కాంగ్రెస్కు ప్రధాని మోదీ చురకలు
న్యూఢిల్లీ : ఇందిరాగాంధీ వర్థంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. అక్టోబర్ 31న సర్దార్ వల్లబాయి పటేల్ జయంతిని జాతీయ ఏకతా దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని విస్మరించి కాంగ్రెస్ వర్గాల నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మోదీ మాట్లాడుతూ అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అని ఆయన తన జీవితాన్ని జాతి సమగ్రత కోసం అంకితం చేశారన్నారు.
అయితే 30 ఏళ్ల క్రితం దురదృష్టవశాత్తు అదే రోజు దారుణం చోటుచేసుకుందని మోదీ అన్నారు. 1984లో జరిగిన అల్లర్లు జాతి సమగ్రతను దెబ్బతీశాయన్నారు. కాంగ్రెస్ సంకుచిత సిద్ధాంతాల కోసం చరిత్రను, వారసత్వాలను చీల్చవద్దని మోదీ హితవు పలికారు. కాగా ఇందిరా గాంధీకి మోదీ ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు.
మరోవైపు 1984 అల్లర్లలో మరణించిన సిక్కులకు ప్రధాని గురువారం పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 3,325 సిక్కు కుటుంబాలకు ప్రభుత్వం రూ.167 కోట్లు పరిహారం చెల్లించనుంది. కాగా ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం తరఫున ఎలాంటి కార్యక్రమాలను ప్రకటించలేదు. అలాగే, ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్‌ను ప్రధాని సందర్శించే విషయంపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.