
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇచ్చే ఆర్థిక సాయం పంపిణీ గాడితప్పుతోంది. పెళ్లి నాటికి వధువు చేతికి అందాల్సిన నగదు సాయం ఏడాది గడిచినా అందని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ పథకంపై గంపెడాశలు పెట్టుకున్న దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది.
ఈ పథకాల కింద లబ్ధిదారులకు తొలుత రూ. 51 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించిన సర్కారు...గతేడాది నగదు సాయాన్ని రూ. 75,116కు, తాజా బడ్జెట్‌లో ఏకంగా రూ. 1,00,116కు పెంచేసింది. ఈ నెల ప్రారంభం నుంచి పెంచిన మొత్తం అమల్లోకి రానుంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద నగదు సాయం భారీగా ఉండటంతో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కానీ దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల నిర్ధారణ ప్రక్రియలో అధికారులు తాత్సారం చేస్తుండటంతో లబ్ధిదారులకు ఆర్థిక సాయం సకాలంలో అందడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 57 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు బాధ్యత తొలుత సంక్షేమశాఖలే నిర్వహించగా పారదర్శకత కోణంలో వాటి అమలు, పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించింది. అంతేకాకుండా లబ్ధిదారుల అర్హత నిర్ధారణలో శాసనసభ్యులను భాగస్వాములుగా చేసింది. దీంతో ఈ రెండు కేటగిరీల్లో పరిశీలన పూర్తయితేనే అర్హత తేలనుంది. ఈ నిబంధన పంపిణీ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. మీ–సేవా కేంద్రాల ద్వారా వచ్చే దరఖాస్తులు నేరుగా సంబంధిత తహసీల్దార్ యూజర్ ఐడీలోకి చేరతాయి. అనంతరం వాటిని సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించాలి. ధ్రువపత్రాలు, పెళ్లి జరిగిన తీరును నిర్ధారించి తహసీల్దార్‌కు నివేదిక ఇవ్వాలి. ఆ వివరాలను సంబంధిత శాసనసభ్యులకు పంపాక అర్హుల ఎంపిక పూర్తవుతుంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో ఎక్కువ భాగం తహసీల్దార్ల వద్దే ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
నెలలకొద్దీ నిరీక్షణే... : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో వీఆర్‌వోల నుంచి నివేదికలు అందుతున్నప్పటికీ భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహణలో తహసీల్దార్లు తీరిక లేకుండా ఉండటంతో దరఖాస్తులు పెండింగ్‌లో పడుతున్నాయి.ఈ పథకాల కింద అర్హత సాధించినప్పటికీ ఖజానాపై ఆంక్షలుండటంతో లబ్ధిదారులకు సాయం అందడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 57 వేల పెండింగ్ దరఖాస్తులకు గాను రూ. 372.25 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు అంచనా. ఖజానాశాఖ నిధులు విడుదల చేసినప్పటికీ చెక్కుల పంపిణీలోనూ ఆలస్యమవుతోంది.ఎమ్మెల్యేలకు సమయం లేకపోవడంతో పంపిణీ వాయిదా వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment