను పక్కా వ్యూహంతో.. రాజధాని ప్రకటనకంటే ముందే తన అనుయాయులు, బినామీలతో వందల ఎకరాలు కొనుగోలు చేయించిన భూములకు రెక్కలొచ్చే విధంగా వేసిన ప్రణాళిక దెబ్బతినడంతో రూ. 2 లక్షల కోట్లు దక్కకుండా పోయిందని చంద్రబాబు బాధ పడుతున్నారు. అమాయక రైతులను ఆశల పల్లకీలో ఊరేగించి ల్యాండ్ పూలింగ్ అనే విధానాన్ని తెచ్చి సేకరించిన 32,000 ఎకరాలతో వ్యాపారం చేయాలని చంద్రబాబు తలపోశారు. అందులో భాగంగానే అమరావతిని విపరీతంగా పైకెత్తారు. హైప్ క్రియేట్ చేశారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లను తలదన్నేవిధంగా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తానంటూ చంద్రబాబు ప్రత్యేక విమానాలలో ప్రపంచ దేశాలను చుట్టి రావడం ప్రజలు గమనించారు. అలా ఐదేళ్లూ వృథాగా కాలక్షేపం చేసిన చంద్రబాబుపై అమరావతి రైతులు పల్లెత్తు మాట అనకపోవడం ఆశ్చర్యమే! (చదవండి: మీరు చేస్తే అప్పు! వీరు చేస్తే తప్పా?)
అభివృద్ధి పేరుతో చంద్రబాబు తన సొంత మనుషులకు ప్రయోజనం కల్పించడం అన్నది హైదరాబాద్ విషయంలో కూడా జరిగింది. 9 ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు వేసిన పాచికలు పారాయి. ఆ సమయంలో చంద్రబాబు హైదరాబాద్‌లో అత్యధికంగా సంపన్నులు నివాసం ఉండే మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాలలో ముందుగానే తన బినామీలతో పెద్ద ఎత్తున భూముల్ని తక్కువ ధరకు కొనిపించారు. ఆ తర్వాత ఐటీ పేరుతో అనేక సంస్థలకు భారీ రాయితీలు కల్పించి ఒకేచోట ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయించారు. (చదవండి: ఈ విద్యావిధానం దేశానికే ఆదర్శం)
చంద్రబాబు తొలిసారిగా సీఎం కాగానే ఆయన బినామీలు కొందరు రియల్టర్లుగా మారారు. ఓ సినీ నటుడు స్వతహాగా రియల్టర్ కానప్పటికీ.. చంద్రబాబుకు బినామీగా అప్పటికప్పుడు రియల్టర్‌గా మారి కొన్ని వందల ఎకరాలను హైటెక్ సిటీ, మరికొన్ని ఐటీ కంపెనీలు రాకముందే కొనుగోలు చేశారు. ఆ సినీ నటుడు కొనుగోలు చేసిన స్థలాలకు సమీపంలోనే ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. దాంతో ఒక్కసారిగా ఆ సినీనటుడి భూముల విలువ వేల కోట్లకు చేరింది. ఆశ్చర్యం ఏమంటే.. ఆ సినీనటుడు రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు కనపడదు.
మామూలుగా అయితే.. వందల కోట్ల నిధులు ఒక్క ప్రాంతంలోనే ఖర్చు చేస్తే.. సమాధానం చెప్పడం కష్టం కనుక తెలివిగా గచ్చిబౌలి స్టేడియంలో ఏడాది వ్యవధిలో రెండు ప్రధాన క్రీడోత్సవాలు.. 1) జాతీయ క్రీడలు, 2) ఆఫ్రోఏసియన్ క్రీడలు నిర్వహించి అందులో పాల్గొనే క్రీడాకారులు, అధికారులకు, ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించే సాకుతో విశాలమైన రోడ్లు, లైటింగ్, ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున ఏర్పరిచారు. క్రీడల నిర్వహణ పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని ఆ ప్రాంతంలో విచ్చలవిడిగా ఖర్చుపెట్టేశారు. అదే ప్రాంతంలో ‘ఫార్ములావన్ రేసు’ను కూడా నిర్వహించాలని విఫల ప్రయత్నాలు చేశారు.
నిజానికి, చంద్రబాబు కంటే ముందు పరిపాలించిన ఏ సీఎం కూడా తమ భూముల విలువను పెంచుకోవడం కోసం తమతమ ప్రాంతాలలో కంపెనీలు, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఏర్పాటైన అనేక అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలను నగరం నాలుగు దిక్కులా అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణకు దోహదం చేశారు. కానీ, చంద్రబాబు ఒకేచోట అభివృద్ధిని కేంద్రీకరించాలను కోవడానికి కారణం తన, తన అనుయాయుల భూములు, ఆస్తుల విలువ పెంచుకోవడం కోసమే. సైబరాబాద్‌లో అమలు చేసిన విధానాన్నే అమరావతిలో కూడా అమలు చేయాలని చూశారు. ముందుగా ఆ ప్రాంతంలో భూముల్ని కారుచౌకగా కొనిపించారు. ప్రపంచస్థాయి రాజధాని పేరుతో అన్ని సంస్థలు, కార్యాలయాలు అక్కడే వచ్చేవిధంగా ప్రణాళిక అమలు చేశారు. ఒకపక్క ప్రజల రాజధాని అమరావతి అని పైకి చెబుతూ.. దానిని సంపన్నుల స్థావరంగా మార్చాలనుకొన్నారు.
అధికారంలో ఉన్నవారు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయగలగాలి. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఆ ప్రాంతాలలో విద్య, ఆరోగ్యం ఉపాధి తదితర మౌలిక సదుపాయాలను విస్తృతంగా లభించేటట్లు చర్యలు తీసుకుంటేనే సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలు తగ్గుతాయి. కానీ, చంద్రబాబుకు ఆ సామాజిక దృష్టి కోణం లేదు. ఎంతవరకూ.. ఒక ప్రాంతం, ఒక వర్గం అభివృద్ధి చెందాలన్న తపన, ఆరాటమే ఆయనలో కన్పిస్తుంది. ప్రజలు ఛీకొట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా.. కొన్ని మీడియా సంస్థల దన్నుతో అమరావతిలోనే రాజధాని కట్టాలని, అభివృద్ధి మొత్తం అక్కడే జరగాలని ఒత్తిడి చేస్తూ కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారు. ప్రతి రోజూ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు.
వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ.. ఇంకా మిగతా ప్రాంతాలలో ఉన్న మెట్టప్రాంతాలు.. వీటి సమగ్రాభివృద్ధి లక్ష్యంగా.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదన చేశారు. అధికార వికేంద్రీకరణ ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్న కృత్రిమ ఉద్యమం సంపన్న వర్గాల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి.. వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారులను చేసేందుకు కృషిచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లభించని అవకాశం పేద బడుగు బలహీన వర్గాలకు వైఎస్ జగన్ రూపంలో లభించింది.
నిజానికి చంద్రబాబు సాగిస్తున్న అధర్మపోరాటం సీఎం జగన్‌పై కాదు.. పేద బడుగు బలహీన వర్గాలపైనే! రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. డబ్బులు పంచిపెడుతున్నారంటూ.. బడుగుల పట్ల అక్కసు చూపుతున్నారు. వారి నోటికి అందే లబ్ధిని లాగేయాలని చూస్తున్నారు. న్యాయస్థానాలలో కేసులు వేయిస్తున్నారు. అప్పులు పెరుగుతున్నాయని దుష్ప్రచారం సాగిస్తున్నారు. కానీ చరిత్రలో అధర్మపోరాటం విజయం సాధించిన ఉదంతాలు ఎక్కడా లేవు. బడుగులపై బండలు వేయడం చంద్రబాబు మానుకోవాలి. నేడు కాకుంటే రేపైనా అమరావతి రైతులు తమకు ద్రోహం చేసింది చంద్రబాబేనన్న వాస్తవాన్ని గ్రహిస్తారు, తనపై తిరుగుబాటు చేస్తారు. ఇది తథ్యం.
- సి. రామచంద్రయ్య
వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు
ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్
Comments
Please login to add a commentAdd a comment