నెహ్రూ, పటేల్ ఇద్దరూ స్మరణీయులే | Facts are sacred, comment is free | Sakshi
Sakshi News home page

నెహ్రూ, పటేల్ ఇద్దరూ స్మరణీయులే

Published Sun, Nov 2 2014 12:12 AM | Last Updated on Wed, Aug 15 2018 8:21 PM

నెహ్రూ, పటేల్ ఇద్దరూ స్మరణీయులే - Sakshi

నెహ్రూ, పటేల్ ఇద్దరూ స్మరణీయులే

త్రికాలమ్
వాస్తవాలు పవిత్రమైనవి. వాటిని వక్రీకరించకూడదు. వ్యాఖ్యానం మీ ఇష్టం (ఫ్యాక్ట్స్ ఆర్ సేక్రెడ్, కామెంట్ ఈజ్ ఫ్రీ). ఆ విధంగా రాసిన చరిత్రను ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు అన్వయించుకోవచ్చు. అన్వయస్వేచ్ఛ చరిత్ర రాసేవారికే కాదు. చదివేవారికీ ఉంటుంది.
 
ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఇది మెట్టవేదాంతం కాదు. వర్తమాన రాజకీయాలు చెబుతున్న గుణపాఠం. ఇంత కాలం నవభారత నిర్మాత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అని విశ్వసించాం. ఇప్పుడు నవభారత నిర్మాణం  చేసిన అధినాయకుడు సర్దార్ పటేల్ అంటూ ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటిస్తున్నారు. చరిత్ర ఎప్పటికీ ఒకే తీరుగా ఉండదు. రాజ్యం ఎవరి చేతుల్లో ఉంటుందో చరిత్ర కూడా వారు చెప్పినట్టే నడుస్తుంది.

పాలకులు మారినప్పుడు, కొత్త భావజాలాలకు ఆధిపత్య స్థానం దక్కినప్పుడు చరిత్రలో దిద్దుబాటు ప్రయత్నం జరగడం సహజం. అందుకు ప్రతిఘటన ఎదురు కావడం అంతే సహజం. ఒక తప్పును దిద్దే  క్రమంలో మరో తప్పు చేసే అవకాశం కూడా లేకపోలేదు. చరిత్ర సృష్టించినవారికి కూడా చరిత్రలో శాశ్వత స్థానం ఉంటుందనే నమ్మకం లేదు. చరిత్ర గతితో పాటు చరిత్ర పురుషులకూ స్థానభ్రంశం అనివార్యం. ఈ సత్యం తెలిసినవారు చరిత్రను చదివే సమయంలో పాలకవర్గ భావజా లాన్నీ, సిద్ధాంతాలనూ మదిలో పెట్టుకుంటారు. మినహాయింపులూ, జోడింపులూ చేసిన తర్వాతనే చరిత్రను సవ్యంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు.

స్మృతికి రంగులు పులమొద్దు
మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్‌ల జయంతి, వర్ధంతులు మాత్రమే ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహించాలనీ, ఇతర నాయకుల పుణ్యతిథులను వారి ట్రస్టులో, కుటుంబ సభ్యులో నిర్వహించాలనీ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. శుక్రవారం నాడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా మరో అడుగుగా చెప్పుకోవచ్చు.  ఇందిరాగాంధీ వర్ధంతి కూడా అదే రోజు అని గుర్తు చేస్తూ, ఆమె మరణం తర్వాత సిక్కుల ఊచకోత దేశ సమైక్యతపైన ఖడ్గ ప్రహారం వంటిద ంటూ మోదీ వ్యాఖ్యానించడం మానుతున్న గాయాన్ని రేపడమే.

దీనికి ప్రతిగా లౌకికవాదులుగా చెప్పుకునేవారు గోధ్రాలో ముస్లింల ఊచకోత గురించి ప్రస్తావించి అటువంటి వ్యాఖ్యలే చేయవచ్చు. ప్రయోజనం ఏమైనా ఉంటుందా?  పటేల్‌ను అభినవ బిస్మార్క్‌గా అభివర్ణించి నవభారత చరిత్రలో ఆయనకు సముచితమైన స్థానం కల్పించాం. అంతకంటే ఉన్నతమైన స్థానం కల్పిం చాలని కొత్త పాలకులు అనుకుంటే అందుకు అభ్యంతరం లేదు. ఆ క్రమంలో అంతే ఉన్నతులైన ఇతర నాయకుల స్మృతిని కించపరచడం అనవసరం.

చరిత్రలో కొందరు మహానుభావులకూ, త్యాగమూర్తులకూ అన్యాయం జరిగిం దనే అభిప్రాయం ఈ దేశంలో చాలామందికి ఉంది. నెహ్రూ ఆలోచనా విధానం, మార్క్స్ తాత్వికత  కలబోసి సమన్వయం సాధించి స్వాతంత్య్రానంతరం చేసిన చరిత్ర రచనలో పాఠకులకు లౌకిక దృష్టి ప్రసాదించాలనే సంకల్పం ఉండి ఉంటుం ది. బాలల మస్తిష్కాలలో సర్వమత సహనాన్ని ప్రోదిచేయాలన్న తాపత్రయం కూడా ఉండి ఉండవచ్చు. లేకపోతే అక్బర్ చక్రవర్తిని కీర్తించే పాఠ్యాంశాలు ఉండేవి కావు. చరిత్రలో దిద్దుబాట్లు అవసరమనే అభిప్రాయం నరేంద్రమోదీకి ప్రధాన మంత్రి అయిన తర్వాతనే వచ్చిన ఆలోచన కాదు.

2012 మేలో ఉదయపూర్‌లో రాణాప్రతాప్  472వ జయంత్యుత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ ఇదే రకమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. స్వీయచరిత్రను విస్మరించినవారు చరిత్ర సృష్టించజాలరనే గొప్ప సత్యాన్ని ఆనాడే చెప్పారు.  రాణా ప్రతాప్ గోవులనూ, మహిళలనూ, పాఠశాలలనూ, దేవాలయాలనూ రక్షించాడు కనుక ఆయన ఈ రోజు జీవించి ఉంటే కుహనా లౌకికవాదులు ఆయన మీద కూడా రాళ్ళు వేసేవారంటూ ధ్వజమెత్తారు.

సముజ్వలమైన గతాన్ని, దేశంకోసం ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావులను విస్మరించడం ఈ జాతి దురదృష్టమని అంటూ త్యాగాలు చేసింది ఒక్క కుటుంబం మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. శ్యామాజీ కృష్ణ వర్మ, భగత్‌సింగ్, రాజగురు. వీర సావర్కర్ వంటి త్యాగపురుషులను గౌరవించాలంటూ ఉద్బోధించారు.

అవాస్తవాల గుచ్ఛం
చరిత్రను సవరించే ప్రయత్నాలు జరగడం ప్రపంచంలో ఇదే ప్రథమం కాదు. సోవియెట్ యూనియన్‌లో కృశ్చెవ్ అధికారంలోకి రాగానే స్టాలిన్ ఆనవాలు లేకుం డా చేశాడు. పైగా స్టాలిన్ డాన్స్ చేయమంటే మేమంతా డాన్స్ చేసేవాళ్ళం అంటూ పూర్వాధినేతను అవహేళన చేసేవాడు. బ్రెజ్నేవ్ పగ్గాలు చేతబట్టిన తర్వాత కృశ్చెవ్‌కూ అదే మర్యాద జరిగింది. యూరీ గగారిన్ అంతరిక్ష యానం చేసి  తిరిగి వచ్చిన చారిత్రక సందర్భంలో అతనికి స్వాగతం చెబుతూ కృశ్చెవ్ పుష్పగుచ్ఛం ఇచ్చాడు.

బ్రెజ్నేవ్ అధికారంలోకి వచ్చిన తర్వాత సోవియెట్ యూనియన్ టెలివిజన్ చానల్స్‌లో అప్పటి దృశ్యాన్ని సందర్భవశాత్తూ చూపించినప్పుడు గగారిన్ పుష్ప గుచ్ఛం అందుకుంటూ కనిపించేవాడు కానీ దాన్ని అందిస్తున్న కృశ్చెవ్ కనిపించే వాడు కాదు. చేయి మాత్రమే కనిపించేది. కృశ్చెవ్ కనిపించకుండా  కత్తిరించేవారు. ఈ ఉదంతాన్ని  గ్లాస్‌నోస్త్, పెరిస్త్రోయికా గురించి రాస్తూ గోర్బచేవ్ స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు రష్యాలో సర్వత్రా పుతిన్ ఒక్కడే. చైనా రాజకీయం కొంచెం భిన్నం.

మావో హయాంలో జరిగిన సాంస్కృతిక విప్లవం ఘోరమైన తప్పిదం అంటూ 1956 అనంతర మావో పాలనను నిశితంగా విమర్శించే తీర్మానాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ 1981లో ఆమోదించింది. అయినప్పటికీ మావోను మహానాయకుడుగా, చైనా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా, సిద్ధాంతకర్తగా డెంగ్ ప్రభుత్వం గుర్తించి స్మృతిశాల నిర్మించింది. 1966లో మొదలైన సాంస్కృతిక విప్లవంలో అప్పుడు అధికారిగా ఉన్న డెంగ్‌ను మావో ప్రభుత్వం జైల్లో కుక్కింది. డెంగ్ కుటుంబ సభ్యులను వేధించింది. అయినా సరే, మావో స్మృతికి భంగం కలగకుండా డెంగ్ ఉదాత్తంగా వ్యవహరించాడు.

తొలి ఎన్‌డీఏ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి బంగ్లాదేశ్ విమోచన తర్వాత ఇందిరాగాంధీని దుర్గగా, విజయేందిరగా ప్రస్తుతించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అటల్‌జీ అట్లా అనలేదని భారతీయ జనతా పార్టీ నాయకులు అంటారు. కానీ నెహ్రూ పట్లా, ఇందిరాగాంధీ పట్లా, చివరికి తనకంటే చిన్నవాడైన రాజీవ్‌గాంధీ పట్లా వాజపేయి మర్యాదగానే వ్యవహరించేవారు.  మోదీ తరహా వేరు. ఆయన వ్యక్తిత్వం వేరు. చరిత్రలో కొన్ని అంశాలు ఎప్పటికీ వివాదాస్పదంగానే మిగిలిపోతాయి. ఇప్పటికీ స్వాతంత్య్ర సమరంలో బ్రిటిష్ బలగాలను ఓడించామని అమెరికన్లు చెప్పుకుంటారు.

కానీ బ్రిటిష్‌వారు మాత్రం తాము అమెరికన్లకు స్వాతం త్య్రం ప్రసాదించామని అంటారు. ఇండియాలో మైసూరు యుద్ధంపైనా, కెరిబియన్ వలస దేశాలలో ఫ్రెంచ్, డచ్ సైనికులతో పోరాడటంపైనా దృష్టి కేంద్రీకరించిన బ్రిటిష్ ప్రభుత్వం సైన్యాన్ని అటు మళ్ళించింది. అమెరికాలోని పదమూడు కాలనీల కోసం పోరాటం వృథాప్రయాస అని నిర్ణయించుకుంది. ఇది బ్రిటిష్ చరిత్రకారుల వాదన. చరిత్ర ఎవరు రాస్తున్నారనే అంశంపైన కథనం ఆధారపడి ఉంటుంది.

