Delays
-
ఓటీపీ రాలేదా? డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
నెట్ బ్యాంకింగ్, ఆధార్ వంటి సేవల్లో కీలకమైన ఓటీపీ మెసేజ్‌లు అందుకోవడంలో జాప్యంతో టెలికం వినియోగదారులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు డిసెంబర్ 1 నుండి ఉండవని వినియోగదారులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) భరోసా ఇచ్చింది.డిసెంబర్ 1 నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనలతో ముఖ్యమైన ఓటీపీ మెసేజ్‌ల డెలివరీలో ఎటువంటి మందగమనం ఉండదని ట్రాయ్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న తప్పుడు సమాచారంపై స్పందిస్తూ పరిస్థితి అదుపులోనే ఉందని నొక్కి చెప్పింది. సమస్యలను నివారించడంలో భాగంగా సందేశాలను ట్రాకింగ్ చేయడానికి కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు వివరించింది.ఫేక్ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించి పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ట్రాయ్ చురుగ్గా పనిచేస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి వారు అక్టోబర్ 1న కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న అవాంఛిత మెసేజ్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించే వ్యవస్థను నవంబర్ 30 లోపు టెలికాం సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి. వాస్తవానికి అక్టోబర్ 31 వరకే గడువు ఇచ్చినప్పటికీ టెలికం కంపెనీలు మరింత సమయం కావాలని అభ్యర్థించడంతో ట్రాయ్ మంజూరు చేసింది.ఇదీ చదవండి: డిసెంబర్లో బ్యాంకులు పనిచేసేది కొన్ని రోజులే..బల్క్ మెసేజ్‌లు ఎక్కడ నుండి వస్తున్నాయో ట్రాక్ చేసే వ్యవస్థ ఏర్పాటైతే అనుమానాస్పద లేదా మోసపూరిత సందేశాల మూలాన్ని గుర్తించడం వీలవుతుంది. దీంతోపాటు ముఖ్యమైన ఓటీపీల డెలివరీలో జాప్యం తగ్గుతుందని ట్రాయ్ పునరుద్ఘాటించింది. -
ఏజీఆర్ బకాయిలు: వొడాఫోన్ ఐడియాకు ఊరట
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న వొడాఫోన్ ఐడియా రూ.8,837 కోట్ల ఏజీఆర్ బకాయిల చెల్లింపును నాలుగేళ్ల పాటు వాయిదా వేసింది. 2016-17కు అవతల రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఏజీఆర్ బకాయిలు చెల్లించాలంటూ టెలికం శాఖ జూన్ 15న డిమాండ్ చేసినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. ఇవి సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి రానివిగా పేర్కొంది. దీంతో ఏజీఆర్ బకాయిల చెల్లింపు వాయిదా ఆప్షన్‌ను తక్షణం వినియోగించుకోవాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 2026 మార్చి 31 తర్వాత ఆరు సమాన వాయిదాల్లో రూ.8,837 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు అన్ని ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై టెలికం శాఖ మారటోరియం (విరాం) ఆఫర్ చేసిందని.. వాస్తవానికి ఇవి సుప్రీంకోర్టు ఆదేశాల పరిధిలో లేవని వివరించింది. ఏజీఆర్ బకాయిలపై వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్చుకునే ఆప్షన్‌ను టెలికం శాఖ ఆఫర్ చేసినట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వొడాఫోన్ ఐడియా బకాయిలపై వడ్డీ రూ.16,000 కోట్లను ఈక్విటీగా మార్చుకునేందుకు అనుమతించింది. దీంతో కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. 2018-19 సంవత్సరం వరకు అన్ని టెలికం కంపెనీలు ఉమ్మడిగా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.1.65 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. -
ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కరోనా.. కోర్టు తీర్పు ఏంటంటే..
కౌలాలంపూర్: ఓ వ్యక్తి కోవిడ్ సోకడం వల్ల కోర్టు చివరి నిమిషంలో మరణశిక్ష అమలుపై స్టే విధించింది. ఈ ఘటన సింగపూర్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. 2009లో నాగేంద్రన్ కే ధర్మలింగం పోలీసులు అరెస్టు చేశారు. మరుసటి సంవత్సరమే అతనికి మరణశిక్ష విధించారు. ముందస్తు తీర్పు ప్రకారం బుధవారం రోజు అతనికి ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే మంగళవారం రాత్రి ఈ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోసారి సైకియాట్రి పరీక్షలు చేయాలని కోర్టుకు నాగేంద్రన్ లాయర్ కోరారు. మంగళవారం సవాల్‌పై విచారణ జరగనున్నందున అప్పీల్ కోర్టులో చివరి ప్రయత్నంగా అప్పీల్ దాఖలు చేయడంతో ఉరిశిక్షను నిలిపివేశారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణుల బృందం సోమవారం ఈ కేసు చుట్టూ పెరుగుతున్న ఆందోళనలకు తమ స్వరాన్ని జోడించింది, మేధో వైకల్యం ఉన్న వ్యక్తులను ఉరితీయకూడదని పేర్కొంది. అతని శిక్షను తగ్గించాలని యూరోపియన్ యూనియన్ పిలుపునిచ్చింది. నాగేంద్రన్ మరణశిక్షను తగ్గించాలని కోరుతూ ఇప్పటికే ఆన్లైన్ పిటిషన్‌పై దాదాపు 70,000 సంతకాలు వచ్చాయి. కానీ సింగపూర్ హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉరితో ముందుకు వెళ్లాలనే నిర్ణయాన్ని సమర్థించింది. చివరికి ఉరిశిక్ష అమలు జరిగితే, సింగపూర్‌లో 2019 తర్వాత ఇది మొదటిది అవుతుంది. చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్.. -
పీఎఫ్ జమ ఆలస్యం అయితే పెనాల్టీ ఉండదు...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ రోజుల్లో కంపెనీలు తమ ఉద్యోగుల తరఫున భవిష్యనిధి(పీఎఫ్) చందాలను జమ చేయడంలో జాప్యం జరిగితే, ఎటువంటి పెనాల్టీలు వసూలు చేయరాదని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించినట్టు సెంట్రల్ ప్రావిడెండ్ కమిషనర్ సునీల్ బర్త్వాల్ ఓ వెబినార్ సందర్భంగా తెలిపారు.. మార్చి 25 నుంచి కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయడంతో కంపెనీలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు నగదు పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయానికొచ్చింది. ఈపీఎఫ్ పథకం 1952 కింద కంపెనీలు పీఎఫ్ జమలను సకాలంలో చేయకపోతే నష్ట చార్జీ లేదా పెనాల్టీని విధించొచ్చు. గడిచిన నెలకు సంబంధించిన పీఎఫ్‌ను తర్వాతి నెల 15వ తేదీ వరకు జమ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత కూడా10 రోజుల గడువుంటుంది. తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా 6.5 లక్షల సంస్థలకు ఉపశమనం కల్పించనుంది. -
ఇండిగో విమాన సేవల్లో జాప్యం
సాక్షి, న్యూఢిల్లీ : తమ నెట్‌వర్క్‌లో సిస్టమ్స్ డౌన్ కావడంతో విమానాల రాకపోకల్లో జాప్యం నెలకొంటుందని ఇండిగో ఎయిర్‌లైన్స్ పేర్కొంది. పలు విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలతో తమ ఆపరేషన్స్‌లో ఆలస్యం జరగవచ్చని త్వరలోనే సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని ఇండిగో ఓ ప్రకటనలో పేర్కొంది. తమ ప్రయాణీకులకు తలెత్తిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నారు. ప్రయాణీకులు సంస్థ సోషల్ మీడియా వేదికలపై తమ కస్టమర్ కేర్ సిబ్బందిని సంప్రదించి అవసరమైన సమాచారం పొందవచ్చని పేర్కొంది. ముంబైలో ఇప్పటికి తొమ్మిది విమానాల ఆపరేషన్స్‌లో జాప్యం నెలకొందని తెలిపింది. ఈ రోజంతా సర్వర్ డౌన్ కారణంగా మరింత జాప్యం చోటుచేసుకోవచ్చని ప్రయాణీకులు గమనించాలని కోరింది. -
పైసల్లేవ్..!
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : జిల్లాలో ఆసరా లబ్ధిదారులను నగదు కొరత వెంటాడుతోంది. సరిపడా నగదు లేకపోవడంతో ఈనెల ఇంకా చాలా మందికి పింఛన్లు అందలేదు. దీంతో లబ్ధిదారులు పింఛన్ ఎప్పుడుస్తుందోనని ఆశగా ఎదురుచూపుల్లో గడుపుతున్నారు. గతంలో ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకులు ‘ఆసరా’ పథకం ద్వారా కేటగిరీల వారీగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తారు. అయితే, గతంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో ఆలస్యం చేసేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా బ్యాంకుల్లో కొరత కారణంగా లబ్ధిదారులకు అందడం లేదు. దీంతో వారు ఆయోమయంలో పడిపోయారు. ఇప్పటికి లబ్ధిదారులకు నవంబర్, డిసెంబర్ నెలల పింఛన్ అందాల్సి ఉంది. పది రోజుల పాటు ప్రతి నెలా 22వ తేదీ నుంచి మరుసటి నెల 2వ తేదీ వరకు పింఛన్లు అందజేయాలి. కానీ రిజర్వ్ బ్యాంకు నుంచి సరిపడా నగదు రాకపోవడంతో స్థానిక బ్యాంకుల్లో కొరత ఏర్పడింది. ప్రతీ నెల పింఛన్ల పంపిణీ కోసం రూ.22.29 కోట్లు అవసరం. కానీ ఇందులో నవంబర్ నెలకు చెందిన రూ.22.29 కోట్లలో రూ.11 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా మిగతా రూ.11.29 కోట్ల నిధులు రావాల్సి ఉంది. అలాగే, డిసెంబర్ నెలకు సం బంధించి మొత్తం అందాలి. ప్రతీనెలా ఆర్బీఐ నుంచి జిల్లా లోని ఎస్బీఐ మదర్ బ్యాం కుకు పింఛన్ డబ్బు చేరుతుంది. ఇందులో వచ్చే నెల కోసం కొంత నగదు నిల్వ ఉంచి పంపిణీ చేస్తారు. అయితే, ఈసారి రిజర్వ్ బ్యాంకు జిల్లాకు కేవలం రూ.11 కోట్లే ఇవ్వడంతో బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేశారు. అయి తే, చెల్లించాల్సిన మొత్తం ఇంకా ఉండడంతో లబ్ధిదారులు ప్రతీరోజూ బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరిగి వెళ్తున్నారు. లబ్ధిదారులు గాబరా పడొద్దు.. బ్యాంకుల్లో నగదు కొరత వల్ల ‘ఆసరా’ పింఛన్ల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. అంతే తప్ప ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదు. అవుతుంది. ఈ మేరకు ఆసరా లబ్ధిదారులు గాబరా పడొద్దు. ప్రతిరోజు కొన్నికొన్ని డబ్బులు వస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో మొత్తం డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తాం. – శారద, ఆసరా ఏపీఓ -
‘లక్ష్మి’ వరించేదెప్పుడో.?
