‘గతం’ గెలిపించలేదు
మోడీ ఆకర్షణకు కారణం ఆయన పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తుండటం కాదు. ఇందిరను లేదా పటేల్‌ను వాడుకుని గతాన్ని సొమ్ము చేసుకోవాలనుకునే వారు అంతకంటే చాలా పెద్ద అంశాన్ని గుర్తించడంలేదు. ఆర్థికవృద్ధిపై ప్రజలలో ఉన్న విశ్వాసం పుటుక్కున తెగిపోయింది. పెరిగే ధరలు, పడిపోతున్న ఆదాయాలు అథోగతికి పయనిస్తున్న ఆర్థికవ్యవస్థకు కొట్టొచ్చినట్టుగా కనిపించే సూచనలు.
భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరాగాంధీలను గుర్తుకు తెచ్చుకున్న గత వారం రోజులూ ఒక ప్రశ్న నా మెదడును తొలిచేస్తూ వచ్చింది. బ్రిటన్ వలస పాలననాటి సంస్థానాలను మహనీ యుడు పటేల్ భారత యూని యన్‌లో విలీనం చేసినది ‘భారత్ రాజ్’ అనే మరో రాచరిక పాలనను నెలకొల్పడాని కేనా? అనేదే ఆ ప్రశ్న. పటేల్, ఇందిరలు నికార్సయిన జాతీయవాదులు. పటేల్ జాతీయవాదం తప్ప మరే ఇజం పరిమితీ లేని వారు. ఇందిర అలా కాదు. ఎన్నికల విజయావకాశాల తాప మానినిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న 1969లో ఆమె అడ్డదిడ్డపు సోషలిజాన్ని రక్షణగా కప్పుకున్నారు. ఆమె ఎంచుకున్న బలహీనమైన గులాబీ సోషలిజం శాలువా తాత్కాలిక వెచ్చదనమనే బూటకపు సౌఖ్యాన్ని కలుగ జేసింది. సంస్థానాధీశులు తమకు బ్రిటన్ నుంచి లభిం చిన హక్కులను వదులుకొని 1947లో భారత యూనియన్‌లో విలీనానికి అంగీకరించారు. అందుకుగానూ పటేల్ వారికి కొన్ని హామీలను ఇచ్చారు. వాటిని రద్దు చేయడమే (రాజభరణాల రద్దు) నాటి ఇందిర కార్యక్రమంలోని ప్రధానాంశం.
అటుపిమ్మట 1975, 1976లలోని అత్యవసర పరి స్థితి కాలంలో గడ్డకట్టించే శీతల రాజకీయ వాతావరణం కమ్ముకుంది. ఆ సమయంలో ఇందిర వంశపారంపర్య పాలనను ఎంచుకున్నారు. సొంత పార్టీనే రాచరిక వ్యవస్థగా మార్చేశారు. ఒకప్పుడు నెహ్రూ, ఇందిరాగాంధీలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారుగా ఉండేవారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినదిగా మారిపోయింది. వంశపారంపర్య పాలన అనే భావన ఎంత ప్రబలమైనదంటే అరుదైన వైరస్ వ్యాధిలాగా అది భారతదేశంలోన్ని అన్ని రకాల సోషలిజాలకు సోకిపోయింది. దేవుని కంటే పార్టీ భావజాలానికే ఒకప్పుడు అధిక ప్రాధాన్యం ఇచ్చిన రామ్‌మనోహర్ లోహి యా సోషలిస్టు వర్గానికి ప్రత్యేకించి అది బలంగా సోకిం ది. ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్‌ల నేతృత్వంలోని పార్టీలలో ఆ రెండూ తలకిందులు కావడం అందుకు దిగ్భ్రాంతికరమైన ఉదాహరణ. వారిద్దరి విన్యాసాలు వారిపైనే గాక మరింత విశాలమైన ఉత్తర భారత రాజకీయాలపైన కూడా గణనీయమైన పర్యవసానాలను కలుగజేసాయి. ఉత్తర భారతంలో సోషలిస్టుల ప్రతిష్టకు పదే పదే తూట్లు పడుతుండటంతో కాంగ్రేసేతర శక్తుల స్థానాన్ని బీజేపీ భర్తీ చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల రాజకీయ క్రీడలో సోషలిస్టులు మొదట్లోనే ఓడిపోయారు. ఆ మీదట ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో కూడా ప్రాధాన్యాన్ని కోల్పోయారు.
సిద్ధాంతరీత్యా ప్రజాస్వామ్యం అందరికీ సమాన అవకాశాల ప్రాతిపదకను సమకూరుస్తుంది. తద్వారా అది ప్రతిభ వికసించడానికి, ప్రతిభారాహిత్యం క్షీణించిపోవ డానికి తోడ్పడుతుంది. వంశపారంపర్య పాలన ప్రజాస్వామ్యానికి పరిమితిని విధిస్తుంది. ఎలాగైనా వంశపారంపర్య పాలనను అమలుచేయాలని ప్రయత్నించేటప్పుడు భావోద్వేగపూరితమైన చరిత్ర ద్వారా సమంజసత్వాన్ని సంపాదించాలనే వాంఛ పెరుగుతుంది. నాయనమ్మ ఇం దిర, తండ్రి రాజీవ్ హత్యల ద్వారా రాహుల్ తన వ్యక్తిగత ఆకాంక్షకు సమంజసత్వాన్ని కోరుకుంటున్నారు. పూర్వీకుల త్యాగాలతోనే ఎవరైనాగానీ అధికారం అందలం ఎక్కగలిగేట్టయితే మహాత్మాగాంధీ మునిమనుమడైన గోపాల్‌గాంధీ ఆ అన్వేషణకు దిగడం కచ్చితంగా ఉత్తమం కాదా?
ఇందిరను లేదా పటేల్‌ను వాడుకుని గతాన్ని సొమ్ము చేసుకోవాలనుకునే వారు అంతకంటే చాలా పెద్ద అం శాన్ని గుర్తించడంలేదు. ఆర్థికవృద్ధిపై ప్రజలలో ఉన్న విశ్వా సం పుటుక్కున తెగిపోయింది. పెరిగే ధరలు, పడిపోతున్న ఆదాయాలు అథోగతికి పయనిస్తున్న ఆర్థికవ్యవస్థకు కొట్టొచ్చినట్టుగా కనిపించే సూచనలు. తల్లిదండ్రులు నిస్సహాయులమని భావిస్తుండటంతో యువత నిరాశానిస్పృహలకు గురికావడం మొదలైంది. అయినా వాళ్లు దేశం పట్ల నమ్మకం ఉంచాలనే భావిస్తున్నారు. అందుకే స్పష్టంగా కనిపిస్తున్న నిర్లక్ష్యంతో కూడిన యూపీఏ ప్రభుత్వపు ఉదాసీన వైఖరిపట్ల వాళ్లు అంత తీవ్రంగా ఆగ్రహం చెందుతున్నారు. ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలోని ధగధగలాడే పంజరాల్లో ఉన్నవారికి తప్ప ప్రతి ఒక్కరికీ దేశవ్యాప్తంగా యువత ఆగ్రహం కనబడుతూనే ఉంది.
నేడు నరేంద్రమోడీ ఆకర్షణగా మారడానికి కారణం ఆయన పటేల్ విగ్రహాన్ని నిర్మిస్తుండటం కాదు. ఢిల్లీ దర్బారులో తిష్టవేసినవారి కోవకు చెందని పరాయివాడు కాబట్టి. మోడీ నేటి యువతలోని ఆగ్రహపు గొంతుక, లబ్ధిదారు కూడా. ఒక కేంద్ర కాబినెట్ మంత్రి మోడీని ‘చాయ్‌వాలా’ అంటూ తీసిపారేశారు. ఢిల్లీ దర్బారులోని తల బిరుసు ఉన్నతవర్గాలు ఇలా అవమానకరమైన ధూషణలకు దిగినప్పుడల్లా మోడీ మద్దతుదార్ల బలం పెరగడం మాత్రమే జరుగుతోంది. దేశంలో టీ కప్పులు అందిస్తూ పొట్ట పోషించుకుంటున్న వారి సంఖ్య నేడు అధికారంలో ఉన్న కాలంచెల్లిన ఉన్నత వర్గపు కుమారుల కంటే చాలా ఎక్కువ. యూపీఏ సృష్టించిన పరిపాలనాపరమైన శూన్యంలోకి మోడీ ప్రవేశించారు. ఆయన ఎంత భర్తీ చేయగలిగితే అంత చోటు ఖాళీగా ఉంది.
పటేల్, జవహర్‌లాల్ నెహ్రూలపై ఈ గొడవ గురించి ఎవరైనాగానీ చెప్పగలిగేది ఒక్కటే... ఇది ఒక నాగరికమైన అంశంపై జరుగుతున్న గొడవనే మార్పే. 1947లో ఎవరు ఉత్తమ ప్రధాని అయి ఉండేవారు? అనే అంశంపై 2014 ఎన్నికల్లో ఏ ఒక్కరూ ఓటు వేయబోవడం లేదు. 2014లో ఎవరు ఉత్తమ ప్రధాని కాగలుగుతారనే దానిపైనే ఓటింగ్ జరగబోతుంది. మోడీ అదృష్టవంతుడు. ఆయనకు రెండు శూన్యాలు లభించాయి. మన్మోహన్‌సింగ్ కనుమరుగైపోతున్నారు. కానీ రాహుల్‌ను వెలుగులోకి రావడానికి అనుమతించడం లేదు. రాహుల్, మోడీలు ఎదురూబొదురుగా నిలవగా ఇద్దరినీ పోల్చి బేరీజు వేసే పరిస్థితి ఏర్పడటం వల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయంలో కాం గ్రెస్ నాయకత్వం ఎటూ తేల్చుకోలేకుండా ఉంది.
ప్రజాభిమానపు పతనం అంచున నిలవగా, ఉత్సాహోత్తేజాలు నిట్టనిలువునా మునిగిపోయిన ఏ రాజకీయపార్టీయైనాగానీ గడ్డి పరకను పట్టుకొని గట్టెక్కాలని యత్నించడం పూర్తిగా సహేతుకమే. అందుకే మోడీ చాలా త్వరగానే అత్యంత ఉచ్ఛ స్థాయికి చేరిపోయారని, ఎన్నికలు ఇంకా ఆరునెలలు ఉన్నాయని ప్రచారం సాగిస్తున్నారు. దీపావళికి దుకాణాల్లో స్పష్టంగానే కనిపించిన మాంద్యమే ఈ వాదనకు తిరుగులేని సమాధానాన్ని చెబుతోంది. ఒక తాజా జనాభిప్రాయ సేకరణలో పాల్గొన్నవారిలో 57 శాతం మంది ఇది అత్యంత అధ్వానమైన దీపావళి అని పేర్కొన్నారు. ఇక రాబోయే ఆరు నెలల కాలంలో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్నంత అధ్వానంగానే ఉంటుందని లేదా మరింత అధ్వానంగా మారుతుందని అనుకుంటే... అప్పుడు ఆర్థికవ్యవస్థ అధ్వానంగా ఉందని అనుకునేవారు 77 శాతం అవుతారు. ఈ ధోరణి కాస్త సడలుతుందేమోగానీ మటుమాయమైపోదు. భారతదేశం నేడు సంతోషంగా లేదు. ఏ అధికారపార్టీకైనా గానీ ఇది తీవ్ర విచారాన్ని కలుగజేయక మానదు.
-ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు