సాక్షి,మేడ్చల్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధులు లేక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. కానీ డిమాండ్‌కు తగినట్లుగా నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. దీంతో అర్హత కలిగిన లబిద్ధారులు నిధుల మంజూరు కోసం ఎమ్మెల్యేలు, రెవెన్యూ యంత్రాంగం చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాజిక వర్గాలకు అతీతంగా బీసీ, ఈబీసీలకు కూడా కల్యాణ లక్ష్మి పథకం వర్తింపజేయటంతో దరఖాస్తుదారుల సంఖ్య బాగా పెరిగింది. ఈ పథకంలో మార్పులు, చేర్పులు, లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు ప్రభుత్వం అప్పగించింది.
దీంతో లబ్ధిదారుల ఎంపిక, నిధుల మంజూరులో జాప్యం జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సహాయం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల నుంచి 5,885 మంది దరఖాస్తు చేసుకోగా...వీటిలో 16 మండలాల పరిధిలో 5,040 దరఖాస్తులను మండల రెవెన్యూ యంత్రాంగం పరి«శీలించింది. మరోవైపు ఇందులో 4,540 దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యేలు ఆమోదించారు. అయినప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు 4,460 మంది లబ్ధిదారులకు మాత్రమే చెక్కులు పంపిణీ చేశారు. మిగిలిన 500 దరఖాస్తుల్లో 153 తిరస్కరించి...347 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. కాగా లబ్ధిదారులకు ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున సొమ్ము మంజూరు చేశారు.
పథకం తీరు ఇలా...
ఆర్థికంగా బలహీనంగా ఉన్న షెడ్డ్యూల్ కులాలు, షెడ్డ్యూల్ తెగలు, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 18 ఏళ్లకు పైబడిన యువతుల వివాహం కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రా>ష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాల్సి ఉంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించే బాధ్యతలను రెవెన్యూ శాఖకు ప్రభుత్వం అప్పగించింది. ఆన్‌లైన్ ద్వారా రిజిష్టర్ అయిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రతిపాదనల్ని స్థానిక ఎమ్మెల్యేలకు రెవెన్యూ శాఖ నివేదిస్తుంది. చివరగా ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాక...నిధులు మంజూరు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment