విమోచనా? విలీనమా? | No freedom from independence or merge in state | Sakshi
Sakshi News home page

విమోచనా? విలీనమా?

Published Tue, Sep 15 2015 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

విమోచనా? విలీనమా?

విమోచనా? విలీనమా?

 స్వాతంత్య్రానంతర భారత చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన పరిణామాలకు, వ్యాఖ్యానాలకు దారితీసిన ఘటన తెలంగాణలో నిజాం ప్రభుత్వం పై భారత సైనిక చర్య ఘటన. నాటి హోమంత్రి సర్దార్ పటేల్ ఆదేశానుసారం నిజాం ప్రభుత్వంపై భారత సైన్యం జరిపిన దాడితో దేశం మొత్తంలో రాజ సంస్థానాల విలీనం అనేది ఒక కొలిక్కి వచ్చిన మాట నిజమే. కానీ 1948 సెప్టెంబర్ 17న జరిగిన ఆ ఘటన తెలంగాణ విమోచనా, పండుగ దినమా, విలీనమా, విషాదమా, విద్రోహమా అంటూ నేటికీ వివిధ వర్గాలు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నాయి. ఒక చారిత్రక ఘటన ముగిసి 66 ఏళ్లు అయిన తర్వాత కూడా సమాజం ఒక ఉమ్మడి అభి ప్రాయానికి రాకపోవడం ఆ ఘటనకున్న అపూర్వ ప్రాధాన్యతను, సంక్లిష్టతను స్పష్టం చేస్తోంది.
 
 ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తెలంగా ణతోసహా పూర్వపు నిజాం రాజ్యంలో అంతర్భాగా లుగా ఉండి ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విలీనమైన జిల్లాల్లోని ప్రజలు భారత సైనిక దాడి ఘటనను విమోచన దినంగానే జరుపుకుంటున్నా రు. పైగా, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ఈ విమోచనా దినోత్సవాలను అధికారికంగానే నిర్వహి స్తున్నాయి. కానీ, నిజాం నిరంకుత్వం నుంచి విము క్తి పొందిన ఆ చారిత్రక ఘట్టాన్ని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ నేటి తెలంగాణ రాష్ట్రంలో కానీ విమోచన దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రభు త్వాలే సాహసించకపోవడం ఒక వైచిత్య్రం కాగా, దాన్ని ఏ పేరుతో పిలవాలి అనే అంశంపై కూడా ప్రభుత్వాలు నోరు మెదపడం లేదు. అయితే ఆనాడు జరిగింది భారత్‌లో నిజాం రాజ్య విలీనం మాత్రమే అనే వాదన నాటి ప్రజల అభీష్టాన్ని ప్రతి బింబించకపోవచ్చని ఒక అభిప్రాయం ఉంది.
 
 నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రమ హాసభ, ఆర్యసమాజం, హిందూ మహాసభ, తది తర సంస్థలు తిరుగుబాటు ఉద్యమాలు నడిపిందీ.. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన సాయుధ పోరా టంలో వేలాదిమంది ప్రజలు తమ ధన, మాన, ప్రాణాలు ఫణంగా పెట్టిందీ.., జైలు నిర్బంధాలకు వెరవకుండా పోరుబాటకు సాహసించినదీ నిజాం పాలన నుంచి విముక్తికోసమే. ఒక్కమాటలో చెప్పా లంటే ఆనాటి క్రూర పెత్తందారీతనం కోరల నుంచి బయటపడటానికి తెలంగాణ ప్రజానీకాన్ని ఏక తాటి మీద నిలిపిన తక్షణావసరం విమోచనే తప్ప విలీనం కాదని గ్రహించాలి.
 
 కానీ సైనిక చర్య అనంతరం రజాకార్ల దురాగ తాలపై ప్రతీకారచర్య పేరిట నిజాం సంస్థానంలో చెలరేగిన హింస, దాడులు, ఒక మతస్తులపై జరిగిన సాయుధ దాడులు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రజలపై భారత సైన్యం జరిపిన దాడులు... పరిమా ణంలో తక్కువేం కాదని చరిత్ర రుజువులు చెబుతు న్నాయి. భారత ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై సైనికచర్య చేపట్టిన రోజు సెప్టెంబర్ 17 అనీ, నాలు గు వేల పైచిలుకు రైతాంగ సాయుధ పోరాట వీరు లు అమరులు కావడానికి, వేలాది ముస్లింలు ప్రతీ కారదాడుల్లో పాణాలు కోల్పోవడానికీ పునాది పడ్డ పీడ రోజు తెలంగాణ చరిత్రలో విద్రోహదినమే తప్ప అది విమోచనా కాదు, విలీనమూ కాదు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
 
 కానీ 1948 సైనిక చర్య ద్వారా జరిగింది దురా క్రమణతో కూడిన విలీనమే అని అప్పట్లో ప్రకటిం చిన, వాదించిన కమ్యూనిస్టులు కూడా విస్తృతార్థం లో సెప్టెంబర్ 17ను తెలంగాణలో పండుగలా జర పాలని గతంలోనే నిర్ణయించారు. విమోచన అంటే ముస్లింలను అవమానపర్చినట్లు అవుతుందనే వాద న  తెలంగాణ ప్రభుత్వాన్ని విమోచన దినోత్సవం జోలికిపోకుండా చేస్తున్నట్లుంది. కానీ నాటి సాయు ధ పోరాటం ప్రధానంగా నిజాంకి వ్యతిరేకంగానే తప్ప ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. భావోద్వేగా లతో కూడిన నిజాంపై భారత సైనిక చర్యను విస్తృ తార్థంలో విమోచన దినంగా గుర్తించడమే నాటి ప్రజల త్యాగాలకు గుర్తింపుగా ఉంటుంది.
 (సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశత్వం నుంచి తెలంగాణ విమోచన జరిగిన సందర్భంగా)
 కొనగంటి మోహనరావు, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement