కల్లు దుకాణాలపై వివరణ ఇవ్వండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం విచారణ రెండు వారాలకు వాయిదా
హైదరాబాద్: హైదరాబాద్ జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో కల్లు దుకాణాలను పునరుద్ధరణపై హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఇందులో భాగంగా అబ్కారీ, రెవెన్యూశాఖల ముఖ్య కార్య దర్శులు, అబ్కారీ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతనెల 4న జారీ చేసిన జీవో 24ను సవాల్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు మస్కు జాన్సన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
హైదరాబాద్ చుట్టుపక్కల తగినన్ని తాటిచెట్లు లేకపోవడంతో స్వచ్ఛమైన కల్లు లభించే అవకాశం లేదని, ఈ నేపథ్యంలో కల్తీకల్లు తయారీ పెరుగుతుందని హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల పరిధిలో కల్లు అమ్మకాలను నిషేధిస్తూ 2007లో అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. కల్తీ కల్లును నియంత్రించే యంత్రాంగాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదన్నారు. కల్లు విక్రయాల ప్రభావం మద్యం విక్రయాలపై పడే అవకాశం ఉందని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయి, సంక్షేమ పథకాలు కుంటుపడే అవకాశం ఉందని కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం, జీవో 24పై వివరణ కోరుతూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.