ఇక ఊరూరా కాపుల దండోరా!
- దశల వారీ ఆందోళన
- కాపు ప్రముఖులతో ముద్రగడ భేటీ
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్ల కోసం ఇక ఊరూరా పోరుబాట పట్టాలని కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నిర్ణయించింది. అంతిమ పోరాటానికి సిద్ధమయ్యే ముందు దశల వారీ పోరాటం చేయాలని తీర్మానించింది. చంద్రబాబు ఇచ్చిన మాట తప్పడం వల్లే తాము రోడ్లమీదకు వచ్చామని, తాడో పేడో తేల్చుకునే వరకు వెనుదిరిగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. రిజర్వేషన్ల పోరుపై దిశా దశను నిర్ణయించేందుకు నగరానికి వచ్చిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఆయన అనుచరులు మంగళవారమిక్కడ కాపు ప్రముఖులతో సమావేశమయ్యారు.
ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సి.రామచంద్రయ్య (కాంగ్రెస్), బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు (వైఎస్సార్‌సీపీ), అద్దేపల్లి శ్రీధర్ (బీజేపీ), తోట చంద్రశేఖర్ (పారిశ్రామికవేత్త), కాపు సంఘాల ప్రముఖులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, దిలీప్, ఎంహెచ్‌రావు, కేవీరావు, ఎంవీ రావు, కఠారి అప్పారావు, చందు జనార్దన్, సినీనటి హేమ, 13 జిల్లాల జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి చిరంజీవి గైర్హాజరయ్యారు. అనంతరం దాసరి, ముద్రగడ మీడియాతో మాట్లాడారు. తమ జాతిని రోడ్ల మీదకు తీసుకు వచ్చిందే చంద్రబాబని ముద్రగడ దుయ్యబట్టారు. తమ డిమాండ్ సాధనకు దశల వారీగా ఉద్యమించాలని నిర్ణయించినట్టు చెప్పారు. కాపు రిజర్వేషన్ల పోరాట సమితిని నిర్మాణపరంగా తీర్చిదిద్ది ప్రతి 15 రోజులకోసారి నిరసన కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఈ ఆందోళనలో తాను ప్రత్యక్షంగా పాల్గొంటానని, రిజర్వేషన్లపై కాపులతో పాటు ఇతర కులాల ప్రముఖులతోనూ చర్చిస్తానని చెప్పారు.