సీఎం పీఠంపై మహిళా శక్తి | Women Chief Ministers in the history of the country | Sakshi

సీఎం పీఠంపై మహిళా శక్తి

Sep 22 2024 6:32 AM | Updated on Sep 22 2024 6:34 AM

Women Chief Ministers in the history of the country

దేశ చరిత్రలో 17వ మహిళా  ముఖ్యమంత్రి ఆతిశి 

న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఆతిశి దేశ చరిత్రలో 17వ మహిళా ముఖ్యమంత్రి కావడం విశేషం. అంతేకాదు ఇప్పటిదాకా ఢిల్లీ సీఎంగా పనిచేసిన మహిళల్లో అత్యంత పిన్నవయసు్కరాలు అతిశి. ఆమె వయసు కేవలం 43 ఏళ్లు. ప్రస్తుతం దేశంలో ఉన్న మహిళా సీఎంలలో రెండో సీఎం ఆతిశి. పశ్చిమ బెంగాల్‌ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  

మహిళా ముఖ్యమంత్రులు 
సుచేతా కృపలానీ  
స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా సుచేతా కృపలానీ రికార్డు సృష్టించారు. ఆమె 1963 నుంచి 1967 దాకా ఉత్తరప్రదేశ్‌ సీఎంగా పనిచేశారు.   

నందిని శతపథి  
దేశంలో రెండో మహిళా సీఎం నందిని శతపథి. 1972 నుంచి 1976 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇందిరా గాందీకి ఆమె అత్యంత సన్నిహితురాలు.   
శశికళ కకోద్కర్‌  
మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ నేత శశికళ కకోద్కర్‌ 1973 నుంచి 1979 దాకా కేంద్ర పాలిత ప్రాంతమైన గోవా, డయ్యూడామన్‌కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1987లో గోవాకు రాష్ట్ర హోదా లభించింది.  

అన్వర తైమూర్‌  
దేశంలో మొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా అన్వర తైమూర్‌ రికార్డుకెక్కారు. ఆమె 1980 నుంచి 1981 దాకా అస్సాం సీఎంగా పనిచేశారు.  

వి.ఎన్‌.జానకి రామచంద్రన్‌  
ప్రఖ్యాత తమిళ నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ భార్య వి.ఎన్‌.జానకి రామచంద్రన్‌ తమిళనాడు తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 1988లో భర్త ఎంజీఆర్‌ మరణం తర్వాత కేవలం 23 రోజులపాటు సీఎంగా పనిచేశారు.  

జె.జయలలిత  
ఎంజీఆర్‌ శిష్యురాలు, డీఎంకే నేత, ప్రముఖ సినీ నటి జె.జయలలిత ఆరు పర్యాయాలు తమిళనాడు సీఎంగా సేవలందించారు. మొత్తం 14 ఏళ్లకుపైగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు.  

మాయావతి  
బహుజన సమాజ్‌ పారీ్ట(బీఎస్పీ) అధినేత మాయావతి నాలుగు పర్యాయాలు ఉత్తరప్రదేశ్‌ సీఎంగా వ్యవహరించారు. మొత్తం ఏడు సంవత్సరాల పాటు పదవిలో ఉన్నారు.  

రాజీందర్‌ కౌర్‌ భట్టాల్‌  
పంజాబ్‌కు ఇప్పటిదాకా ఏకైక మహిళా సీఎంగా రాజీందర్‌ కౌర్‌ భట్టాల్‌ రికార్డుకెక్కారు. ఆమె 1996 నుంచి 1997 దాకా పంజాబ్‌ సీఎంగా పనిచేశారు.  

రబ్రీ దేవి  
ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలు పాలు కావడంతో ఆయన భార్య రబ్రీ దేవి 1997లో బిహార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బిహార్‌లో ఇప్పటివరకు ఏకైక మహిళా సీఎం రబ్రీ దేవి.  

సుష్మా స్వరాజ్‌ 
ఢిల్లీ తొలి మహిళా సీఎం సుష్మా స్వరాజ్‌. 1998లో ఆమె 52 రోజులపాటు ఈ పదవిలో కొనసాగారు.  

షీలా దీక్షిత్‌  
ఢిల్లీ రెండో మహిళా సీఎం షీలా దీక్షిత్‌. ఢిల్లీలో అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా రికార్డు నెలకొల్పారు. ఆమె 1998 నుంచి 2013 దాకా 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు.  

ఉమా భారతి 
రామ జన్మభూమి ఉద్యమ నేత, ఫైర్‌బ్రాండ్‌ ఉమా భారతి 2003 నుంచి 2004 దాకా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సేవలందించారు.  

వసుంధర రాజే 
గ్వాలియర్‌ మహారాజు జీవాజిరావు సింధియా, విజయరాజే సింధియా దంపతుల కుమార్తె అయిన వసుంధర రాజే రెండు పర్యాయాల్లో 10 సంవత్సరాలపాటు రాజస్తాన్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు.  

మమతా బెనర్జీ  
తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ 2011 నుంచి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.  

ఆనందిబెన్‌ పటేల్‌  
గుజరాత్‌కు ఏకైక మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌. నరేంద్ర మోదీ తర్వాత ఆమె 2014 నుంచి 2016 దాకా సీఎంగా పనిచేశారు. 

మహబూబా ముఫ్తీ 
పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పారీ్ట(పీడీపీ) నేత మహబూబా ముఫ్తీ జమ్మూకశ్మీర్‌ తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 2016 నుంచి 2018 వరకు సీఎంగా వ్యవహరించారు. 

ఆతిశి  
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.  


మొదటి వరుస: షీలా దీక్షిత్, ఉమా భారతి, ఆనందీబెన్‌ పటేల్, మెహబూబా ముఫ్తీ, జానకీ రామచంద్రన్, మాయావతి 
రెండో వరుస: నందినీ శతపథి, అన్వర తైమూర్, రబ్డీదేవి, శశికళా కకోడ్కర్, వసుంధరా రాజె సింధియా
మూడో వరుస: సుష్మా స్వరాజ్, సుచేతా కృపలానీ, రాజీందర్‌ కౌర్, మమతా బెనర్జీ, జయలలిత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement