చిరంజీవి కాంగ్రెస్‌ను వీడరు: రఘువీరా
సాక్షి, హైదరాబాద్/మడకశిర, న్యూస్‌లైన్: రాజ్యసభ సభ్యుడు, ఏపీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ సారథి చిరంజీవి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్తున్నట్టు వస్తున్న వార్తలను ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తోసిపుచ్చారు. చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉంటారని స్పష్టం చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా మడకశిరలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గెలుపోటములు ఏ పార్టీకైనా సాధారణమని, ఏపీ అభివృద్ధి విషయంలో వాచ్‌డాగ్‌లా వ్యవహరించడంతోపాటు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వెంటనే రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఖరీఫ్ వ్యవసాయం కుంటుపడే ప్రమాదముందన్నారు. మరోపక్క, చిరంజీవి పార్టీ మారుతున్నారనే వార్తలను ఏపీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు కూడా ఖండించారు. ఈ మేరకు గురువారం ఆయన హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
గవర్నర్ చొరవ చూపాలి..
రాష్ట్రంలో వరి రైతులను ఆదుకునేందుకు గవర్నర్ చొరవ చూపాలని పద్మరాజు కోరారు. అకాల వర్షాలతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వీరిని ఆదుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరముందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో సాధారణ రకానికి రూ.1,300, గ్రేడ్ ఏ రకానికి రూ.1,340 ఇచ్చిన విషయాన్ని పద్మరాజు గుర్తుచేశారు. వరి గిట్టుబాటు ధర సాధారణ రకానికి కనీసం రూ.1,310, ఏ గ్రేడ్‌కు రూ.1,340 ఇవ్వాలని సూచించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఫీజు రియింబర్స్‌మెంట్ అంశాన్ని పేర్కొనలేదని, ఫలితంగా విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.