'చాణక్యుడి తర్వాత పటేల్కే దక్కుతుంది'
న్యూఢిల్లీ : భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విశేష కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే క్రమంలో పటేల్ కృషిని మరువలేమన్నారు. శనివారం న్యూఢిల్లీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పటేల్ స్మారక స్తూపం వద్ద ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుడిగా, దేశానికి తొలి హోంశాఖ మంత్రిగా సర్దార్ పటేల్ దేశానికి చేసిన సేవలను మోదీ గుర్తు చేశారు.
చాణక్యుడి తర్వాత దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత పటేల్కే దక్కుతుందని అన్నారు. ఆ లక్ష్యంగా దిశగా అందరూ కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పటేల్ జయంతి సందర్భంగా రాజ్పథ్లో ఏక్తా పరుగును ప్రధాని మోదీ జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రహోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. అలాగే ఏక్తా పరుగులో విద్యార్థులు, క్రీడాకారులు, నగర వాసులు భారీగా సంఖ్యలో పాల్గొన్నారు.