పేదింటి వధువు.. చేయూత కరువు | Shadi Mubarak Scheme Delayed In Telangana | Sakshi
Sakshi News home page

పేదింటి వధువు.. చేయూత కరువు

Published Wed, Jul 11 2018 9:25 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Shadi Mubarak Scheme Delayed In Telangana - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం పేద యువతుల వివాహాల ఆర్థిక తోడ్పాటు కోసం మూడేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు బాలారిష్టాలు దాటడంలేదు. బడ్జెట్‌లో పథకాలకు కేటాయింపులు ఘనంగా ఉన్నా.. ఆచరణలో మాత్రం ప«థకం చుక్కలు చూపిస్తోంది. ఆడబిడ్డల పెళ్లీలకు ఆర్థిక సహాయం అందుతుందన్న గంపెడు ఆశతో పెళ్లి ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్న తల్లితండ్రులకు ఆర్థిక కష్టాలు, కన్నీళ్లు తప్పడం లేదు. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో  రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం, సవాలక్ష కొర్రీలతో వ«ధువుకు చేయూత అంతంత మాత్రంగా మారింది. దరఖాస్తులు పరిశీలనకు నోచుకోకుండా పెండింగ్‌లో మగ్గుతున్నాయి. మరోవైపు పరిశీలన నోచుకున్న దరఖాస్తులు తహసీల్దార్, ఎమ్మెల్యే ఆమోదం, మంజూరు కూడా ఎదురు చూస్తున్నాయి.

ఆర్థిక సహాయం మంజూరైనప్పటికీ ట్రెజరీ శాఖ ప్రతి నెలా 5 నుంచి 17 వరకు మాత్రమే బిల్లుల పాస్, ఆ తర్వాత బిజీబిజీగా ఉంటే ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కుల పంపిణీ ప్రక్రియలతో  పుణ్యకాలం కూడా గడిచిపోతోంది. దీంతో పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత  ఆలస్యంగా అందుతోంది. దీంతో ఎప్పటి మాదిరిగా నిరుపేద కుటుంబాలు అప్పులు చేసి ఇబ్బందుల పాలవుతున్నారు.  రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించి పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తులను పరిశీలించి ఆర్థిక చేయూత అందించాలని ఆయా కుటుంబాలు కోరుతున్నారు.

నత్తనడకన..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద నిరుపేద కుటుంబాలకు వివాహాల కంటే ముందు రూ. 1,00,116 ఆర్థిక చేయూత అందే పరిస్థితి కానరావడం లేదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ రెవెన్యూ శాఖకు గుదిబండగా తయారైంది. రెవెన్యూ శాఖ సిబ్బంది ప్రభుత్వ భూముల పరిరక్షణ, ధ్రువీకరణ పత్రాల జారీ,  పింఛన్లు ఇతరత్రా విధుల్లో బిజీబిజీగా ఉండటంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తులపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. క్షేత్ర స్థాయి విచారణ పూర్తయినా ఆ తర్వాత ప్రక్రియ కూడా నత్తలకు నడక నేర్పిస్తోంది.

ఇదీ పరిస్థితి..
హైదరాబాద్‌ జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం కింద మొత్తం 3,680 కుటుంబాలు తమ బిడ్డల పెళ్లీలకు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు చేసుకోగా అందులో 1,745 కుటుంబాలకు మాత్రమే ఆర్థిక చేయూత అందినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. షాదీ ముబారక్‌ పథకం కింద 8,205 కుటుంబాలు ఆర్థిక చేయూత కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు కేవలం 4,816 కుటంబాలకు మాత్రమే చేయూత అందినట్లు తెలుస్తోంది. మిగిలిన సగం దరఖాస్తులు వివిధ దశలో పెండింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అదనపు పనిభారం, బిజీ షెడ్యూలుతో రెవెన్యూ దరఖాస్తులను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు పథకాల కింద సుమారు ఆరు వేలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో విచారణ అనంతరం మూడువేల దరఖాస్తులకు ఎమ్మెల్యేల ద్వారా ఆమోదం పొందినట్లు అధికార యంత్రాంగం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement