సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఈ ఏడాది ఇబ్బందులు తప్పేలా లేవు. పెళ్లి రోజు నాటికే ఈ నగదు సాయాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో పథకంలో పలు మార్పులు చేపట్టినప్పటికీ.. వరుసగా వస్తున్న ఎన్నికలతో పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. తాజాగా లోక్‌సభ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ పరంగా లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమాలకు ఎన్నికల సంఘం కళ్లెం వేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత కాలం ఈ కార్యక్రమాలను నిర్వహించొద్దని స్పష్టం చేయడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పేలా లేవు. 2018–19 వార్షిక సంవత్సరంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద మార్చి 5 నాటికి 2.43 లక్షల దరఖాస్తులొచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 1.60 లక్షల దరఖాస్తులను పరిశీలించి అర్హులకు దాదాపు చెల్లింపులు పూర్తి చేశారు. మిగిలిన 83 వేల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది.
ఏడాదంతా ఎన్నికల కోడ్‌తోనే..
2018–19 వార్షిక సంవత్సరమంతా ఎన్నికల కోడ్‌తోనే గడిచిపోయింది. తొలి, రెండో త్రైమాసికాల్లో ప్రభుత్వం పెద్దగా నిధులు విడుదల చేయకపోవడంతో సంక్షేమ పథకాలన్నీ కాస్త నెమ్మదించాయి. ఆ తర్వాత అసెంబ్లీ రద్దు చేయడంతో నిధుల విడుదలకు బ్రేకులు పడ్డాయి. అందుబాటులో ఉన్న వాటితోనైనా సంక్షేమ పథకాలను నెట్టుకొద్దామని అధికారులు భావించినప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో యంత్రాంగం ఆమేరకు సాహసించలేదు. డిసెంబర్ రెండో వారం నుంచి ఎన్నికల కోడ్ తొలగిపోయింది. అంతలోనే జనవరిలో పంచాయతీ ఎన్నికలు రావడంతో ఆ నెల కూడా కోడ్ నేపథ్యంలో పలు కార్యక్రమాలు అటకెక్కాయి. ప్రస్తుతం వార్షిక సంవత్సరం చివరకు వచ్చింది. మరో 20 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో పెండింగ్ పనులన్నీ పూర్తిచేసేలా అధికారులు హడావుడి చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థికశాఖకు వాటిని సమర్పించాలనుకునేలోపే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మే నాలుగో వారం వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండనుంది. దీంతో అప్పటివరకు సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, చెల్లింపులకు ఇబ్బందేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
అంతా ఆన్‌లైన్ అయినా..
గతేడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ పద్ధతిని తీసుకొచ్చింది. సాధారణంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో ఇస్తారు. ఈ మేరకు శాసనసభ్యులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పంపిణీ చేస్తారు. ఎన్నికల సందర్భంగా చెక్కులకు బదులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు సాయాన్ని పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇందుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం నుంచి పెద్దగా సహకారం అందకపోవడంతో తక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేశారు. తాజాగా ఎన్నికలు రావడంతో రెవెన్యూ యంత్రాంగమంతా ఎన్నికల పనుల్లో బిజీ కానుంది. దీంతో ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చినా పెద్దగా ఫలితం లేదని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment