Shadi mubharak scheme
-
50 ఏళ్ల కింద పెళ్లయిన వారికి.. ‘కల్యాణలక్ష్మి’!
సాక్షి, హైదరాబాద్: ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందే. కానీ అసలు దరఖాస్తు చేయకున్నా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయం రావడం, అదీ ఎప్పుడో 40, 50 ఏళ్ల కింద పెళ్లయిన వృద్ధుల ఖాతాల్లో పడుతుండటం విచిత్రం. ఇందులోనూ కొందరికి రెండు, మూడుసార్లు సొమ్ము జమవుతుండటం గమనార్హం. ►ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన శకుంతలబాయి వయసు 67 ఏళ్లు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పదిహేనేళ్ల కిందే పిల్లల పెళ్లిళ్లు జరిగిపోయాయి. కానీ శకుంతల బాయి బ్యాంకు ఖాతాలో రెండుసార్లు కల్యాణలక్ష్మి ఆర్థిక సాయం జమ అయింది. ►సిరికొండ మండలానికే చెందిన 65 ఏళ్ల సుమన్‌బాయి బ్యాంకు ఖాతాలో అయితే మూడు సార్లు కల్యాణలక్ష్మి నిధులు జమకావడం గమనార్హం. ►ఇచ్చోడ మండలం చించోలికి చెందిన గంగుబాయి వయసు 70 ఏళ్లు. ఆమె భర్త పదేళ్ల క్రితం మరణించాడు. ఆమె బ్యాంకు ఖాతాలోనూ రెండుసార్లు ఆర్థికసాయం నిధులు జమయ్యాయి. పొరపాటు కాదు.. అక్రమాలే! వృద్ధుల ఖాతాల్లో కల్యాణలక్ష్మి సొమ్ములు దఫదఫాలుగా జమకావడం కేవలం సాంకేతిక పొరపాటు కాదని.. నిధులను దారిమళ్లించే అక్రమాలేనని ఆరోపణలు ఉన్నాయి. కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ పథకాల సొమ్మును కాజేసేందుకు.. నకిలీ లబ్ధిదారుల పేరిట దరఖాస్తులు చేస్తున్నారని తెలిసింది. వారి ఖాతాల్లో జమ అయిన సొమ్మును ఏదో ఒక కారణం చెప్పి విత్‌డ్రా చేయించుకుంటున్నారని సమాచారం. అక్రమాలపై ‘నిఘా’.. ఏదీ? సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి నిఘా వ్యవస్థ బలహీనంగా ఉంది.. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో మరింత గందరగోళం నెలకొందని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం తొలుత ఈ పథకాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ద్వారా అమలు చేసింది. తర్వాత కొత్త విధానాన్ని తెచ్చింది. దరఖాస్తుల స్వీకరణను ఆన్లైన్ చేసింది. దరఖాస్తుల పరిశీలన, మంజూరు ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం, శాసనసభ్యులకు అధికారం ఇచ్చింది. కేవలం నిధులు విడుదల చేసే బాధ్యతను సంక్షేమశాఖలకు అప్పగించింది. ఇలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రెండేసి శాఖలు అమలు చేస్తుండడంతో.. అక్రమాలను నివారించే బాధ్యత ఎవరికీ పట్టడం లేదు. కనీసం ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపైనా స్పష్టత లేదు. దీనితో మధ్యవర్తులు, అవినీతి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.2వేల కోట్ల మేర ఈ పథకాలకు ఖర్చు చేస్తున్నా.. నిఘా వ్యవస్థపై ఇప్పటికీ దృష్టిసారించకపోవడం గమనార్హం. అర్హత నిర్ధారణలో జాప్యం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలనలో మూడు దశలు ఉంటాయి. ముందుగా ఆన్లైన్లో నమోదైన దరఖాస్తు తహసీల్దార్ లాగిన్‌కు చేరుతుంది. తహసీల్దార్ ఆ దరఖాస్తును తెరిచి పరిశీలిస్తారు. తర్వాత రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి విచారణ చేపట్టి అర్హతలను నిర్ధారిస్తారు. తర్వాత ఆ దరఖాస్తు ఎమ్మెల్యేకు చేరుతుంది. అక్కడ ఆమోదం పొందాక.. రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) వద్దకు చేరుతుంది. ఆర్డీవో అర్హత నిర్ధారించి పథకాన్ని మంజూరు చేస్తారు. తర్వాత నిధులు విడుదలవుతాయి. అయితే రెవెన్యూ అధికారులపై పనిభారం కారణంగా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. ఎమ్మెల్యే, ఆర్డీవో స్థాయిల్లోనూ నెలల తరబడి పరిశీలనకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,09,027 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో సగానికిపైగా దరఖాస్తులు గత ఏడాది లబ్ధిదారులకు సంబంధించినవే.. ఈ ఏడాదికి క్యారీ ఫార్వార్డ్ అయినవి. పెళ్లయి నెలలు గడుస్తున్నా.. సొమ్ము రావట్లే.. ఆడబిడ్డ పెళ్లి నాటికే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఆర్థిక సాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఎక్కడా ఈ లక్ష్యం నెరవేరడం లేదు. పెళ్లయిన నెలరోజులకు సాయం అందినా కాస్త ఊరట దక్కుతుందని.. కానీ నెలలు గడుస్తున్నా ఆర్థిక సాయం అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కొందరైతే ఏడాది దాటినా తమకు సాయం అందలేదంటూ సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన నుంచి నిధుల విడుదల దాకా తీవ్ర జాప్యం జరుగుతుండటమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఏటా సగటున 1.5 లక్షల నుంచి 2 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. బడ్జెట్లో ప్రభుత్వం ఈమేరకు నిధులు కేటాయిస్తున్నా.. విడుదలలో జాప్యం జరుగుతోంది. సదరు ఆర్థిక సంవత్సరం ముగిసినా బిల్లులు క్లియర్ కావడం లేదు. వాటిని మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వర్ చేస్తుండడంతో.. బడ్జెట్ కేటాయింపులు సరిపోని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సంక్షేమశాఖల గణాంకాలు చెప్తున్నాయి. బడ్జెట్ లేకపోవడంతో వాటిని వివిధ దశల్లో ఆపినట్టు సమాచారం. వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు కేటగిరీ తహసీల్దార్ ఎమ్మెల్యే ఆర్డీవో ఎస్సీ 6,082 3,831 5,665 ఎస్టీ 4,665 2,663 10,013 బీసీ 16,458 10,481 13,584 ఈబీసీ 1,905 1,031 1,671 మైనార్టీ 5,034 3,173 22,771 మొత్తం 34,144 21,179 53,704 విజిలెన్స్ గుర్తించినా చర్యలేవీ? కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్టు విజిలెన్స్ విభాగం గతంలోనే గుర్తించింది. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, నిజామాబాద్, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో విజిలెన్స్ విభాగం అధికారులు చేపట్టిన విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. రెవెన్యూ శాఖలో తహసీల్దార్లు మొదలు డిప్యూటీ తహసీల్ధార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ సహాయకుల దాకా వసూళ్లకు తెగబడుతున్నట్టు తేల్చింది. కొన్నిచోట్ల గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, రాజకీయ పార్టీల నాయకులు మధ్యవర్తులుగా, ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించింది. ఈ అంశంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు కూడా చేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కూడా. కానీ ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. మ్యాన్యువల్ వ్యవహారానికి చెక్ పెడితేనే.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకే ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. దానిని పక్కాగా అమలు చేస్తేనే అక్రమాలకు చెక్‌పడుతుందని లబ్ధిదారులు అంటున్నారు. వసూళ్ల కోసమే మధ్యవర్తులు, అధికారులు మ్యాన్యువల్ దరఖాస్తుల వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాము ముందుండి దరఖాస్తులను ప్రాసెస్ చేయిస్తున్నట్టు వ్యవహరించడం, తప్పులు ఉన్నాయని, సరిచేయడానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం సులువు అవుతోందని అంటున్నారు. మ్యాన్యువల్‌గా దరఖాస్తులు తీసుకోవద్దని అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనివల్ల అక్రమాలకు చెక్పడటంతోపాటు పారదర్శకత పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. పెళ్లయి నెలలు గడుస్తున్నా.. సొమ్ము రావట్లే.. ఆడబిడ్డ పెళ్లి నాటికే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఆర్థిక సాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఎక్కడా ఈ లక్ష్యం నెరవేరడం లేదు. పెళ్లయిన నెలరోజులకు సాయం అందినా కాస్త ఊరట దక్కుతుందని.. కానీ నెలలు గడుస్తున్నా ఆర్థిక సాయం అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కొందరైతే ఏడాది దాటినా తమకు సాయం అందలేదంటూ సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన నుంచి నిధుల విడుదల దాకా తీవ్ర జాప్యం జరుగుతుండటమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఏటా సగటున 1.5 లక్షల నుంచి 2 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. బడ్జెట్లో ప్రభుత్వం ఈమేరకు నిధులు కేటాయిస్తున్నా.. విడుదలలో జాప్యం జరుగుతోంది. సదరు ఆర్థిక సంవత్సరం ముగిసినా బిల్లులు క్లియర్ కావడం లేదు. వాటిని మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వర్ చేస్తుండడంతో.. బడ్జెట్ కేటాయింపులు సరిపోని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సంక్షేమశాఖల గణాంకాలు చెప్తున్నాయి. బడ్జెట్ లేకపోవడంతో వాటిని వివిధ దశల్లో ఆపినట్టు సమాచారం. దరఖాస్తుకు ఏమేం కావాలి? దరఖాస్తుదారులు ఈపాస్ వెబ్సైట్లో నేరుగాగానీ, మీసేవ కేంద్రాల ద్వారాగానీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో పెళ్లికూతురు వివరాలు, ఆధార్ కార్డు, కులధ్రువీకరణ పత్రం, వివాహ ధ్రువీకరణ పత్రం, పెళ్లికార్డు, పెళ్లి జరిగిన రుజువులతో కూడిన ఫొటో, తల్లి బ్యాంకు ఖాతా నంబర్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. మ్యాన్యువల్‌గా ఈ దరఖాస్తును, ఆధారాలను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సిన అవసరం లేదు. త్వరగా అందితేనే సాయానికి విలువ పేద కుటుంబాలను ఆదుకోవడానికే ప్రభుత్వం కల్యాణలక్షి్మ, షాదీ ముబారక్ పథకాలను తెచి్చంది. ఆడపిల్ల పెళ్లి నాటికి ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలనే లక్ష్యం నీరుగారిపోతోంది. పెళ్లి రోజే సాయం చేస్తామని ప్రకటించినా.. ఆరు నెలలు, ఏడాది దాకా కూడా ఆర్థిక సాయం అందడం లేదు. ఇది ఈ పథకాల స్ఫూర్తికే విరుద్ధం. ఈ పథకాలకు సకాలంలో నిధులు ఇవ్వకపోవడం సరికాదు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు అడ్వాన్స్‌గా నిధులు ఉంచి గ్రీన్ చానెల్ ద్వారా పంపిణీ చేయాలి. బకాయిలు ఉండకుండా చూడాలి. కనీసం దరఖాస్తు చేసుకున్న నెలరోజుల్లోగా పరిష్కరిస్తే పేదింటికి లాభం జరుగుతుంది. – రమ్య, కార్యనిర్వాహక అధ్యక్షురాలు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం -
కళ్యాణలక్ష్మి: కాసులిస్తేనే.. ‘కానుక’!
పేదింటి ఆడబిడ్డల పెళ్లి ఆ కుటుంబాలకు భారం కాకూడదన్న ఉదాత్త లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటిని పారదర్శకంగా అమలు చేసేందుకు ఆన్లైన్ విధానాన్నీ ప్రవేశపెట్టింది. కానీ కొందరు అధికారులు, సిబ్బంది మాత్రం ఆడబిడ్డలకు అందే ఆర్థికసాయంలోనూ కక్కుర్తిపడుతున్నారు. చేయి తడిపితేనే పనవుతుందంటూ వసూళ్లకు తెగబడుతున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల దాకా కమీషన్ల రూపంలో దండుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు దళారులుగా మారి కమీషన్లు తీసుకుంటున్నారు. ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఇలాంటి వాస్తవాలెన్నో బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని వెల్లడైంది. దీనిపై ప్రత్యేక కథనం. -చిలుకూరి అయ్యప్ప నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన శ్రీలత (పేరుమార్చాం) కల్యాణలక్ష్మి పథకం కోసం మీసేవ కేంద్రంలో రూ.150 చెల్లించి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు ప్రింటవుట్‌తోపాటు ఇతర ఆధారాలు, జిరాక్సు పత్రాలతో కూడిన ఫైల్‌ను మండల కార్యాలయంలో సమర్పించాలని సదరు మీసేవ నిర్వాహకుడు సూచించాడు. అదే తనకు రూ.500 ఇస్తే ఫైల్‌ను నేరుగా సంబంధిత అధికారులకు చేరుస్తానని.. మీరు వెళితే జాప్యం అవుతుందని చెప్పాడు. దీనితో శ్రీలత సదరు మీసేవ నిర్వాహకుడికి రూ.500 ఇచ్చింది. తర్వాత ఒకరిద్దరు మధ్యవర్తులు శ్రీలత తల్లిదండ్రులను సంప్రదించారు. తహసీల్దార్ ఆఫీసులో పనిత్వరగా కావాలన్నా, దరఖాస్తు ఆమోదం పొందాలన్నా రూ.5వేలు ఖర్చవుతుందని గాలం వేశారు. చేసేదేమీ లేక శ్రీలత తల్లిదండ్రులు డబ్బులు కట్టారు. తర్వాత పరిశీలన, విచారణ వారం, పదిరోజుల్లో పూర్తయ్యాయి. కొద్దిరోజుల తర్వాత చెక్కు జారీ అయిందని, దానికి రూ.2 వేలు ఖర్చవుతుందని మధ్యవర్తులు మళ్లీ ఫోన్ చేశారు. డబ్బులు చెల్లించాక కొద్దిరోజులకు కల్యాణలక్ష్మి సొమ్ము చేతికి అందింది. నిజామాబాద్ జిల్లా భీంగల్‌కు చెందిన షాహీన్ (పేరుమార్చాం) షాదీ ముబారక్ పథకం కింద మీసేవ కేంద్రంలో దరఖాస్తు సమర్పించింది. తర్వాత షాహీన్ తల్లి సదరు దరఖాస్తు, ఇతర ఆధారాలను స్థానిక ప్రజాప్రతినిధి భర్తకు ఇచ్చి ఆర్థిక సాయం త్వరగా వచ్చేలా చూడాలని కోరింది. ఆయన మున్సిపల్ అధికారులు, ఆర్డీవో కార్యాలయంలోని అధికారులకు ‘చెయ్యి తడిపితే’నే పనవుతుందంటూ రూ.10 వేలు వసూలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత దరఖాస్తు పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాయని చెప్పాడు. దాదాపు ఆరేడు నెలల తర్వాత షాదీముబారక్ నగదు బ్యాంకు ఖాతాలో జమ అయింది. పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయంలోనూ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధుల కాసుల కక్కుర్తికి ఈ రెండూ చిన్న ఉదాహరణలు. అక్కడ ఇక్కడ అని కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు సరిగా విడుదలకాక లబ్ధిదారులకు సొమ్ము అందడంలో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. అప్పోసొప్పో చేసి ఆడపిల్లలకు పెళ్లి చేసిన తల్లిదండ్రులు.. ప్రభుత్వ సాయం ఎప్పుడు అందుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారంపై బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులను సంప్రదించగా సరిగా స్పందించలేదు. నిధులు త్వరలోనే విడుదలవుతాయని, లబ్ధిదారులందరికీ సాయం జమ అవుతుందని మాత్రం పేర్కొన్నారు. అందిన చోటల్లా వసూళ్లే.. అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో వసూళ్లకు తెగబడుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తుల నుంచి.. పత్రాల సమర్పణ, పరిశీలన, విచారణ, చెక్కుల మంజూరు దాకా.. ఒక్కోదశలో ఒక్కొక్కరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. చాలాచోట్ల దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాక నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వకుండా.. స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయించాల్సి వస్తోంది. నేరుగా వెళితే పథకం సొమ్ము రాదంటూ దరఖాస్తుదారులను భయపెడుతుండటమే దీనికి కారణం. స్థానిక ప్రజాప్రతినిధులు తమవద్దకు వచ్చినవారి దరఖాస్తులను సంబంధిత కార్యాలయానికి పంపుతున్నారు. తర్వాత ఫైళ్ల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ, మంజూరు సమయంలో అధికారులు, సిబ్బందికి ఇవ్వాలంటూ.. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని.. ఎవరివాటా వారికి ఇచ్చి, తామూ కొంత తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా ఒక్కో దరఖాస్తుదారు వద్ద రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఒక్కచోటే 86లక్షలుమింగేశారు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంగా విజిలెన్స్ అధికారులు చేసిన పరిశీలనలో దిమ్మతిరిగే అంశాలను గుర్తించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలన, ప్రాసెసింగ్ విషయంలో.. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజినల్ అధికారి (ఆర్డీవో) కార్యాలయంలోని ఒక సీనియర్ అసిస్టెంట్ ఏకంగా రూ.86,09,976 దారి మళ్లించినట్టు గుర్తించారు. దీనిపై గుడిహత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. సదరు సీనియర్ అసిస్టెంట్‌ను అరెస్టు చేశారు. ఇది కేవలం ఒక్క ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అక్రమాల లెక్క మాత్రమే. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఈ తరహా అక్రమాలు భారీగా చోటు చేసుకున్నట్టు విజిలెన్స్ వర్గాలు చెప్తున్నాయి. వివాహ ధ్రువీకరణ పత్రం జారీలోనూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులకు కులధ్రువీకరణ పత్రంతోపాటు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జత చేయాలి. కుల ధ్రువీకరణ పత్రం జారీ సాధారణంగానే జరుగుతున్నా.. వివాహ ధ్రువీకరణ పత్రం కోసం వసూళ్లు సాగుతున్నాయి. స్థానిక సంస్థలు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు కులధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి వీలుంది. అయితే 95 శాతం మంది స్థానిక సంస్థల నుంచే పత్రాలను తీసుకుంటున్నారు. పంచాయతీల పరిధిలో కార్యదర్శి, మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లు వాటిని జారీ చేస్తున్నారు. ఈ సమయంలో రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్టు జనాలు చెప్తున్నారు. ఆన్లైన్.. పేరుకే.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తి పారదర్శకతతో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. అర్హత ఉన్న లబ్ధిదారులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు. దానిపై అవగాహన లేనివారు సమీపంలోని మీసేవ కేంద్రంలో సర్వీసు చార్జీలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తుతోపాటు ఆధారాలను స్కాన్‌చేసి అప్లోడ్ చేయాలి. కానీ చాలాచోట్ల మ్యాన్యువల్‌గా సమర్పించిన దరఖాస్తులనే అధికారులు, సిబ్బంది పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసి.. మ్యాన్యువల్‌గా సమర్పించని వారి అర్జీలను నిర్దేశించిన గడువు తర్వాత తిరస్కరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మ్యాన్యువల్‌గా పత్రాల సమర్పణపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వకున్నా.. రెవెన్యూ అధికారులు, పరిశీలన సిబ్బంది అత్యుత్సాహం తీవ్ర గందరగోళానికి దారితీస్తోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. -
మోక్షమెప్పుడో..?
పాల్వంచకు చెందిన షేక్ ఆలియాకు 2019 ఏప్రిల్ 28న వివాహమైంది. ఈమెకు ప్రస్తుతం 10నెలల పాప ఉంది. కానీ ఇప్పటివరకు షాదీముబారక్ చెక్కు ఇవ్వలేదు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితంలేదు. నగదు మంజూరై ఆర్డీవో పీడీ ఖాతాలో ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తోంది. సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. చెక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తోంది. ఈ పథకాల కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కుటుంబాల్లోని యువతులకు వివాహం చేస్తే ప్రభుత్వం రూ.1,00,116 చొప్పున అందిస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ట్రెజరీకి, అక్కడి నుంచి ఆర్డీఓ పీడీ(పర్సనల్ డిపాజిట్) ఖాతాకు నిధులొచ్చినా లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. పెళ్లయిన నెలరోజుల లోపే చెక్కులు అందించాల్సి ఉండగా, రెండేళ్లు దాటినా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. కొందరు యువతులకు వివాహమై పిల్లలు జన్మించడంతో పాటు రెండున్నరేళ్లు దాటినప్పటికీ సదరు మొత్తం అందడం లేదు. దీంతో వివాహమై ఇతర జిల్లాలు, ప్రాంతాలకు వెళ్లిన యువతులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా జాప్యం.. జిల్లాలో 2019–20 సంవత్సరంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు 5,661 మంది దరఖాస్తు చేసుకోగా, 174 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 5,487 మందికి సంబంధించిన నగదు ట్రెజరీ ద్వారా ఆర్డీఓ పీడీ ఖాతాకు చేరింది. ఇందులో సుమారు 450 మందికి మాత్రం నెలల తరబడి, కొందరికి ఏడాది, మరికొందరికి ఏడాదిన్నర పైబడినప్పటికీ చెక్కులు అందించకుండా జాప్యం చేస్తున్నారు. 2020–21లో 1,909 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో తహసీల్దార్ల వద్ద 283, ఎమ్మెల్యేల వద్ద 193 పెండింగ్‌లో ఉన్నాయి. 3 దరఖాస్తులను తిరస్కరించారు. 1,430 ఎమ్మెల్యేల వద్ద అప్రూవల్ అయి ఉన్నాయి. వీటికి సంబంధించిన నగదు ఆర్డీవో పీడీ ఖాతాలో జమ కాలేదు. 2020–21లో కోవిడ్–19 కారణంగా ఆలస్యమైనా, 2019–20కి సంబంధించిన చెక్కులు అందకపోవడంతో లబ్ధిదారులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 2017, 2018 వివాహమైన యువతుల్లో కొందరికి ఇప్పటికీ చెక్కులు రాలేదు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా చెక్కులు ఇచ్చేందుకే జాప్యమా..? కల్యాణలక్ష్మి, షాదీముబారక్ 2015లో ప్రారంభం కాగా, మొదట్లో నేరుగా సదరు యువతి ఖాతాలో జమ అయ్యేవి. తర్వాత కాలంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చెక్కుల రూపంలో పంపిణీ చేయిస్తున్నారు. ప్రస్తుతం పలువురు లబ్ధిదారులకు సంబంధించి నగదు మంజూరై ట్రెజరీ నుంచి ఆర్డీవో పీడీ ఖాతాలోకి వచ్చినట్లు ఆన్‌లైన్‌లోనూ చూపిస్తోంది. బ్యాంకర్లు చెక్కులు ఇవ్వడంలేదనే కారణంతో వీటి పంపిణీ ఆలస్యం చేస్తున్నారు. కోవిడ్–19 సమయంలో ఎక్కువమంది గుమిగూడే అవకాశం లేనందున నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడమో లేక వారికి నేరుగా ఇచ్చే అవకాశముంది. కానీ ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేసేందుకే తాత్సారం చేస్తున్నారని, ఇదంతా ఎమ్మెల్యేల ప్రచార కండూతి కోసమేననే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై ఆర్డీవో కనకం స్వర్ణలతను వివరణ కోరగా... కోవిడ్–19 కారణంగా ఆలస్యమవుతోందని తెలిపారు. మరోవైపు మంజూరైనవాటికి సంబంధించి బ్యాంకర్లు చెక్కులు ఇవ్వడంలో జాప్యం కావడంతో పంపిణీ చేయలేదన్నారు. -
‘పెళ్లి’కి నిధుల్లేవ్!
‘నగరంలోని వారాసిగూడకు చెందిన ఖాజాబీ సరిగ్గా నాలుగేళ్ల కిందట షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక చేయూత కోసం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటి వరకు ఆర్థిక సహాయం అందలేదు. దీంతో ఈ నెల మొదటి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఆర్థిక సహాయం ఇప్పించాలని జాయింట్ కలెక్టర్ రవికి మొర పెట్టుకుంది. దీనిపై స్పందించిన జేసీ అక్కడే ఉన్న జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారిని పరిశీలించాలని ఆదేశించారు’’ ఇదొక ఖాజాబీ సమస్య కాదు..పాతబస్తీకి చెందిన ఎందరో ఇలా ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్’ పథకాలను నిర్లక్ష్యం, నిధుల కొరత వెంటాడుతున్నాయి. బడ్జెట్లో కేటాయింపులు ఘనంగా ఉన్నా..నిధుల మంజూరు, విడుదలలో మాత్రం నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందని గంపెడు ఆశలతో అప్పోసప్పో చేసి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసిన పేద కుటుంబాలు నిరాశకు గురవుతున్నాయి. రెవెన్యూ శాఖలో ఒకవైపు దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా పెండింగ్‌లో పడిపోతుండగా..మరోవైపు తహసీల్దారు పరిశీలన పూర్తయి ఎమ్మెల్యే, ఆర్డీవో ఆమోదం పొంది మంజూరుతో ట్రెజరీలకు బిల్లులు వెళ్తున్నా ఆర్థిక సహాయం మాత్రం బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదు. పెళ్లిళ్లు జరిగి పిల్లలు పుట్టినా సాయం మాత్రం అందని దాక్ష్రగా తయారైంది. ఫలితంగా పేద కుటుంబాలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. గత ఐదేళ్లుగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు పేదకుటుంబాల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నా..ఆర్థిక సహాయం అంతంత మాత్రంగా తయారైంది. పథకం ఇలా... ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన చెందిన..18 ఏళ్లకు పైబడిన ఆడబిడ్డల వివాహాల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉన్న ఆడబిడ్డల కుటుంబాలు ఆర్హులు..ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించే బాధ్యతలను రెవెన్యూ శాఖకు ప్రభుత్వం అప్పగించింది. ఆన్లైన్ ద్వారా రిజిష్టర్ అయిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రతిపాదనలు స్థానిక ఎమ్మెల్యేలకు రెవెన్యూ శాఖ నివేదిస్తుంది. ఫైనల్‌గా ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాక..నిధులు మంజూరు చేస్తారు. షాదీ ముబారక్ పరిస్థితి ఇదీ... ♦ హైదరాబాద్ జిల్లా పరిధిలో గతేడాదికి సంబంధించి 5100 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది మరో 9120 దరఖాస్తులు వచ్చి చేరాయి. మొత్తం 14220 దరఖాస్తులకు గాను 274 తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం మీద 10,049 దరఖాస్తులకు మంజూరు లభించగా, అందులో సుమారు 4237 దరఖాస్తుల బిల్లులు ట్రెజరీకి పంపకుండా రెవెన్యూ డివిజన్ స్థాయిలో మూలుగుతున్నాయి. ట్రెజరీ పంపిన వాటిలో 54 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం మీద 5758 బిల్లులకు మాత్రమే పీడీ అకౌంట్లలో డిపాజిట్ అయినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ♦ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో సైతం గతేడాదికి సంబంధించి 671 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా ఈ ఏడాది కొత్తగా 1385 దరఖాస్తులు వచ్చాయి. 19 తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 1587 దరఖాస్తులకు మంజూరు లభించగా, 606 బిల్లులు ట్రెజరీకు పంపలేదు. 184 బిల్లులు ట్రెజరీ వద్ద పెండింగ్‌లో ఉండగా, 797 బిల్లులకు సంబందించిన డిపాజిట్ మాత్రమే పీడీ అకౌంట్లలో జమ అయ్యాయి. ♦ రంగారెడి జిల్లా పరిధిలో గతేడాది 1084 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏడాది కొత్తగా 1770 కుటుంబాలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 243 తిరస్కరణకు గురయ్యాయి. 2161 దరఖాస్తులకు మంజూరు లభించింది. 986 దరఖాస్తుల బిల్లులు ట్రెజరీ పంపకుండా పెండింగ్‌లో ఉండగా, కేవలం 1175 బిల్లులకు మాత్రమే నిధులు పీడీ ఖాతాలో డిపాజిట్ అయ్యాయి. కల్యాణ లక్ష్మి పరిస్థితి ఇదీ.. ♦ హైదరాబాద్ జిల్లా పరిధిలో గతేడాది 355 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏదాడి ఇప్పటి వరకు కొత్తగా 923 దరఖాస్తులు వచ్చాయి. 30 తిరస్కరణకు గురయ్యాయి. 896 దరఖాస్తులు మంజూరుకు నోచుకోగా, 9 బిల్లులు ట్రెజరీకి పంపకుండా ఆర్డీవో వద్దనే ఉంచారు. ట్రెజరీ వద్ద 95 బిల్లులు పెండింగ్ ఉండగా, కేవలం 799 బిల్లులకు మాత్రమే సొమ్ము డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ♦ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో గతేడాది 259 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 926 దరఖాస్తులు వచ్చి చేరాయి. 16 తిరస్కరణకు గురయ్యాయి. 927 దరఖాస్తులు మంజూరుకు నోచుకోగా, 30 బిల్లులు ట్రెజరీకి పంపలేదు. ఇక ట్రెజరీ వద్ద 185 బిల్లులు పెండింగ్‌లో ఉండగా, 712 బిల్లులకు మాత్రమే సొమ్ము డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ♦ రంగారెడ్డి జిల్లా పరిధిలో గతేడాది 381 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 1202 దరఖాస్తులు వచ్చి చేరాయి. 33 తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం మీద 1109 దరఖాస్తులు మంజూరుకు నోచుకోగా, 172 బిల్లులు ట్రెజరీకి పంపలేదు. ట్రెజరీ వద్ద 29 బిల్లులు పెండింగ్‌లో ఉండగా, మొత్తం మీద 908 బిల్లులకు మాత్రమే సొమ్ము డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. -
కల్యాణ కానుక ఏది..?
సాక్షి, హైదరాబాద్: కల్యాణకానుక పంపిణీలో జాప్యం నెలకొంది. పెళ్లినాటికే ఇవ్వాల్సిన సాయం ఆర్నెల్లు గడుస్తున్నా అందడంలేదు. వరుస ఎన్నికలు, క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతుండడంతో ఆలస్యమవుతోంది. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చింది. పెళ్లిరోజునాటికి లబ్ధిదారులకు ఈ పథకం కింద రూ.1,00,116 అందించాలని నిర్ణయించింది. కానీ, దరఖాస్తుల సమర్పణ, పరిశీలనతో సాయం అందజేత దాదాపు నెల రోజులు పడుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 68 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారుల అంచనా. వీటి పరిష్కారానికి దాదాపు రూ.700 కోట్లు అవసరం. అటకెక్కిన పరిశీలన... కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల కింద వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి పరిశీలిస్తారు. ఈ బాధ్యతలు రెవెన్యూ యంత్రాంగం చూస్తుంది. దరఖాస్తుదారు కుటుంబంతోపాటు సమీపంలోని వారి దగ్గర నుంచీ సమాచారం సేకరించి అర్హతను నిర్ధారిస్తారు. గతేడాది చివర నుంచి వరుసగా ఎన్నికలు జరుగుతుండటంతో రెవెన్యూ యం త్రాంగమంతా ఆ క్రతువులో నిమగ్నమైంది. అసెంబ్లీ, పంచాయతీ, పార్లమెంటు, పరిషత్ ఎన్నికలతో ఆర్నెల్లు గడిచిపోయాయి. ఓటరు జాబితా సవరణ మొదలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణల్లో యంత్రాంగం తలమునకలు కావడంతో దరఖాస్తులు పరిశీలనకు నోచుకోలేదు. గత బకాయిలు రూ.147.33 కోట్లు ఎన్నికల ప్రక్రియతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల బకాయిలు కుప్పలుగా పేరుకుపోయాయి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 14,716 దరఖాస్తులకు సంబంధించిన చెల్లింపులు చేయలేదు. దీంతో రూ.147 కోట్లు బకాయిలున్నాయి. వీటిని తదుపరి ఏడాదికి కలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పెళ్ళిళ్లు జోరుగా జరిగాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు కూడా అదే తరహాలో దరఖాస్తులు వచ్చాయి. ఏప్రిల్, మే నెలలో దాదాపు 53 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వీటిని వెంటవెంటనే పరిశీలించి పరిష్కరించాలి. మరోవైపు వెబ్సైట్ నిర్వహణ ఉండటంతో దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సాంకేతిక సమస్యలు నెలకొనడంతో వెబ్సైట్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో గత కొన్నిరోజులుగా దరఖాస్తు ప్రక్రియ నెమ్మదించింది. వెబ్సైట్ సమస్య పరిష్కారమైతే దరఖాస్తులు సైతం మరిన్ని పెరిగే అవకాశం ఉంది. -
అందని పెళ్లి కానుక ..
సాక్షి, వరంగల్ రూరల్: ప్రతి ఆడపిల్లకు ఆసరాగా నిలుస్తామని, శుభలేకతోనే కల్యాణలక్ష్మి డబ్బులు అందజేస్తామని ప్రజాప్రతినిధులు చెప్పిన మాట నీటిమూటగానే మిగిలిపోతోంది. కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకాలు లబ్ధిదారులకు అందడం లేదు. ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వం తరఫున రూ 1,00, 116 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకాల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో సంబంధిత ఆర్డీఓలు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్‌లను అందించాలి. నిధులు కేటాయింపులు లేకపోవడంతో గత కొన్ని రోజులుగా పంపిణీ జరగడంలేదు. దీనితో పాటు రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల్లో బిజీగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉన్నత స్థాయి అధికారులు శ్రద్ధ చూపితేనే పెండింగ్‌లో పథకాలకు మోక్షం కలుగనుంది. సకాలంలో అందని ఆర్థిక సాయం ఆడపిల్లల తల్లితండ్రులకు బాసటగా నిలువాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సకాలంలో డబ్బులు అందక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆన్లైన్లో దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా ఆర్థిక సహాయం రాకపోవడంతో ఎదురుచూపులు చూస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ మూబారక్కు పెళ్లికి ముందే దరఖాస్తు చేస్తే పెళ్లి నాటికి అందించాలని ప్రభుత్వ ఉద్దేశం. కానీ దాదాపు ఎక్కడ పెళ్లి నాటికి ఆర్థిక సాయం అందిన దాఖలాలు లేవు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వస్తుంది కదా అని పెళ్లి కోసం అప్పులు చేస్తున్నారు. పెండింగ్‌లో 1720 దరఖాస్తులు కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా 1720 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కల్యాణలక్ష్మివి 1601, షాదీమూబారక్వి 119 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో 567 కల్యాణలక్ష్మి, 18 షాదీమూబారక్, వరంగల్ రూరల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో కల్యాణలక్ష్మి 495, షాదీ ముబారక్ 64, పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలలో 539 కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ 37 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల కేటా యింపు లేకపోవడంతో సాయం అందడం లేదు. ఈ ఫొటోలో కనబడుతున్న మహిళది దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామం. అత్యంత నిరుపేద. కూలీకి పోతేగాని పూటగడవదు. ఈమెకు ఒక్కగానొక్క కూతురు శ్రీలత. కష్టపడి కూతురును డిగ్రీ చదివించింది. 21 సంవత్సరాలు పూర్తి కాగానే గత సంవత్సరం ఏప్రిల్ 27న పెళ్లి చేసింది. కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసింది. పలుమార్లు అధికారులు అడిగిన కాగితాలు అన్నీ ఇచ్చింది. ఏడాది గడిచింది. నేటికి ఒక్క పైసా రాలేదు. కళ్యాణలక్ష్మి డబ్బులు వస్తాయి కదా అని తెలిసిన వాళ్లను బతిమిలాడి అప్పు తెచ్చి బిడ్డకు వస్తువులు కొనిపెట్టింది. తెచ్చిన అప్పుపై ఇప్పటికే 20 వేల వడీ ్డకట్టింది. ఇప్పుడు కూతురు గర్భిణీ.. చేతిలో చిల్లిగవ్వ లేదు. పాలకులు, అధికారులు కనికరించి కల్యాణలక్ష్మి డబ్బు వచ్చేలా చూడాలని వేడుకుంటోంది. బడ్జెట్ రాగానే చెక్కులు అందిస్తున్నాం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కోసం వచ్చిన దరఖాస్తులన్ని పరిశీలిస్తున్నాం. బడ్జెట్ కేటాయించగానే వారికి వారికి ట్రెజరీ నుంచి చెక్కులను అందిస్తున్నాం. వెంటనే వెంటనే దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. –రవి, ఆర్డీఓ, నర్సంపేట -
కల్యాణ‘లక్ష్మి’కి కోడ్ ఎఫెక్ట్!
సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఈ ఏడాది ఇబ్బందులు తప్పేలా లేవు. పెళ్లి రోజు నాటికే ఈ నగదు సాయాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో పథకంలో పలు మార్పులు చేపట్టినప్పటికీ.. వరుసగా వస్తున్న ఎన్నికలతో పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. తాజాగా లోక్‌సభ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ పరంగా లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమాలకు ఎన్నికల సంఘం కళ్లెం వేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత కాలం ఈ కార్యక్రమాలను నిర్వహించొద్దని స్పష్టం చేయడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పేలా లేవు. 2018–19 వార్షిక సంవత్సరంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద మార్చి 5 నాటికి 2.43 లక్షల దరఖాస్తులొచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 1.60 లక్షల దరఖాస్తులను పరిశీలించి అర్హులకు దాదాపు చెల్లింపులు పూర్తి చేశారు. మిగిలిన 83 వేల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. ఏడాదంతా ఎన్నికల కోడ్‌తోనే.. 2018–19 వార్షిక సంవత్సరమంతా ఎన్నికల కోడ్‌తోనే గడిచిపోయింది. తొలి, రెండో త్రైమాసికాల్లో ప్రభుత్వం పెద్దగా నిధులు విడుదల చేయకపోవడంతో సంక్షేమ పథకాలన్నీ కాస్త నెమ్మదించాయి. ఆ తర్వాత అసెంబ్లీ రద్దు చేయడంతో నిధుల విడుదలకు బ్రేకులు పడ్డాయి. అందుబాటులో ఉన్న వాటితోనైనా సంక్షేమ పథకాలను నెట్టుకొద్దామని అధికారులు భావించినప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో యంత్రాంగం ఆమేరకు సాహసించలేదు. డిసెంబర్ రెండో వారం నుంచి ఎన్నికల కోడ్ తొలగిపోయింది. అంతలోనే జనవరిలో పంచాయతీ ఎన్నికలు రావడంతో ఆ నెల కూడా కోడ్ నేపథ్యంలో పలు కార్యక్రమాలు అటకెక్కాయి. ప్రస్తుతం వార్షిక సంవత్సరం చివరకు వచ్చింది. మరో 20 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో పెండింగ్ పనులన్నీ పూర్తిచేసేలా అధికారులు హడావుడి చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థికశాఖకు వాటిని సమర్పించాలనుకునేలోపే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మే నాలుగో వారం వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండనుంది. దీంతో అప్పటివరకు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, చెల్లింపులకు ఇబ్బందేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతా ఆన్లైన్ అయినా.. గతేడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆన్లైన్ పద్ధతిని తీసుకొచ్చింది. సాధారణంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో ఇస్తారు. ఈ మేరకు శాసనసభ్యులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పంపిణీ చేస్తారు. ఎన్నికల సందర్భంగా చెక్కులకు బదులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు సాయాన్ని పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇందుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం నుంచి పెద్దగా సహకారం అందకపోవడంతో తక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేశారు. తాజాగా ఎన్నికలు రావడంతో రెవెన్యూ యంత్రాంగమంతా ఎన్నికల పనుల్లో బిజీ కానుంది. దీంతో ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చినా పెద్దగా ఫలితం లేదని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
‘పెళ్లిళ్ల’ పథకాలకు నిధుల్లేవ్!
సాక్షి,మేడ్చల్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధులు లేక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. కానీ డిమాండ్‌కు తగినట్లుగా నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. దీంతో అర్హత కలిగిన లబిద్ధారులు నిధుల మంజూరు కోసం ఎమ్మెల్యేలు, రెవెన్యూ యంత్రాంగం చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాజిక వర్గాలకు అతీతంగా బీసీ, ఈబీసీలకు కూడా కల్యాణ లక్ష్మి పథకం వర్తింపజేయటంతో దరఖాస్తుదారుల సంఖ్య బాగా పెరిగింది. ఈ పథకంలో మార్పులు, చేర్పులు, లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో లబ్ధిదారుల ఎంపిక, నిధుల మంజూరులో జాప్యం జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సహాయం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల నుంచి 5,885 మంది దరఖాస్తు చేసుకోగా...వీటిలో 16 మండలాల పరిధిలో 5,040 దరఖాస్తులను మండల రెవెన్యూ యంత్రాంగం పరి«శీలించింది. మరోవైపు ఇందులో 4,540 దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యేలు ఆమోదించారు. అయినప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు 4,460 మంది లబ్ధిదారులకు మాత్రమే చెక్కులు పంపిణీ చేశారు. మిగిలిన 500 దరఖాస్తుల్లో 153 తిరస్కరించి...347 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. కాగా లబ్ధిదారులకు ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున సొమ్ము మంజూరు చేశారు. పథకం తీరు ఇలా... ఆర్థికంగా బలహీనంగా ఉన్న షెడ్డ్యూల్ కులాలు, షెడ్డ్యూల్ తెగలు, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 18 ఏళ్లకు పైబడిన యువతుల వివాహం కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రా>ష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాల్సి ఉంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించే బాధ్యతలను రెవెన్యూ శాఖకు ప్రభుత్వం అప్పగించింది. ఆన్లైన్ ద్వారా రిజిష్టర్ అయిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రతిపాదనల్ని స్థానిక ఎమ్మెల్యేలకు రెవెన్యూ శాఖ నివేదిస్తుంది. చివరగా ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాక...నిధులు మంజూరు చేస్తారు. -
పేదింటి వధువు.. చేయూత కరువు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం పేద యువతుల వివాహాల ఆర్థిక తోడ్పాటు కోసం మూడేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు బాలారిష్టాలు దాటడంలేదు. బడ్జెట్లో పథకాలకు కేటాయింపులు ఘనంగా ఉన్నా.. ఆచరణలో మాత్రం ప«థకం చుక్కలు చూపిస్తోంది. ఆడబిడ్డల పెళ్లీలకు ఆర్థిక సహాయం అందుతుందన్న గంపెడు ఆశతో పెళ్లి ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్న తల్లితండ్రులకు ఆర్థిక కష్టాలు, కన్నీళ్లు తప్పడం లేదు. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం, సవాలక్ష కొర్రీలతో వ«ధువుకు చేయూత అంతంత మాత్రంగా మారింది. దరఖాస్తులు పరిశీలనకు నోచుకోకుండా పెండింగ్‌లో మగ్గుతున్నాయి. మరోవైపు పరిశీలన నోచుకున్న దరఖాస్తులు తహసీల్దార్, ఎమ్మెల్యే ఆమోదం, మంజూరు కూడా ఎదురు చూస్తున్నాయి. ఆర్థిక సహాయం మంజూరైనప్పటికీ ట్రెజరీ శాఖ ప్రతి నెలా 5 నుంచి 17 వరకు మాత్రమే బిల్లుల పాస్, ఆ తర్వాత బిజీబిజీగా ఉంటే ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కుల పంపిణీ ప్రక్రియలతో పుణ్యకాలం కూడా గడిచిపోతోంది. దీంతో పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత ఆలస్యంగా అందుతోంది. దీంతో ఎప్పటి మాదిరిగా నిరుపేద కుటుంబాలు అప్పులు చేసి ఇబ్బందుల పాలవుతున్నారు. రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించి పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను పరిశీలించి ఆర్థిక చేయూత అందించాలని ఆయా కుటుంబాలు కోరుతున్నారు. నత్తనడకన.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద నిరుపేద కుటుంబాలకు వివాహాల కంటే ముందు రూ. 1,00,116 ఆర్థిక చేయూత అందే పరిస్థితి కానరావడం లేదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ రెవెన్యూ శాఖకు గుదిబండగా తయారైంది. రెవెన్యూ శాఖ సిబ్బంది ప్రభుత్వ భూముల పరిరక్షణ, ధ్రువీకరణ పత్రాల జారీ, పింఛన్లు ఇతరత్రా విధుల్లో బిజీబిజీగా ఉండటంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. క్షేత్ర స్థాయి విచారణ పూర్తయినా ఆ తర్వాత ప్రక్రియ కూడా నత్తలకు నడక నేర్పిస్తోంది. ఇదీ పరిస్థితి.. హైదరాబాద్ జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం కింద మొత్తం 3,680 కుటుంబాలు తమ బిడ్డల పెళ్లీలకు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు చేసుకోగా అందులో 1,745 కుటుంబాలకు మాత్రమే ఆర్థిక చేయూత అందినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. షాదీ ముబారక్ పథకం కింద 8,205 కుటుంబాలు ఆర్థిక చేయూత కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు కేవలం 4,816 కుటంబాలకు మాత్రమే చేయూత అందినట్లు తెలుస్తోంది. మిగిలిన సగం దరఖాస్తులు వివిధ దశలో పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. అదనపు పనిభారం, బిజీ షెడ్యూలుతో రెవెన్యూ దరఖాస్తులను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు పథకాల కింద సుమారు ఆరు వేలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో విచారణ అనంతరం మూడువేల దరఖాస్తులకు ఎమ్మెల్యేల ద్వారా ఆమోదం పొందినట్లు అధికార యంత్రాంగం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి -
‘పెళ్లి కానుక’లో తీవ్ర జాప్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇచ్చే ఆర్థిక సాయం పంపిణీ గాడితప్పుతోంది. పెళ్లి నాటికి వధువు చేతికి అందాల్సిన నగదు సాయం ఏడాది గడిచినా అందని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ పథకంపై గంపెడాశలు పెట్టుకున్న దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాల కింద లబ్ధిదారులకు తొలుత రూ. 51 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించిన సర్కారు...గతేడాది నగదు సాయాన్ని రూ. 75,116కు, తాజా బడ్జెట్లో ఏకంగా రూ. 1,00,116కు పెంచేసింది. ఈ నెల ప్రారంభం నుంచి పెంచిన మొత్తం అమల్లోకి రానుంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద నగదు సాయం భారీగా ఉండటంతో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కానీ దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల నిర్ధారణ ప్రక్రియలో అధికారులు తాత్సారం చేస్తుండటంతో లబ్ధిదారులకు ఆర్థిక సాయం సకాలంలో అందడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 57 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు బాధ్యత తొలుత సంక్షేమశాఖలే నిర్వహించగా పారదర్శకత కోణంలో వాటి అమలు, పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించింది. అంతేకాకుండా లబ్ధిదారుల అర్హత నిర్ధారణలో శాసనసభ్యులను భాగస్వాములుగా చేసింది. దీంతో ఈ రెండు కేటగిరీల్లో పరిశీలన పూర్తయితేనే అర్హత తేలనుంది. ఈ నిబంధన పంపిణీ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. మీ–సేవా కేంద్రాల ద్వారా వచ్చే దరఖాస్తులు నేరుగా సంబంధిత తహసీల్దార్ యూజర్ ఐడీలోకి చేరతాయి. అనంతరం వాటిని సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించాలి. ధ్రువపత్రాలు, పెళ్లి జరిగిన తీరును నిర్ధారించి తహసీల్దార్‌కు నివేదిక ఇవ్వాలి. ఆ వివరాలను సంబంధిత శాసనసభ్యులకు పంపాక అర్హుల ఎంపిక పూర్తవుతుంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో ఎక్కువ భాగం తహసీల్దార్ల వద్దే ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. నెలలకొద్దీ నిరీక్షణే... : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో వీఆర్వోల నుంచి నివేదికలు అందుతున్నప్పటికీ భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహణలో తహసీల్దార్లు తీరిక లేకుండా ఉండటంతో దరఖాస్తులు పెండింగ్‌లో పడుతున్నాయి.ఈ పథకాల కింద అర్హత సాధించినప్పటికీ ఖజానాపై ఆంక్షలుండటంతో లబ్ధిదారులకు సాయం అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 57 వేల పెండింగ్ దరఖాస్తులకు గాను రూ. 372.25 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు అంచనా. ఖజానాశాఖ నిధులు విడుదల చేసినప్పటికీ చెక్కుల పంపిణీలోనూ ఆలస్యమవుతోంది.ఎమ్మెల్యేలకు సమయం లేకపోవడంతో పంపిణీ వాయిదా వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
కల్యాణ కానుకకు రూ.1,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో తలపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో భారీ నిధులు కేటాయించనుంది. ప్రస్తుతం ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ.75వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. తాజాగా ఈ సాయాన్ని ఏకంగా రూ.లక్షకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా 2018–19 వార్షిక సంవత్సరంలో బడ్జెట్ కింద ఏకంగా రూ.1,000 కోట్లు కేటాయించబోతోంది. ఈ మేరకు పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు దరఖాస్తులు, పంపిణీ తదితర వివరాలను సమర్పించాలని సంక్షేమ శాఖలకు ప్రభుత్వంఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శాఖల వారీగా లబ్ధిదారులు, పంపిణీ చేసిన సాయం వివరాలను అధికారులు సమర్పించారు. ఈ రెండు పథకాల కింద ఇప్పటివరకు 3.25 లక్షల దరఖాస్తులు రాగా... వీటిలో 3లక్షల మందికి ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. 2018–19 వార్షిక సంవత్సరానికి లక్ష దరఖాస్తులు రావొచ్చని అంచనా. ఈ నేపథ్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు వార్షిక బడ్జెట్ కింద రూ.వెయ్యి కోట్లకు సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాయి. కల్యాణలక్ష్మి పథకాన్ని ఈబీసీ(ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు)లకూ వర్తింపచేయాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. -
‘లక్ష్మి’ వరించేదెప్పుడో.?
పెనుబల్లి : కల్యాణ లక్ష్మి, షాదీముభారక్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయం అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో సుమారు మూడు వందల మందికి గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా చెక్కులు మంజూరు కాలేదు. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు వాటికోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కల్యాణ లక్ష్మి, షాదీముభారక్ పథకాల ద్వారా రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందన్న ఆశతో వధువు తల్లిదండ్రులు.. అప్పులు చేసి వివాహ వేడుకలను, లాంఛనాలను ఘనంగా నిర్వహించారు. దీని కోసం దొరికాడల్లా అప్పులు చేసి మరీ వివాహాలు జరిపించారు. ఇలా గత జనవరి నుంచి డిసెంబర్ వరకు మండలంలో సుమారు మూడు వందల మంది వరకు వివాహాలు చేసి ఆన్లైన్ ద్వారా కల్యాణ లక్ష్మి పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో సగం వరకు రెవెన్యూ అధికారులు విచారణ చేసి అర్హులైన వారికి మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. మరో 100 నుంచి 150 మంది వరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను ఇంకా రెవెన్యూ అధికారులు విచారణ కూడా చేపట్టలేదు. విచారణ చేపట్టేదెప్పుడు, తమకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా చెక్కులు అందేదెప్పుడని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో తహసీల్దార్లు విచారణ చేపట్టి చెక్కు లు అందజేసే విధానం నుంచి స్థానిక ఎమ్మెల్యేను కూడా దీనిలో భాగాస్వామ్యం చేయడంతో కొన్ని మండలాల్లో రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యేకు సమన్వయం లోపించింది. దీంతో రెవెన్యూ అధికారులు తమ తప్పిదాన్ని ప్రజా ప్రతినిధులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే కల్లూరు మండల రెవెన్యూ అధికారులు.. కల్యాణ లక్ష్మి చెక్కుల మంజూరులో ఎమ్మెల్యే జాప్యం చేస్తున్నారని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇటీవల కల్లూరు రెవెన్యూ కార్యాలయంలో అనుచరులు, లబ్ధిదారులతో కలిసి బైఠాయించారు. వెంటనే లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం చెక్కులు అందజేయాలని, తన వద్ద ఎటువంటి పెండింగ్ లేదని, రెవెన్యూ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ ఎమ్మెల్యే నిలదీశారు. ఏదీ ఏమైనా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలాన.. నెలల తరబడి కల్యాణ లక్ష్మి చెక్కుల కోసం లబ్ధిదారులు ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. మే నుంచి చెక్కు రాలేదు.. మే నెలలో మమ్మాయి వివాహం చేశా. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు విచారణకు రాలేదు. మాకు సాయం అందేదెప్పుడో. - చీపి కృష్ణ, పెనుబల్లి ఆగస్టు నుంచి చెక్కు రాలేదు.. ఆగస్టులో అమ్మాయికి వివాహం చేశా. ఇంతవరకు అధికారులు విచారణకు రాలేదు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించాలి. విచారణ చేపట్టి న్యాయం చేయాలి. – నాగుల నాగేశ్వరరావు, పెనుబల్లి జాప్యం జరిగింది.. భూ ప్రక్షాళన విధుల కారణంగా జాప్యం జరిగింది. కొన్ని దరఖాస్తులను పరిశీలించి నివేదిక అందించాం. మరికొన్ని దరఖాస్తులను విచారిస్తున్నాం. త్వరగా విచారిస్తాం. – తూమాటి శ్రీనివాస్, తహసీల్దార్ -
‘షాదీ ముబారక్‌లో అధికారులే బాధ్యులు’
ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లాలో జరిగిన షాదీ ముభారక్ పథకంలో అవినీతికి ఎమ్మార్వో, ఆర్ఐ, వీఆర్వో వంటి అధికారులే బాధ్యులని వారిని సైతం చట్టపరంగా శిక్షించాలని ఎంఐఎం జిల్లా ఇన్చార్జి మున్సిపల్ చైర్పర్సన్ ఫరూక్ అహ్మద్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం కుటుంబీకులకు అధికారులు, నాయకులు దళారులు రూ. 10 వేల చొప్పున ఇచ్చి అది రుణంగా చెప్పినట్లు బాధితులు ఆరోపిసున్నట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.