పెనుబల్లి : కల్యాణ లక్ష్మి, షాదీముభారక్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయం అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో సుమారు మూడు వందల మందికి గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా చెక్కులు మంజూరు కాలేదు. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు వాటికోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కల్యాణ లక్ష్మి, షాదీముభారక్ పథకాల ద్వారా రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందన్న ఆశతో వధువు తల్లిదండ్రులు.. అప్పులు చేసి వివాహ వేడుకలను, లాంఛనాలను ఘనంగా నిర్వహించారు. దీని కోసం దొరికాడల్లా అప్పులు చేసి మరీ వివాహాలు జరిపించారు. ఇలా గత జనవరి నుంచి డిసెంబర్ వరకు మండలంలో సుమారు మూడు వందల మంది వరకు వివాహాలు చేసి ఆన్లైన్ ద్వారా కల్యాణ లక్ష్మి పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో సగం వరకు రెవెన్యూ అధికారులు విచారణ చేసి అర్హులైన వారికి మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. మరో 100 నుంచి 150 మంది వరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను ఇంకా రెవెన్యూ అధికారులు విచారణ కూడా చేపట్టలేదు. విచారణ చేపట్టేదెప్పుడు, తమకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా చెక్కులు అందేదెప్పుడని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో తహసీల్దార్లు విచారణ చేపట్టి చెక్కు లు అందజేసే విధానం నుంచి స్థానిక ఎమ్మెల్యేను కూడా దీనిలో భాగాస్వామ్యం చేయడంతో కొన్ని మండలాల్లో రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యేకు సమన్వయం లోపించింది. దీంతో రెవెన్యూ అధికారులు తమ తప్పిదాన్ని ప్రజా ప్రతినిధులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే కల్లూరు మండల రెవెన్యూ అధికారులు.. కల్యాణ లక్ష్మి చెక్కుల మంజూరులో ఎమ్మెల్యే జాప్యం చేస్తున్నారని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇటీవల కల్లూరు రెవెన్యూ కార్యాలయంలో అనుచరులు, లబ్ధిదారులతో కలిసి బైఠాయించారు. వెంటనే లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం చెక్కులు అందజేయాలని, తన వద్ద ఎటువంటి పెండింగ్ లేదని, రెవెన్యూ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ ఎమ్మెల్యే నిలదీశారు. ఏదీ ఏమైనా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలాన.. నెలల తరబడి కల్యాణ లక్ష్మి చెక్కుల కోసం లబ్ధిదారులు ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. మే నుంచి చెక్కు రాలేదు.. మే నెలలో మమ్మాయి వివాహం చేశా. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు విచారణకు రాలేదు. మాకు సాయం అందేదెప్పుడో. - చీపి కృష్ణ, పెనుబల్లి ఆగస్టు నుంచి చెక్కు రాలేదు.. ఆగస్టులో అమ్మాయికి వివాహం చేశా. ఇంతవరకు అధికారులు విచారణకు రాలేదు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించాలి. విచారణ చేపట్టి న్యాయం చేయాలి. – నాగుల నాగేశ్వరరావు, పెనుబల్లి జాప్యం జరిగింది.. భూ ప్రక్షాళన విధుల కారణంగా జాప్యం జరిగింది. కొన్ని దరఖాస్తులను పరిశీలించి నివేదిక అందించాం. మరికొన్ని దరఖాస్తులను విచారిస్తున్నాం. త్వరగా విచారిస్తాం. – తూమాటి శ్రీనివాస్, తహసీల్దార్ -
మళ్లీ వాయిదా: రాహుల్‌కు పగ్గాలు అప్పుడే...
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ చీఫ్ పగ్గాలు చేపట్టేందుకు మరికొంత సమయం పడుతుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే రాహుల్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారు. సోనియా అనారోగ్యం ఇతర కారణాలతో రాహుల్ దీపావళి అనంతరం గుజరాత్,హిమాచల్ ఎన్నికల ముందే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని సీనియర్ నాయకులు చెప్పినప్పటికీ ఆ దిశగా ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవు. అధినేత్రి సోనియా నిర్ణయంలో జాప్యంతో కాంగ్రెస్ చీఫ్ హోదాలో రాహుల్ గుజరాత్ ఎన్నికల ప్రచార బరిలో దిగుతారని ఆశించిన ఆ పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నాయి.మరోవైపు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతోత్సవాల సందర్భంగా నవంబర్ 9 నుంచి నవంబర్ 19 మధ్య ఏ క్షణమైనా రాహుల్‌ను పార్టీ చీఫ్‌గా ఎంపిక చేస్తారనే ప్రచారం సాగుతున్నా దీనిపై ఎలాంటి స్పష్టతా లేదు. సోనియా గోవాలో ఉండటం, రాహుల్ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో కీలక నిర్ణయం వాయిదా పడుతూవస్తోందని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చినా బీజేపీకే అధికార పీఠం దక్కుతుందని పలు సర్వేలు పేర్కొంటున్న క్రమంలో రాహుల్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై అధినేత్రి తటపటాయిస్తున్నట్టు సమాచారం. ఇక రాహుల్‌కు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమై ఎన్నికల ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే క్రమంలో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో అడ్డంకులు ఎదురవుతాయనే కోణంలోనూ కొంత వెనక్కితగ్గినట్టు చెబుతున్నారు. సంస్థాగత ఎన్నికలు నిర్వహించి ఆపై ఏఐసీసీ ఎన్నికలు చేపట్టి రాహుల్ ఎంపికను పూర్తిచేయాల్సి ఉంది. ఇంత హడావిడిగా రాహుల్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టినా హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బలు తగిలితే యువనేత ఇమేజ్‌కు భంగం వాటిల్లుతుందనే ఆందోళనతోనూ అధినేత్రి పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం. తాజా పరిణామాల ప్రకారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అనంతరమే రాహుల్ పార్టీ పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. -
గెలాక్సీ నోట్7 షిప్మెంట్లకు షాక్
సియోల్ : ఓ వైపు గెలాక్సీ నోట్ 7 సప్లైను మించి డిమాండ్‌లో దూసుకెళ్తుండగా... మరోవైపు ఆ డివైజ్‌ల సరుకు రవాణా ఆలస్యం కానుందట. ప్రీమియం డివైజ్‌ల్లో అదనంగా నాణ్యతా నియంత్రణ పరీక్షలు చేపట్టనున్న నేపథ్యంలో గెలాక్సీ నోట్ 7 డివైజ్‌ల సరుకు రవాణాను జాప్యం చేయనున్నట్టు టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది. దక్షిణ కొరియాకు చెందిన టాప్-3 క్యారియర్స్(డివైజ్‌లను రవాణా చేసే సంస్థలు) ఎస్కే టెలికాం కంపెనీ లిమిటెడ్, కేటీ కార్పొ, ఎల్జీ అప్లస్ కార్పొలకు పూర్తిగా సరుకు రవాణా నిలిపివేసినట్టు తెలిపింది. ఉత్పత్తి నాణ్యతలో మరిన్ని పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలోనే గెలాక్సీ నోట్7ల సరుకు రవాణాను ఆలస్యం చేస్తున్నామని రాయిటర్స్‌కు పంపిన ఓ ప్రకటనలో శాంసంగ్ పేర్కొంది. అయితే ఫోన్లో లోపాలను శాంసంగ్ వెల్లడించలేదు. గెలాక్సీ నోట్7 ఫోన్ కస్టమర్ల నుంచి శాంసంగ్‌కు భారీగానే ఫిర్యాదులు వెళ్లాయట. ఫోన్‌కు చార్జింగ్ పెడుతున్న సమయంలో పేలుడు ఘటనలు సంభవిస్తున్నాయని కస్టమర్ల ఫిర్యాదులు చేశారని దక్షిణ కొరియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో శాంసంగ్ గెలాక్సీ నోట్7 క్వాలిటీ కంట్రోల్లో అదనంగా పరీక్షలు నిర్వహించాలని కంపెనీ భావించిందని రిపోర్టులు వెల్లడించాయి. గతేడాది కూడా గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ఫోన్‌ను వినియోగదారులు ఆశించిన మేర సప్లై చేయక అమ్మకాల్లో నిరాశపరిచింది. మరోవైపు శాంసంగ్ పోటీ సంస్థ యాపిల్ వచ్చే వారంలోనే తన కొత్త ఫోన్లను ఆవిష్కరించనున్న నేపథ్యంలో సరుకురవాణా జాప్యం చేయడం అంతమంచిది కాదని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ నోట్7లో లోపాలను వెంటనే సవరించుకోవాలని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరోవైపు గెలాక్సీ నోట్7 డివైజ్‌లు సరుకు రవాణా ఆలస్యం కానున్నట్టు వార్త బయటికి పొక్కగానే ఆ కంపెనీ షేర్లు ఢమాల్ మనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు రెండు వారాల కనిష్టంలో నమోదయ్యాయి. -
7,14 తేదీల్లో ఆలస్యంగా రైళ్లు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-డోన్ సెక్షన్లో నిర్మాణ పనుల దృష్ట్యా జూన్ 7, 14 తేదీల్లో పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-గుంతకల్ ప్యాసింజర్ ఉదయం 9.40కి బదులు 11.40కి బయలుదేరుతుంది, కర్నూల్-కాచిగూడ ప్యాసింజర్ ఉదయం 7.05కు బదులు ఉదయం 9.35కు కర్నూల్ నుంచి బయలుదేరుతుంది. మహబూబ్‌నగర్-మిర్జాపల్లి ప్యాసింజర్ సాయంత్రం 4.10కి బదులు రాత్రి 8 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి బయలుదేరుతుంది. కాచిగూడ-మహబూబ్‌నగర్ ప్యాసింజర్ మధ్యాహ్నం 1.10 గంటలకు బదులు సాయంత్రం 4.40కి కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. -
జెట్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు
అహ్మదాబాద్: బాంబు బెదిరింపు కారణంగా ముంబై బయల్దేరాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని నిలిపివేశారు. అహ్మదాబాద్ నుంచి జెట్ ఎయిర్వేస్ విమానం బుధవారం ముంబై బయలుదేరాల్సి ఉంది. అయితే బాంబు బెదిరింపు కారణంగా విమానాన్ని నిలిపి వేసి తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపు సమాచారంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. -
జెట్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు
ఢిల్లీ: ఓ బాంబు బెదిరింపు కాల్ కారణంగా గోరక్ పూర్ బయల్దేరాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానం సుమారు రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. 55 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బందితో సహా ప్రయాణానికి సిద్ధంగా ఉన్న విమానాన్ని వైమానిక సంస్థ కార్యాలయానికి బాంబు బెదిరిపు కాల్ రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా నిలిపివేశారు. విమానం బయల్దేరేందుకు సిద్ధంగా ఉండగా బాంబు బెదిరింపు కాల్ రావడం ఆలస్యానికి కారణమైందని, తర్వాత అది బూటకపు కాల్ అని తెలుసుకున్నట్లు ఎయిర్ లైన్స్ తెలిపింది. ఏటీ ఆర్ నిర్వహిస్తున్న జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 9W-2467 విమానం ఢిల్లీనుంచి గోరక్ పూర్ కు మధ్యాహ్నం 1.30 కి బయల్దేరాల్సి ఉంది. సుమారు 12.30 సమయంలో వైమానిక సంస్థ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. బాంబు భయం ఉన్నమాట నిజమేనని తాము అధికారికంగా నిర్వహిస్తున్న ట్విట్టర్ ద్వారా తమకు తెలిసినట్లు ఢిల్లీ పోలీసులు కూడ ధృవీకరించారు. దీంతో విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన సిబ్బంది అటువంటిదేమీ లేదని నిర్థారించి విమానం బయల్దేరేందుకు ఏర్పాట్లు చేశారు. భద్రతా హెచ్చరికల మేరకు తనిఖీ ప్రక్రియ చేపట్టామని, ప్రయాణీకులకు ఎటువంటి ప్రమాదం లేదని, అంతా సురక్షితమేనని ఢిల్లీ పోలీసులు ఓ ట్వీట్లో తెలిపారు. సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత విమానం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు బయల్దేరినట్లు ఎయిర్ లైన్స్ ప్రకటించింది. -
నెల్లూరులో భారీ వర్షం - ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
వాయు గుండం ప్రభావంతో జిల్లాలో మూడో రోజు భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నాటికి జిల్లా వ్యాప్తంగా వర్షాల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గూడూరు వద్ద నీటిలో కొట్టుకు పోతున్న ఒక వ్యక్తిని స్థానికులు కాపాడారు. మరో వైపు భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొండాపురం మండలం గండి కట్ట చెరువుకు గండి పడింది. పొదలకూరు మండలం భోగాపురం చెరువుకు గండి పడటంతో.. హరిజన వాడకు వరద ముప్పు పొంచి ఉంది. సైదాపురం సమీపంలో కైవల్యానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు ప్రాంతాలకు రాక పోకలు నిలిచి పోయాయి. ఆత్మకూరులో బొగ్గేరు, కేతమన్నేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గూడురు వద్ద పంబలేరు నీటి ప్రవాహం పెరిగింది. భారీ వర్షాల కారణంగా నెల్లూరు - చెన్నై మధ్య రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మనుబోలు వద్ద వరద నీరు పొంగి.. రహదారిపైకి చేరింది. రైల్వే ట్రాక్ పైకి వరద నీరు రావడంతో.. ట్రాక్ కుంగి పోయింది. -
తేనెటీగలా మజాకానా?
