11న అన్ని జిల్లాల కాపు నేతలతో ముద్రగడ భేటీ
హైదరాబాద్ : వచ్చే నెల 11న అన్ని జిల్లాల కాపు నేతలతో భేటీ కానున్నట్లు కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చేవరకూ తాము నిద్రపోయేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని ముద్రగడ డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రముఖ దర్శక, నిర్మాత, కేంద్ర మాజీమంత్రి దాసరి నారాయణరావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి తామంతా వెన్నంటి ఉంటామన్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా ముద్రగడ పోరాడుతున్నారని ఆయన అన్నారు. కాగా ఇవాళ దాసరి నివాసంలో ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర కాపు ప్రముఖులు సమావేశమైన విషయం తెలిసిందే.