ముద్రగడకు ఏదైనా హాని జరిగితే సర్కారుదే బాధ్యత
చంద్రబాబుపై కాపు ప్రముఖుల ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని కాపు ప్రముఖులు హెచ్చరించారు. ప్రభుత్వం రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని చంద్రబాబుకు అల్టిమేటమ్ ఇచ్చారు. సామాజిక సమస్యను టైస్టు సమస్యగా మారుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు జాతిపై బురద జల్లాలని చూస్తే చంద్రబాబు పై చల్లడానికి తమ వద్ద అంతకన్నా పెద్ద బురద ఉంది జాగ్రత్త అని హెచ్చరించారు.
ముద్రగడ పద్మనాభం దీక్ష, కాపు రిజర్వేషన్ల పోరాటం, భవిష్యత్ కార్యక్రమాన్ని చర్చించేందుకు కాపు ప్రముఖులు సోమవారమిక్కడ ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు, సినీనటుడు - కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, వైఎస్సార్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు, కాంగ్రెస్ నేతలు పల్లంరాజు, సి.రామచంద్రయ్య, కాపు ప్రముఖులు ఎంవీ కృష్ణారావు, తోట చంద్రశేఖరరావు, కాపునాడు నాయకులు కఠారి అప్పారావు, బీజేపీ నాయకుడు అద్దేపల్లి శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ముద్రగడ దీక్ష అనంతర పరిస్థితులను క్షుణ్ణంగా చర్చించారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా గర్హించారు. దాసరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరును గర్హిస్తూ పలు తీర్మానాలు చేసింది. అనంతరం కాపు ప్రముఖులు అంబటి రాంబాబు, బొత్స తదితరులతో కలిసి దాసరి, చిరంజీవి మీడియాతో మాట్లాడారు. వాళ్లు ఏమన్నారంటే...
ఆ పద్ధతి మంచిది కాదు: దాసరి
‘‘వంగవీటి రంగాను పొగొట్టుకున్న మేము ముద్రగడ పద్మనాభాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనన్న ఒక ఆవేదనతో ఈ సమావేశాన్ని ఈరోజున ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం దీనిపట్ల, ఆయన పట్ల, ఆ జాతిపట్ల చూపిస్తున్న వివక్ష చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక సామాజిక సమస్య. సామాజిక సమస్యను టైస్టు సమస్యగా భావించి ప్రభుత్వం తీసుకుంటున్న విధానం.. మీడియాను కట్ చేసి... కాపు సోదరులు, సోదరీమణులు ఎవరు బయటికి వచ్చినా వాళ్లను అరెస్టులు చేయడం, సాయంత్రం వరకు పోలీసు స్టేషన్లలో పెట్టడం, మాట్లాడడానికి అవకాశం లేకుండా జామర్లు పెట్టడం, ముద్రగడతో మాట్లాడడానికి అవకాశం లేకుండా ఆస్పత్రిలోనూ జామర్లు పెట్టడం ఇది ఎక్కడా, బహుశా ఎక్కడా ఉండదు.. మనం ఆంధ్రాలో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా? పాకిస్తాన్‌లో ఉన్నామా? అనే వాతావరణం తూర్పు, పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల్లో కల్పించడం భాదాకరం.
