ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందే. కానీ అసలు దరఖాస్తు చేయకున్నా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయం రావడం, అదీ ఎప్పుడో 40, 50 ఏళ్ల కింద పెళ్లయిన వృద్ధుల ఖాతాల్లో పడుతుండటం విచిత్రం. ఇందులోనూ కొందరికి రెండు, మూడుసార్లు సొమ్ము జమవుతుండటం గమనార్హం.
►ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన శకుంతలబాయి వయసు 67 ఏళ్లు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పదిహేనేళ్ల కిందే పిల్లల పెళ్లిళ్లు జరిగిపోయాయి. కానీ శకుంతల బాయి బ్యాంకు ఖాతాలో రెండుసార్లు కల్యాణలక్ష్మి ఆర్థిక సాయం జమ అయింది.
►సిరికొండ మండలానికే చెందిన 65 ఏళ్ల సుమన్‌బాయి బ్యాంకు ఖాతాలో అయితే మూడు సార్లు కల్యాణలక్ష్మి నిధులు జమకావడం గమనార్హం.
►ఇచ్చోడ మండలం చించోలికి చెందిన గంగుబాయి వయసు 70 ఏళ్లు. ఆమె భర్త పదేళ్ల క్రితం మరణించాడు. ఆమె బ్యాంకు ఖాతాలోనూ రెండుసార్లు ఆర్థికసాయం నిధులు జమయ్యాయి.
పొరపాటు కాదు.. అక్రమాలే!
వృద్ధుల ఖాతాల్లో కల్యాణలక్ష్మి సొమ్ములు దఫదఫాలుగా జమకావడం కేవలం సాంకేతిక పొరపాటు కాదని.. నిధులను దారిమళ్లించే అక్రమాలేనని ఆరోపణలు ఉన్నాయి. కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ పథకాల సొమ్మును కాజేసేందుకు.. నకిలీ లబ్ధిదారుల పేరిట దరఖాస్తులు చేస్తున్నారని తెలిసింది. వారి ఖాతాల్లో జమ అయిన సొమ్మును ఏదో ఒక కారణం చెప్పి విత్‌డ్రా చేయించుకుంటున్నారని సమాచారం.
అక్రమాలపై ‘నిఘా’.. ఏదీ?
సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి నిఘా వ్యవస్థ బలహీనంగా ఉంది.. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో మరింత గందరగోళం నెలకొందని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం తొలుత ఈ పథకాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖల ద్వారా అమలు చేసింది. తర్వాత కొత్త విధానాన్ని తెచ్చింది. దరఖాస్తుల స్వీకరణను ఆన్‌లైన్ చేసింది. దరఖాస్తుల పరిశీలన, మంజూరు ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం, శాసనసభ్యులకు అధికారం ఇచ్చింది. కేవలం నిధులు విడుదల చేసే బాధ్యతను సంక్షేమశాఖలకు అప్పగించింది.
ఇలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రెండేసి శాఖలు అమలు చేస్తుండడంతో.. అక్రమాలను నివారించే బాధ్యత ఎవరికీ పట్టడం లేదు. కనీసం ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపైనా స్పష్టత లేదు. దీనితో మధ్యవర్తులు, అవినీతి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.2వేల కోట్ల మేర ఈ పథకాలకు ఖర్చు చేస్తున్నా.. నిఘా వ్యవస్థపై ఇప్పటికీ దృష్టిసారించకపోవడం గమనార్హం.
అర్హత నిర్ధారణలో జాప్యం
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలనలో మూడు దశలు ఉంటాయి. ముందుగా ఆన్‌లైన్‌లో నమోదైన దరఖాస్తు తహసీల్దార్ లాగిన్‌కు చేరుతుంది. తహసీల్దార్ ఆ దరఖాస్తును తెరిచి పరిశీలిస్తారు. తర్వాత రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి విచారణ చేపట్టి అర్హతలను నిర్ధారిస్తారు. తర్వాత ఆ దరఖాస్తు ఎమ్మెల్యేకు చేరుతుంది. అక్కడ ఆమోదం పొందాక.. రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) వద్దకు చేరుతుంది. ఆర్డీవో అర్హత నిర్ధారించి పథకాన్ని మంజూరు చేస్తారు. తర్వాత నిధులు విడుదలవుతాయి.