రొమెల్లా థాపర్ వంటి నెహ్రూ-మార్క్స్ తాత్విక  చింతన కలిగిన చరిత్రకా రులు చేసిన నిర్ధారణలతో ఏకీభవించడం సాధ్యం కాని విశ్వాసాలు మోదీకీ, ఆయన ఉన్నతికి కారకమైన సంఘ్ పరివారానికీ ఉన్నాయి. ఇంతవరకూ చరిత్రను లౌకిక వాదులు వక్రీకరించారనే బలమైన అభిప్రాయం వారిది. లౌకికవాదులు రాసిన చరిత్రలో వేదకాలం నుంచి బుద్ధుడు, మహావీరుడు తదితరులు జీవించిన కాలం వరకూ చారిత్రకాంశాలను పరిగణనలోకి తీసుకోలేదని వారి ఫిర్యాదు. చరిత్రను రచించే క్రమంలో హిందూ మత గ్రంథాలనూ, హిందూ కథానాయకులనూ చిన్న చూపు చూశారని అరోపణ.

తప్పులను సవరించాలని తపన. అవకాశం వచ్చింది కనుక సవరణలు చేయాలన్న ఆరాటం. వాస్తవానికి సంఘ్ పరివారం స్వయంగా  కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నది. బాబా సాహెబ్ అంబేద్కర్‌కు పెద్ద పీట వేస్తున్నది. అంబేద్కర్‌ను పట్టించుకోని వామపక్షాలు మాత్రం ఇప్పటికీ తమ వైఖరిని సవరించుకోలేకపోతున్నాయి. వామపక్షాలు దళితులను పట్టించుకోలేదనీ, దళితులు వామపక్షాలను ఆదరించలేద నే అభిప్రాయం ఉండనే ఉంది.

పవిత్రమైనవి వాస్తవాలు
తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే తెలంగాణలో అన్ని పథకాలకూ ఇందిర, రాజీవ్ పేర్లే కొనసాగేవి. టీఆర్‌ఎస్ అధికా రంలో ఉంది కనుకనే ప్రొఫెసర్ జయశంకర్ పేరు ఒక విశ్వవిద్యాలయానికి పెట్టారు. కాళోజీ స్మారక మందిరాన్ని గొప్పగా నిర్మించాలని నిర్ణయించగలిగారు. కొమురం భీమ్‌కూ, ఐలమ్మకూ, బతుకమ్మకూ మునుపెన్నడూ లేని గౌరవం లభించింది. గోలకొండ  దశ తిరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కనుక ఇక అన్ని పథకాలకూ ఎన్‌టీ రామారావు పేరు పెడతారు. మే ఎన్నికలలో తెదేపా ఓడిపోయి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొంది ఉంటే అవే కార్యక్రమాలకు వైఎస్ పేరు పెట్టేవారు. అధికారం ఎవరిదన్నదే ప్రశ్న.  ఢిల్లీకి రాజైన మోదీ కత్తికి  ఇప్పట్లో ఎదురులేదు.

చరిత్రను తిరగరాయక తప్పదు. కొత్త చరిత్ర ఉంటుంది. లౌకికవాదులు రాసిన పాత  చరిత్రా ఉంటుంది. బహుళత్వాన్ని స్వాగతించవలసిందే. కానీ వారూ, చరిత్రకారులు ఒక్క నియమం పాటిస్తే చాలు. జర్నలిజంలో పాటించే మౌలికమైన సూత్రం: వాస్తవాలు పవిత్రమైనవి. వాటిని వక్రీకరించకూడదు. వ్యాఖ్యానం మీ ఇష్టం (ఫ్యాక్ట్స్ ఆర్ సేక్రెడ్, కామెంట్ ఈజ్ ఫ్రీ). ఆ విధంగా రాసిన చరిత్రను ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు అన్వయించుకోవచ్చు. అన్వయస్వేచ్ఛ చరిత్ర రాసేవారికే కాదు. చదివేవారికీ ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదన్న సత్యాన్ని చరిత్ర రాసేవారూ, రాయించేవారూ గుర్తుపెట్టుకుంటే మేలు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement