మా మద్దతు ఉంటుంది: చిరంజీవి
హైదరాబాద్ : కాపు రిజర్వేషన్లపై ఉద్యమిస్తున్న కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు తమ మద్దతు ఉంటుందని సినీనటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలిపారు. ఆయన చేపట్టిన బృహత్ మహాకార్యానికి తామంతా అండగా ఉంటామన్నారు. ముద్రగడ పద్మనాభం శనివారం చిరంజీవితో భేటీ అయ్యారు.
కాపు ఉద్యమానికి సంబంధించిన అంశాలపై ఆయన చర్చించారు. కాపులను బీసీల్లో చేర్చే వరకూ అండగా ఉండాలని కోరారు. అలాగే కాపు గర్జన సమయంలో మద్దతుగా నిలిచినందుకు చిరంజీవికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భేటీ అనంతరం చిరంజీవి మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లపై ముద్రగడ చేస్తున్న పోరాటం ప్రశంసనీయమన్నారు. తమ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై ముద్రగడ వివరించినట్లు చెప్పారు.
ముద్రగడ అంతకు ముందు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, దర్శకరత్న దాసరి నారాయణరావుతో కూడా సమావేశం అయ్యారు. ఉద్యమంపై ఆయన వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ ఆగస్టులోగా కాపులను బీసీల్లోకి చేర్చాలన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుంటే మళ్లీ రోడ్డెక్కి ఆందోళన బాట పడతామని ఆయన హెచ్చరించారు. కాపు ఉద్యమానికి మద్దతు ఇచ్చే ప్రతి నేతను తాను కలుస్తానని ముద్రగడ తెలిపారు.