అయితే రెవెన్యూ అధికారులపై పనిభారం కారణంగా.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. ఎమ్మెల్యే, ఆర్డీవో స్థాయిల్లోనూ నెలల తరబడి పరిశీలనకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,09,027 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో సగానికిపైగా దరఖాస్తులు గత ఏడాది లబ్ధిదారులకు సంబంధించినవే.. ఈ ఏడాదికి క్యారీ ఫార్వార్డ్ అయినవి.
పెళ్లయి నెలలు గడుస్తున్నా.. సొమ్ము రావట్లే..
ఆడబిడ్డ పెళ్లి నాటికే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఆర్థిక సాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఎక్కడా ఈ లక్ష్యం నెరవేరడం లేదు. పెళ్లయిన నెలరోజులకు సాయం అందినా కాస్త ఊరట దక్కుతుందని.. కానీ నెలలు గడుస్తున్నా ఆర్థిక సాయం అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కొందరైతే ఏడాది దాటినా తమకు సాయం అందలేదంటూ సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన నుంచి నిధుల విడుదల దాకా తీవ్ర జాప్యం జరుగుతుండటమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఏటా సగటున 1.5 లక్షల నుంచి 2 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. బడ్జెట్‌లో ప్రభుత్వం ఈమేరకు నిధులు కేటాయిస్తున్నా.. విడుదలలో జాప్యం జరుగుతోంది. సదరు ఆర్థిక సంవత్సరం ముగిసినా బిల్లులు క్లియర్ కావడం లేదు. వాటిని మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వర్ చేస్తుండడంతో.. బడ్జెట్ కేటాయింపులు సరిపోని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సంక్షేమశాఖల గణాంకాలు చెప్తున్నాయి. బడ్జెట్ లేకపోవడంతో వాటిని వివిధ దశల్లో ఆపినట్టు సమాచారం.
వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు
కేటగిరీ | తహసీల్దార్ | ఎమ్మెల్యే | ఆర్డీవో |
ఎస్సీ | 6,082 | 3,831 | 5,665 |
ఎస్టీ | 4,665 | 2,663 | 10,013 |
బీసీ | 16,458 | 10,481 | 13,584 |
ఈబీసీ | 1,905 | 1,031 | 1,671 |
మైనార్టీ | 5,034 | 3,173 | 22,771 |
మొత్తం | 34,144 | 21,179 | 53,704 |
విజిలెన్స్ గుర్తించినా చర్యలేవీ?
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్టు విజిలెన్స్ విభాగం గతంలోనే గుర్తించింది. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, నిజామాబాద్, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో విజిలెన్స్ విభాగం అధికారులు చేపట్టిన విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. రెవెన్యూ శాఖలో తహసీల్దార్లు మొదలు డిప్యూటీ తహసీల్ధార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ సహాయకుల దాకా వసూళ్లకు తెగబడుతున్నట్టు తేల్చింది.
కొన్నిచోట్ల గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, రాజకీయ పార్టీల నాయకులు మధ్యవర్తులుగా, ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించింది. ఈ అంశంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు కూడా చేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కూడా. కానీ ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు.
మ్యాన్యువల్ వ్యవహారానికి చెక్ పెడితేనే..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకే ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. దానిని పక్కాగా అమలు చేస్తేనే అక్రమాలకు చెక్‌పడుతుందని లబ్ధిదారులు అంటున్నారు. వసూళ్ల కోసమే మధ్యవర్తులు, అధికారులు మ్యాన్యువల్ దరఖాస్తుల వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాము ముందుండి దరఖాస్తులను ప్రాసెస్ చేయిస్తున్నట్టు వ్యవహరించడం, తప్పులు ఉన్నాయని, సరిచేయడానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం సులువు అవుతోందని అంటున్నారు. మ్యాన్యువల్‌గా దరఖాస్తులు తీసుకోవద్దని అధికారులకు గట్టి ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనివల్ల అక్రమాలకు చెక్‌పడటంతోపాటు పారదర్శకత పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.
పెళ్లయి నెలలు గడుస్తున్నా.. సొమ్ము రావట్లే..
ఆడబిడ్డ పెళ్లి నాటికే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఆర్థిక సాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఎక్కడా ఈ లక్ష్యం నెరవేరడం లేదు. పెళ్లయిన నెలరోజులకు సాయం అందినా కాస్త ఊరట దక్కుతుందని.. కానీ నెలలు గడుస్తున్నా ఆర్థిక సాయం అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కొందరైతే ఏడాది దాటినా తమకు సాయం అందలేదంటూ సంబంధిత అధికారులను సంప్రదిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన నుంచి నిధుల విడుదల దాకా తీవ్ర జాప్యం జరుగుతుండటమే దీనికి కారణమని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఏటా సగటున 1.5 లక్షల నుంచి 2 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. బడ్జెట్‌లో ప్రభుత్వం ఈమేరకు నిధులు కేటాయిస్తున్నా.. విడుదలలో జాప్యం జరుగుతోంది. సదరు ఆర్థిక సంవత్సరం ముగిసినా బిల్లులు క్లియర్ కావడం లేదు. వాటిని మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వర్ చేస్తుండడంతో.. బడ్జెట్ కేటాయింపులు సరిపోని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సంక్షేమశాఖల గణాంకాలు చెప్తున్నాయి. బడ్జెట్ లేకపోవడంతో వాటిని వివిధ దశల్లో ఆపినట్టు సమాచారం.
దరఖాస్తుకు ఏమేం కావాలి?
దరఖాస్తుదారులు ఈపాస్ వెబ్‌సైట్లో నేరుగాగానీ, మీసేవ కేంద్రాల ద్వారాగానీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో పెళ్లికూతురు వివరాలు, ఆధార్ కార్డు, కులధ్రువీకరణ పత్రం, వివాహ ధ్రువీకరణ పత్రం, పెళ్లికార్డు, పెళ్లి జరిగిన రుజువులతో కూడిన ఫొటో, తల్లి బ్యాంకు ఖాతా నంబర్‌లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. మ్యాన్యువల్‌గా ఈ దరఖాస్తును, ఆధారాలను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సిన అవసరం లేదు.
త్వరగా అందితేనే సాయానికి విలువ
పేద కుటుంబాలను ఆదుకోవడానికే ప్రభుత్వం కల్యాణలక్షి్మ, షాదీ ముబారక్ పథకాలను తెచి్చంది. ఆడపిల్ల పెళ్లి నాటికి ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలనే లక్ష్యం నీరుగారిపోతోంది. పెళ్లి రోజే సాయం చేస్తామని ప్రకటించినా.. ఆరు నెలలు, ఏడాది దాకా కూడా ఆర్థిక సాయం అందడం లేదు. ఇది ఈ పథకాల స్ఫూర్తికే విరుద్ధం. ఈ పథకాలకు సకాలంలో నిధులు ఇవ్వకపోవడం సరికాదు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు అడ్వాన్స్‌గా నిధులు ఉంచి గ్రీన్ చానెల్ ద్వారా పంపిణీ చేయాలి. బకాయిలు ఉండకుండా చూడాలి. కనీసం దరఖాస్తు చేసుకున్న నెలరోజుల్లోగా పరిష్కరిస్తే పేదింటికి లాభం జరుగుతుంది. – రమ్య, కార్యనిర్వాహక అధ్యక్షురాలు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం
Comments
Please login to add a commentAdd a comment