విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రఘువీరారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : మోసకారి నరేంద్ర మోదీ రాక్షస పాలనకు నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మే 26న రణ శంఖారావం పూరించనున్నామని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. ఇందిరాభవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 100 రోజుల్లో నల్లధనం వెలికితీస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసిన మోదీ సన్నిహితులు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీలు విదేశాల్లో దర్జాగా ఉన్నారన్నారు. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవినీతి, వ్యాపం కుంభకోణం మోదీ హయాంలోనే వెలుగు చూశాయన్నారు.
‘పెద్ద నోట్ల రద్దు పెద్ద కుంభకోణం. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. బ్యాంకుల్లో క్యాష్ నిల్, బీజేపీ నేతల ఇళ్లల్లో క్యాష్ ఫుల్‌గా పరిస్థితి మారింది. దళిత, ఎస్టీ, మైనారిటీలను రెండో శ్రేణి పౌరులుగా మోదీ ప్రభుత్వం చూస్తోంది. మహిళలు, బాలికలకు రక్షణ కొరవడింది. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తుంగలో తొక్కి గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి ఎమ్మెల్యేలను కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను అనూహ్యంగా పెంచుతున్నారు.
రాజ్యాంగ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. మోదీ పాలన రాక్షస పాలన. దీన్నిఅంతమొందించాల’ని ప్రజలకు రఘువీరా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యం కాదని, మోదీ ముక్త్ బీజేపీ కోసం ఆ పార్టీకి చెందిన వారే ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రైతుల విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని ధ్వజమెత్తారు.
40 వేల కోట్ల రూపాయల రొయ్యలను మన దేశ రైతులు ఎగుమతి చేస్తే, అందులో సగం రాష్ట్ర రైతులే ఎగుమతి చేశారని తెలిపారు. రొయ్యల ధర పడిపోవడంతో 4 వేల కోట్ల రుపాయల నష్టం వాటిల్లిందని, దీనిపై మాత్రం ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘
టీటీడీలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల వల్ల దేవుడి మీద నమ్మకం సన్నగిల్లే పరిస్థితి వచ్చింది. వ్యక్తి, పూజారి మీద కోపంతో దేవాలయాల మీద కక్ష కట్టొద్దని, వ్యవస్థ మీద బేషజాలకు పోకుండా వివాదం తొలగించాల’ని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment