పెళ్లికి ముందు కౌన్సెలింగ్ అవసరం
వివాహ వ్యవస్థపై అవగాహన కల్పించాలన్న జస్టిస్ చంద్రకుమార్
సాక్షి,సిటీబ్యూరో: ‘వివాహానికి ముందు... తరువాత జంటలకు కౌన్సెలింగ్ చేయాలి. వివాహ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబాలపై అవగాహన కల్పించాలి. తద్వారా కలిగే ప్రయోజనాలు వెలకట్టలేం. చిన్నచిన్న కారణాలతో ఇప్పుడు జంటలు పెళ్లయిన ఏడాది లోపే విడిపోతున్నాయి’ అన్నారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్. వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ రవీంద్రభారతిలో శుక్రవారం ‘వివాహ విజ్ఞాన సదస్సు’ నిర్వహించింది.
ఇందులో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ... ‘ఉమ్మడి కుటుంబాలు లేకపోవడమే విడాకులు పెరగడానికి కారణం. తిరుపతిలో ఓ జువైనల్ హోమ్ సందర్శిస్తే... అందులో 83 శాతం మంది పిల్లలు భార్యాభర్తలు విడిపోయి వదిలేసినవారే. చిన్నచిన్న గొడవలకే విడాకులు తీసుకొని పిల్లలకు ద్రోహం చేయడం తగదు. తల్లిదండ్రులు ప్రేమను దూరం చేసి లేత మనసులు గాయపరచకూడదు. తల్లిదండ్రుల ప్రేమ పిల్లల హక్కు’ అన్నారు.
మాజీ డీజీపీ అరవిందరావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్, గంపా నాగేశ్వరరావు, ఆకెళ్ల రాఘవేంద్ర, రవికుమార్, ఆధ్యాత్మిక వక్త సత్యవాణి తదితరులు ప్రసంగించారు. శివశంకరి, గీతాంజలి పాడిన పెళ్లి పాటలు అలరించాయి.