మాస్కో: మన దేశంలో వీఐపీ కల్చర్ విమానాల ఆలస్యానికి కారణమవుతోంటే. రష్యాలో మాత్రం అనుకోని అతిథుల వల్ల విమానం సుమారు గంటసేపు నిలిచిపోయింది. అవును.. మాస్కో విమానాశ్రయంలో తేనెటీగలు హల్చల్ చేశాయి. ఒక్కసారి సమూహంగా విమానంపై విరుచుకుపడి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాయి. రోసియా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం ఎయిర్ బస్-319 మరికొద్ది సేపట్లో గాల్లోకి ఎగురుతుందనగా గుంపులు గుంపులుగా తేనెటీగలు వచ్చిపడ్డాయి. వేలాదిగా వచ్చిన తేనెటీగలు ఒక్కసారిగా విమానాన్ని చుట్టుముట్టి విమాన రెక్కలను పూర్తిగా కవర్ చేసేశాయి. ప్రయాణికులపై దాడికి దిగాయి. దీంతో సిబ్బంది అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రెండు అంబులెన్స్‌లను రంగంలోకి దించారు. ఊహించని ఈ పరిణామంతో మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళ్లాల్సిన విమానం గంటసేపు నిలిచిపోయింది. ఇంకా ఎక్కడైనా తేనెటీగలు దాక్కున్నాయేమోననే భయంతో క్యాబిన్ లోపల కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కాగా గత నెలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్టు సమాచారం. యూకే నుంచి డబ్లిన్‌కు పయనమై విమానమొకటి తేనెటీగల కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. -
ఎన్నికల్లేవు !
- బీబీఎంపీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు - ఏకసభ్య పీఠం ఉత్తర్వులను రద్దు చేసిన చీఫ్ జస్టిస్ సాక్షి, బెంగళూరు: బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుతానికి కాస్తంత మద్దతునిచ్చేలా హైకోర్టు తీర్పు లభించింది. మే 30లోపు బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించాలంటూ హైకోర్టు ఏకసభ్య పీఠం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ రద్దు చేసింది. దీంతో ఇప్పటి వరకు ప్రతిపక్షాల విమర్శలతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రభుత్వానికి కాస్తంత ఊరట లభించినట్లైంది. వివరాలు....బీబీఎంపీ ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు ప్రతిపక్షాలు శతవిధాలా ప్రయత్నించాయి. ఇందులో భాగంగానే ప్రతిపక్షాలు హైకోర్టును సైతం ఆశ్రయించాయి. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయమూర్తి బి.వి.నాగరత్న నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ మే 30లోపు బీబీఎంపీ ఎన్నికలను నిర్వహించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లైంది. ఎలాగైనా సరే ఈ ఆదేశాలను అడ్డుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునర్విభజన చేయాల్సి ఉందని, భౌగోళిక అసమానతలను నివారించడంతో పాటు బీబీఎంపీలో జరిగిన అనేక అక్రమాల పై పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉందని, అందువల్ల హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించేందుకు 6నెలల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీలులో కోరింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీలు పై సమగ్ర విచారణ జరిపిన హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి డి.హెచ్.వఘేలా, న్యాయమూర్తి రామమోహన్ రెడ్డిలతో కూడిన డివిజనల్ బెంచ్ శుక్రవారం తన తీర్పును వెల్లడించింది. హైకోర్టు ఏకసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఎన్ని రోజుల్లోపు బీబీఎంపీ ఎన్నికలు నిర్వహించాలన్న విషయంపై ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరిన గడువు 6 నెలలు కాబట్టి మరో ఆరు నెలల వరకు బీబీఎంపీ ఎన్నికల నిర్వహణ గండం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటపడినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు.