రంగాను పోగొట్టుకున్నాం.. ముద్రగడను పోగొట్టుకోలేం
► ఏపీలో ఉన్నామా, పాక్‌లో ఉన్నామా అనిపిస్తోంది
► ప్రభుత్వం దీన్ని ఉగ్రవాద సమస్యలా చూస్తోంది
► కాపు మంత్రులతో బురద చల్లిస్తే.. మా దగ్గరా అస్త్రాలున్నాయి
► ఏపీ ప్రభుత్వంపై మండిపడిన దాసరి నారాయణరావు
హైదరాబాద్
ఒకప్పుడు వంగవీటి మోహన రంగాను పోగొట్టుకున్నామని, ఇపుడు ముద్రగడ పద్మనాభాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతోనే తామంతా సమావేశమయ్యామని ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. ఒక జాతి పట్ల, ఒక నాయకుడి పట్ల చూపుతున్న వివక్ష బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్క్ హయత్ హోటల్లో కాపు ప్రముఖులు సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ఒక సామాజిక సమస్య అని.. అయితే దాన్ని ఒక ఉగ్రవాద సమస్యగా భావించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హేయమని అన్నారు. ఈ విషయాలను కవర్ చేస్తున్న మీడియాను కట్ చేసేస్తున్నారని, కాపు సోదర సోదరీమణులను అరెస్టుచేసి పోలీసుస్టేషన్లో పెట్టడం, అక్కడ కూడా జామర్లు పెట్టడం, ముద్రగడను చేర్పించిన రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో కూడా జామర్లు పెట్టి ఆయనతో ఎవరినీ మాట్లాడనివ్వకపోవడం.. ఎక్కడా ఇంతవరకు జరగలేదని దాసరి మండిపడ్డారు.
ఇదంతా చూస్తుంటే అసలు మనం ఏపీలో ఉన్నామా, పాకిస్తాన్‌లో ఉన్నామా అనే వాతావరణం తూర్పుగోదావరిలో కనిపిస్తోందని, ఇది చాలా బాధాకరమని అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని, ముద్రగడ కూడా చర్చలకు సిద్ధమన్నారు కాబట్టి.. ప్రభుత్వం త్వరగా స్పందించి దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. ఆయన వెనక తామున్నామని, జాతి వెనక తామంతా ఉన్నామని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటుచేశామన్నారు. ఈ ఉద్యమాన్ని సమర్థించే వాళ్లపై బురద చల్లించాలని కాపు మంత్రులతో ప్రయత్నం చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని దాసరి నారాయణరావు అన్నారు. అలాంటి బురదజల్లే కార్యక్రమాలు మీరు మొదలుపెడితే, దానికి తమ దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి జాగ్రత్త అని హెచ్చరించారు.