'మీడియాను రానివ్వకుండా మమ్మల్ని నిర్బంధించారు'
రాజమండ్రి: కాపునాడు నాయకుడు ముద్రగడ పద్మనాభానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తమను సోమవారం రాజమండ్రి విమానాశ్రయంలో అరెస్ట్ చేసి నిర్బంధించడం పట్ల కాంగ్రెస్ నేతలు రఘువీరా రెడ్డి, చిరంజీవి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అరాచకాలు జరుగుతాయని తమను ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పీసీసీ చీఫ్ రఘువీరా మాట్లాడుతూ.. 'రాజమండ్రి విమానాశ్రయానికి ఉదయం 11.30కి చిరంజీవితో కలసి వచ్చాం. సి.రామచంద్రయ్య, పళ్లంరాజు, వట్టి వసంతకుమార్ కలిసి కిర్లంపూడి వెళ్లి ముద్రగడను పరామర్శించాలనుకున్నాం. కాపు రిజర్వేషన్ల సమస్యకు పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో వస్తే, అతి దుర్మార్గంగా మమ్మల్ని ముందస్తుగా అరెస్టు చేశారు. కనీసం మీడియాను కూడా రానివ్వకుండా గంటన్నర పాటు నిర్బంధించారు. ఇది ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట. దీన్ని ఖండిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు కాపులకు రిజర్వేషన్ కల్పించాలి. ఇది కేవలం కాపులకు సంబంధించిన సమస్య కాదు.. మొత్తం ప్రజాస్వామ్య సమస్య. మాకు, ప్రజలకు మధ్య గోడ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. మేం కిర్లంపూడి వెళ్లి తీరాలి. వెళ్లకుండా వెనుదిరిగే ప్రసక్తి లేదు' అని అన్నారు.
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మాట్లాడుతూ.. 'కాపు ఉద్యమసారథి ముద్రగడను పరామర్శించి, సంఘీభావం తెలిపేందుకు మేమంతా వచ్చాం. కిర్లంపూడి వెళ్లి సామరస్యంగా మాట్లాడదామని వచ్చాం. ఏ అరాచకాలు, గందరగోళం జరుగుతాయని మమ్మల్ని ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించారు. ఇది అప్రజాస్వామికం. సీఎం ఏం చూసి భయపడి ఇలా నిర్బంధిస్తున్నారో అర్థంకావడం లేదు. మేమంతా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులమే. మేం ప్రభుత్వానికి, ఉద్యమ పెద్దలకు మధ్య వారధిగా ఉండి ప్రయోజనాత్మక సలహాలు ఇవ్వాలని వస్తే ఇలా అరెస్టు చేయడం ఎంతవరకు సబబు? కేవలం వాళ్ల తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, మా నోళ్లు మూయించడానికి జరుగుతున్న ప్రయత్నం. మేం రెచ్చగొట్టేవాళ్లం కాదు' అని చెప్పారు.