* నిరాకరించిన హైకోర్టు
* రైల్వే పరిపాలనా విభాగం పిటిషన్ తిరస్కరణ
సాక్షి, ముంబై: అంబులెన్స్ సేవలు అందిస్తున్నందుకు టికెటుపై అదనంగా పన్ను వసూలు చేసేందుకు అనుమతివ్వాలని రైల్వే పరిపాలన విభాగం దాఖలుచేసిన పిటిషన్‌ను హై కోర్టు తిరస్కరించింది. ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు అందించడం రైల్వే శాఖ బాధ్యత. గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించడం మౌలిక సదుపాయాల్లో ఒక భాగమని, సేవలు అందించినందుకు అదనంగా పన్ను వసూలు చేయడం చట్టరీత్యా నేరమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రయాణికులకు పన్ను పెంపు నుంచి ఊరట లభించింది.
నగరంలో సెంట్రల్, హార్బర్, పశ్చిమ, ట్రాన్స్ హార్బర్ పేరిట నాలుగు లోకల్ రైల్వే మార్గాలున్నాయి. ప్రతిరోజూ దాదాపు 70 లక్షల మందికి పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. నిత్యం ఏదో మార్గంలో, ఏదో ఒక స్టేషన్ పరిధిలో రైలు ఢీ కొని లేదా కిందపడి పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందుతున్నారు. కొందరు తీవ్రంగా గాయపడగా మరికొందరు అవయవాలు కోల్పోయి శాశ్వతంగా వికలాంగులుగా మారుతున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు చేరవేసేందుకు గతంలో స్టేషన్ బయట ఎలాంటి ప్రత్యేక వాహనాలుండేవి కావు.
దీంతో బాధితులకు సకాలంలో వైద్యం అందకపోవడంతో విలువైన ప్రాణాలు మధ్యలోనే గాలిలో కలిసిపోయేవి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బాంబే హైకోర్టు గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రులకు తరలించే ఏర్పాట్లుచేయాలని రైల్వే పరిపాలన విభాగానికి హుకుం జారీ చేసింది. ఈ మేరకు రైల్వే శాఖ కొన్ని కీలక స్టేషన్లలోనూ, ప్రమాదాలు ఎక్కువ జరిగే స్టేషన్ల బయట అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచింది.
అయితే ఉచితంగా అంబులెన్స్ సేవలు అందిస్తున్నందుకు రైల్వేపై యేటా కొన్ని కోట్ల రూపాయల భారం పడుతోందని పేర్కొంటూ భారాన్ని తట్టుకునేందుకు ప్రయాణికుల టికెటుపై అదనపు పన్ను వసూలు చేయాలని ప్రతిపాదించింది. కాని ఈ సేవలు అందించడం రైల్వే బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది. అంతేగాకుండా బాధితులకు తీవ్ర రక్తస్రావం జరగకుండా అన్ని స్టేషన్లలో ‘ఎమర్జెన్సీ మెడికల్ రూం’ వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా ప్రస్తుతం వికలాంగులకు, గర్భిణులకు, కేన్సర్ రోగులకు కేటాయించిన మాదిరిగానే వృద్ధులకు కూడా ప్రత్కేకంగా ఓ బోగీలో కొంత భాగం కేటాయించాలని సూచించింది.
‘అంబులెన్స్ పన్ను’ తగదు!
Published Wed, Dec 24 2014 10:46 PM | Last Updated on Sat, Aug 18 2018 2:15 PM
Advertisement
Advertisement