కాబట్టి మేము చర్చించడం జరిగింది. దీని మీద ప్రభుత్వం స్పందించి... ఆయన (ముద్రగడ ) జేఏసీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు కాబట్టి ప్రభుత్వం వాళ్లతో చర్చించి దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలి. దానికి మేమందరం ఏకకంఠంతో..ఆయన వెనుక మేమున్నామని చెబుతున్నాం. జాతి వెనుక మేమంతా ఉన్నాం, ఎవ్వరూ ఒంటరి మాత్రం అని అనుకోవద్దు అని చెప్పడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ప్రభుత్వానికి వదిలేస్తున్నాం. రెండు రోజుల గడువు ఇస్తున్నాం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై మా నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. ’’
ప్రభుత్వానిదే బాధ్యత: చిరంజీవి
‘‘ముద్రగడ పద్మనాభం దీక్ష పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా అప్రజాస్వామికం. దీక్షకు కూర్చున్న రెండు గంటల లోపే ఆ ఇంటి తలుపులు పగులగొట్టి, నిర్బంధించి అయోమయ పరిస్థితి అంతటా కల్పించారు. అక్కడకు వచ్చిన ప్రజల పట్ల ప్రత్యేకించి మహిళల పట్ల అసభ్యంగా, అమానుషంగా ప్రవర్తించారు. చివరకు ముద్రగడ కుటుంబ సభ్యులు చివరకు వారి బిడ్డలు, కోడళ్లు, భార్య పట్ల కూడా పోలీసులు వివక్షతో అమానుషంగా ప్రవర్తించడం హేయమైన చర్య. ఈ పరిస్థితి చాలా దురదృష్టకరం. మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా ముద్రగడ పద్మనాభం అడక్కూడనిది ఏమి అడిగారు? ముద్రగడ అదనంగా ఏమి అడిగారు గనుక..? మేనిఫెస్టోలో ఏమి పెట్టారో, ఎన్నికల సమయంలో ఏమి చేస్తామని హామీలు ఇచ్చారో.. ఎన్నికల సంఘానికి అఫిడవిట్‌గా సమర్పించిందే అమలు చేయమని ముద్రగడ గారు అడిగారు. తునిలో జరిగిన అనుకోని సంఘటనను మేమెవ్వరం సమర్ధించబోం. హర్షణీయం కాదు. కాకపోతే అమాయకులను అరెస్టు చేయడమే అన్యాయం.ముద్రగడకు సంఘీభావం తెలుపడానికే మేం ఇక్కడ సమావేశమయ్యాం. ఆయన (ముద్రగడ) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆయనకు ఏమీ జరక్కుండా చూడాలి. ఆయనకు జరగరానిది ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.’’
తీర్మానాలు ఇవీ... : ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతును ప్రకటించడమే కాకుండా ఆయన వెంటే అండగా నిలబడాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై సమావేశం ఆందోళనను వ్యక్తం చేసింది.
► ముద్రగడ పద్మనాభం ఇంటి తలుపులు పగులగొట్టి నిర్బంధించిన విధానాన్నీ, మహిళలని కూడా చూడకుండా భార్య, కోడళ్లను కూడా నేరస్తుల కంటే హీనంగా పోలీసులు ప్రవర్తించిన తీరును ఏకకంఠంతో ఈ సమావేశం ఖండించింది. ముద్రగడ తనయుణ్ణి పాశవికంగా పోలీసులు తరిమితరిమి కొట్టి, వేధించిన విషయాన్ని ఆ సమయంలో మీడియాను బలవంతంగా బయటకునెట్టి కొందరి దగ్గర ఉన్న ఈ సంఘటన క్లిప్పింగులను బలవంతంగా లాక్కున్న విధానాన్ని.. ఈ సమావేశం- అప్రజాస్వామ్యం, ఆటవిక చర్యగా పరిగణించి ఖండించింది.
► ఏ కాపు సోదరుడు గానీ, సోదరి గానీ ఇంటి నుంచి బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లలేని ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తూ అనధికారికంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించి- 144 మాత్రమే అమల్లో ఉందని కోర్టుకు తెలియజేయడం తీవ్ర ఆక్షేపణీయం. స నిరంకుశత్వంగా మీడియాపై ఆంక్షలు విధించి ఛానల్ ప్రసారాలను నిలిపివేయడం బాహ్య ప్రపంచానికి విషయాలు తెలియకుండా అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ఈ తరుణంలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులతో ప్రభుత్వం మాట్లాడిస్తూ ఎదురుదాడి చేయించడం అప్రజాస్వామ్యం, అనాగరికం. వారిపై వత్తిడి చేసి విభజించి సాధించాలనే ఈ ఎత్తుగడను ఖండిస్తున్నాం. ఆయా నాయకులు దీన్ని అర్థం చేసుకుని సహకరించాలి.
► రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తున్న ఉద్రిక్తతలను తొలగించి తక్షణమే ముద్రగడ దీక్షను విరమింపజేసేందుకు ఆయన కోరిన విధంగా జేఏసీ ద్వారా చర్చలు జరిపి దీక్షను విరమింపజేయాలి. ఈ వ్యవహారంపై మళ్లీ సమావేశం నిర్వహిస్తాం. రెండు రోజుల్లో పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
దేశ ప్రజల దృష్టికి ఏపీ ప్రభుత్వ తీరు
కాపు నేతల సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్ష సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం, పోలీసులు సృష్టించిన బీభత్స వాతావరణాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సోమవారమిక్కడ సమావేశమైన కాపు ప్రముఖుల సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పౌరహక్కుల సంఘాలు, ప్రముఖ న్యాయవాదులతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయించాలనే సూచనను సమావేశం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. ఈ కమిటీలో కాపులు కాకుండా మిగతా వర్గాల ప్రముఖులు కూడా ఉండేలా చూడాలని భావించింది.