తేనెటీగలా మజాకానా?
మాస్కో: మన దేశంలో వీఐపీ కల్చర్ విమానాల ఆలస్యానికి కారణమవుతోంటే. రష్యాలో మాత్రం అనుకోని అతిథుల వల్ల విమానం సుమారు గంటసేపు నిలిచిపోయింది. అవును.. మాస్కో విమానాశ్రయంలో తేనెటీగలు హల్చల్ చేశాయి. ఒక్కసారి సమూహంగా విమానంపై విరుచుకుపడి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాయి.
రోసియా ఎయిర్ లైన్స్కు చెందిన విమానం ఎయిర్ బస్-319 మరికొద్ది సేపట్లో గాల్లోకి ఎగురుతుందనగా గుంపులు గుంపులుగా తేనెటీగలు వచ్చిపడ్డాయి. వేలాదిగా వచ్చిన తేనెటీగలు ఒక్కసారిగా విమానాన్ని చుట్టుముట్టి విమాన రెక్కలను పూర్తిగా కవర్ చేసేశాయి. ప్రయాణికులపై దాడికి దిగాయి. దీంతో సిబ్బంది అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రెండు అంబులెన్స్లను రంగంలోకి దించారు. ఊహించని ఈ పరిణామంతో మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళ్లాల్సిన విమానం గంటసేపు నిలిచిపోయింది. ఇంకా ఎక్కడైనా తేనెటీగలు దాక్కున్నాయేమోననే భయంతో క్యాబిన్ లోపల కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.
కాగా గత నెలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్టు సమాచారం. యూకే నుంచి డబ్లిన్కు పయనమై విమానమొకటి తేనెటీగల కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది.