
మహిళల భద్రత కన్నా పటేల్ విగ్రహమే మిన్న!
న్యూఢిల్లీ: మహిళల భద్రత, వారి సంక్షేమం కన్నా గుజరాత్‌లో సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణమే ముఖ్యమైనదిగా మోడీ సర్కారు భావించింది. తాజా బడ్జెట్‌లో మహిళల భద్రత కోసం రూ. 150 కోట్లు, వారి సంక్షేమం కోసం రూ. 100 కోట్లు ప్రకటించిన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ.. ప్రధానమంత్రి సొంతరాష్ట్రంలో నిర్మించ తలబెట్టిన ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహ ఏర్పాటుకు మాత్రం రూ.200 కోట్లను కేటాయించారు.
182 మీటర్ల ఎత్తుతో, రూ. 2,500 కోట్ల ఖర్చుతో అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే ఎత్తై సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ‘ఐక్యతా ప్రతిమ’ పేరుతో నిర్మించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే మోడీ తలపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి రూ. 200 కోట్లను కేటాయించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైట్లీ ప్రతిపాదనల్లో ఇదే అత్యంత నచ్చని ప్రతిపాదనగా నెటిజన్లు అభిప్రాయపడ్డారు.