అన్నిటికీ రెడీగా ఉన్నా: ముద్రగడ
హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్ల సాధన కోసమే రోడ్డు ఎక్కామని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. తమకు ఈ పరిస్థితి కల్పించింది ఏపీ సీఎం చంద్రబాబేనని తెలిపారు. దాసరి నారాయణరావు నివాసంలో కాపు నాయకులతో మంగళవారం ఆయన భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హామీని అమలు చేయమని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు.
బ్రిటీష్ కాలంలో తాము బీసీల్లో ఉన్నామని వెల్లడించారు. తాము ఏ కులానికి వ్యతిరేకం కాదని, తమ జాతికి రిజర్వేషన్లు కల్పించాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. రిజర్వేషన్లు వచ్చే పోరాటం కొనసాగిస్తామని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాటాకు చప్పుళ్లకు బెదరమని అన్నారు. టీడీపీ కేడర్ లో ఉన్న మా కులం వాళ్లతో తనను తిట్టిస్తున్నారని వాపోయారు. తమ కులంలో కొంత మంది చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము అన్నిటికీ తయారుగా ఉన్నామని, పోలీసులు ఏం చేసుకున్నా ఫర్వాలేదని ముద్రగడ అన్నారు.