పెనుబల్లి : కల్యాణ లక్ష్మి, షాదీముభారక్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయం అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో సుమారు మూడు వందల మందికి గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా చెక్కులు మంజూరు కాలేదు. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు వాటికోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కల్యాణ లక్ష్మి, షాదీముభారక్ పథకాల ద్వారా రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందన్న ఆశతో వధువు తల్లిదండ్రులు.. అప్పులు చేసి వివాహ వేడుకలను, లాంఛనాలను ఘనంగా నిర్వహించారు. దీని కోసం దొరికాడల్లా అప్పులు చేసి మరీ వివాహాలు జరిపించారు. ఇలా గత జనవరి నుంచి డిసెంబర్ వరకు మండలంలో సుమారు మూడు వందల మంది వరకు వివాహాలు చేసి ఆన్‌లైన్ ద్వారా కల్యాణ లక్ష్మి పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో సగం వరకు రెవెన్యూ అధికారులు విచారణ చేసి అర్హులైన వారికి మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. మరో 100 నుంచి 150 మంది వరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను ఇంకా రెవెన్యూ అధికారులు విచారణ కూడా చేపట్టలేదు. విచారణ చేపట్టేదెప్పుడు, తమకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా చెక్కులు అందేదెప్పుడని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే గతంలో తహసీల్దార్లు విచారణ చేపట్టి చెక్కు లు అందజేసే విధానం నుంచి స్థానిక ఎమ్మెల్యేను కూడా దీనిలో భాగాస్వామ్యం చేయడంతో కొన్ని మండలాల్లో రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యేకు సమన్వయం లోపించింది. దీంతో రెవెన్యూ అధికారులు తమ తప్పిదాన్ని ప్రజా ప్రతినిధులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే కల్లూరు మండల రెవెన్యూ అధికారులు.. కల్యాణ లక్ష్మి చెక్కుల మంజూరులో ఎమ్మెల్యే జాప్యం చేస్తున్నారని చెప్పారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇటీవల కల్లూరు రెవెన్యూ కార్యాలయంలో అనుచరులు, లబ్ధిదారులతో కలిసి బైఠాయించారు. వెంటనే లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం చెక్కులు అందజేయాలని, తన వద్ద ఎటువంటి పెండింగ్ లేదని, రెవెన్యూ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ ఎమ్మెల్యే నిలదీశారు. ఏదీ ఏమైనా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలాన.. నెలల తరబడి కల్యాణ లక్ష్మి చెక్కుల కోసం లబ్ధిదారులు ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.
మే నుంచి చెక్కు రాలేదు..
మే నెలలో మమ్మాయి వివాహం చేశా. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు విచారణకు రాలేదు. మాకు సాయం అందేదెప్పుడో. - చీపి కృష్ణ, పెనుబల్లి
ఆగస్టు నుంచి చెక్కు రాలేదు..
ఆగస్టులో అమ్మాయికి వివాహం చేశా. ఇంతవరకు అధికారులు విచారణకు రాలేదు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించాలి. విచారణ చేపట్టి న్యాయం చేయాలి. – నాగుల నాగేశ్వరరావు, పెనుబల్లి
జాప్యం జరిగింది..
భూ ప్రక్షాళన విధుల కారణంగా జాప్యం జరిగింది. కొన్ని దరఖాస్తులను పరిశీలించి నివేదిక అందించాం. మరికొన్ని దరఖాస్తులను విచారిస్తున్నాం. త్వరగా విచారిస్తాం. – తూమాటి శ్రీనివాస్, తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment