రఘువీరా, చిరంజీవి అరెస్ట్
రాజమండ్రి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపేందుకు రాజమండ్రి చేరుకున్న పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిలను పోలీసులు అడ్డుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న ఇరువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు విమానాశ్రయం వెలుపల పెద్ద ఎత్తున బైఠాయించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తమ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎయిర్ పోర్టు నుంచి రఘువీరారెడ్డి, చిరంజీవిని పోలీస్ స్టేషన్ కు తరలించడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ముద్రగడను పరామర్శించేందుకు తమ నేతలను వెళ్లనివ్వాలని వారు డిమాండ్ చేశారు.
ముద్రగడను కలిసేందుకు వచ్చిన రఘువీరారెడ్డి, చిరంజీవిని 151 చట్టం కింద అరెస్టు చేశారని ఆరోపించారు. ముద్రగడతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. ప్రజలను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని, మానవ హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. రఘువీరా, చిరంజీవి అరెస్ట్ ను పీసీసీ ఖండించింది.