సర్దార్ పటేల్ లేకుంటే గాంధీ లేరు: మోదీ
న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే మహాత్మా గాంధీ పోరాటం సైతం అసంపూర్తిగా మిగిలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో సర్దార్ పటేల్, గాంధీ పాత్ర అసాధారణమని, ఉద్యమాన్ని బలోపేతం చేసిందని మోదీ పేర్కొన్నారు. శుక్రవారం పటేల్ 139 జయంతిని పురస్కరించుకుని మోదీ ఘనంగా నివాళులు అర్పించారు.
పటేల్ జయంతిని కేంద్రం జాతీయ ఏక్తా దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలో నిర్వహించిన సమైక్యత పరుగులో మోదీ పాల్గొనగా, వేలాదిమంది ఆయనను అనుసరించారు. అంతకుముందు పార్లమెంట్కు సమీపంలోని పటేల్ విగ్రహానికి మోదీ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశానికి పటేల్ చేసిన సేవలను కొనియాడారు. పటేల్ తన జీవితాన్ని జాతి సమగ్రత కోసం అంకితం చేశారన్నారు.
ఇదే రోజు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్థంతి. మోదీ ఇందిరను గుర్తు చేసుకుంటూ.. 30 ఏళ్ల క్రితం దురదృష్టవశాత్తు ఇదే రోజు దారుణం చోటుచేసుకుందని అన్నారు. 1984లో జరిగిన అల్లర్లు జాతి సమగ్రతను దెబ్బతీశాయన్నారు. కాంగ్రెస్ సంకుచిత సిద్ధాంతాల కోసం చరిత్రను, వారసత్వాలను చీల్చవద్దని మోదీ హితవు పలికారు. కాగా ఇందిరా గాంధీకి మోదీ ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు.