నెహ్రూ, సర్దార్ పటేల్ ను కూడా ఉరితీశారా!
సాక్షాత్తు కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ చరిత్ర విషయంలో నాలుక కర్చుకున్నారు. భగత్ సింగ్, రాజ్ గురుతోపాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా బ్రిటిష్ పాలకులు ఉరితీశారని ఆయన తప్పులు ఒప్పజెప్పారు.
మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో సోమవారం జరిగిన ఓ బహిరంగ సభలో జవదేకర్ మాట్లాడారు. '1857లో ప్రారంభమైన స్వాతంత్ర్య సమరం 90 ఏళ్ల అనంతరం బ్రిటిష్ వాళ్లను వెళ్లగొట్టడంతో ముగిసింది. బ్రిటిష్ పాలకులు ఉరితీసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, పండిట్ (నెహ్రూ), భగత్ సింగ్, రాజ్ గురు వంటి స్వాతంత్ర్య పోరాటయోధులకు మనం ఈనాడు జోహార్లు అర్పిస్తున్నాం' అని పేర్కొన్నారు. దేశంలోని విద్యాశాఖ వ్యవహారాలను చూసే జవదేకర్ తన ప్రసంగంలో చారిత్రక వాస్తవాలను తప్పుగా ఉటంకించారు. నిజానికి భారత ప్రథమ ప్రధాని నెహ్రూ సహజ కారణాలతో 1964లో 74 ఏళ్ల వయస్సులో మరణించారు. భారత ప్రథమ కేంద్ర హోమంత్రి పటేల్ 1950లో 75 ఏళ్ల వయస్సులో ప్రాణాలు విడిచారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీగా మిగిలిపోగా.. భగత్ సింగ్, రాజ్ గురులను మాత్రం బిటిష్ సర్కారు ఉరితీసింది.
భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తిరంగా యాత్రను సోమవారం చింద్వారాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జవదేకర్ మాట్లాడుతూ చరిత్రను విషయంలో నాలుక కర్చుకున్నారు.