- బీబీఎంపీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు
- ఏకసభ్య పీఠం ఉత్తర్వులను రద్దు చేసిన చీఫ్ జస్టిస్
సాక్షి, బెంగళూరు: బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుతానికి కాస్తంత మద్దతునిచ్చేలా హైకోర్టు తీర్పు లభించింది. మే 30లోపు బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించాలంటూ హైకోర్టు ఏకసభ్య పీఠం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ రద్దు చేసింది. దీంతో ఇప్పటి వరకు ప్రతిపక్షాల విమర్శలతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రభుత్వానికి కాస్తంత ఊరట లభించినట్లైంది. వివరాలు....బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు ప్రతిపక్షాలు శతవిధాలా ప్రయత్నించాయి.
ఇందులో భాగంగానే ప్రతిపక్షాలు హైకోర్టును సైతం ఆశ్రయించాయి. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయమూర్తి బి.వి.నాగరత్న నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ మే 30లోపు బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లైంది. ఎలాగైనా సరే ఈ ఆదేశాలను అడ్డుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునర్విభజన చేయాల్సి ఉందని, భౌగోళిక అసమానతలను నివారించడంతో పాటు బీబీఎంపీలో జరిగిన అనేక అక్రమాల పై పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉందని, అందువల్ల హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించేందుకు 6నెలల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీలులో కోరింది.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీలు పై సమగ్ర విచారణ జరిపిన హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి డి.హెచ్.వఘేలా, న్యాయమూర్తి రామమోహన్ రెడ్డిలతో కూడిన డివిజనల్ బెంచ్ శుక్రవారం తన తీర్పును వెల్లడించింది. హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఎన్ని రోజుల్లోపు బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించాలన్న విషయంపై ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరిన గడువు 6 నెలలు కాబట్టి మరో ఆరు నెలల వరకు బీబీఎంపీ ఎన్నికల నిర్వహణ గండం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటపడినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎన్నికల్లేవు !
Published Sun, Apr 26 2015 2:40 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM
Advertisement