తీవ్ర పరిణామాలు తప్పవు: చిరంజీవి
కాపు రిజర్వేషన్ల అంశంపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి ఏమైనా అయితే తీవ్ర పరిణామాలు తప్పవని కాంగ్రెస్ నాయకుడు, సినీనటుడు చిరంజీవి హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం జాప్యం చేసినా, నిర్లక్ష్యం వహించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం, ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన కాపు ప్రముఖులు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత చిరంజీవి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలపై ప్రభుత్వానికి రెండు రోజుల సమయం ఇస్తున్నామని, లేదంటే రెండు రోజుల తర్వాత సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ముద్రగడ కుటుంబసభ్యులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
గత పది రోజులుగా ఏపీలో చాలా ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని, ఇది చాలా అప్రజాస్వామికమని చిరంజీవి అన్నారు. ముద్రగడ పద్మనాభం దీక్ష ప్రారంభించిన రెండు గంటల్లోపే తలుపులు పగలగొట్టి, ఆయనను నిర్బంధించి అయోమయ పరిస్థితి కల్పించారని, ఆయన కోడలు, భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. దీన్ని తామంతా కలిసికట్టుగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. ఆయన అడగకూడనిది ఏమీ అడగలేదని, టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినవి, ఎన్నికల కమిషన్‌కు సమర్పించినవే అడిగారని గుర్తు చేశారు. తుని ఘటనను తామెవరూ సమర్థించబోమని, అయితే ప్రభుత్వ ప్రతినిధులే ఆ ఘటనలో గోదావరి జిల్లాలకు చెందినవాళ్లు ఎవరూ లేరని.. పులివెందుల వాళ్లే ఉన్నారని అప్పట్లో చెప్పారని గుర్తుచేశారు. అలాంటి మీరు ఈ రోజున అక్కడి యువకులను నిర్బంధించి, వాళ్లకు సంఘీభావం తెలిపిన వాళ్లను జైల్లో పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ముద్రగడ ఆరోగ్యం ఎలా ఉందోనన్న ఆందోళన తామందరికీ ఉందని చెప్పారు.
ఈ సమావేశంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు తదితరులతో పాటు కాంగ్రెస్ నేతలు, పలువురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశంలో పలు తీర్మానాలు చేశామని, వాటిని మీడియాకు అందిస్తామని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు.