సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ చీఫ్ పగ్గాలు చేపట్టేందుకు మరికొంత సమయం పడుతుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే రాహుల్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారు. సోనియా అనారోగ్యం ఇతర కారణాలతో రాహుల్ దీపావళి అనంతరం గుజరాత్,హిమాచల్ ఎన్నికల ముందే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని సీనియర్ నాయకులు చెప్పినప్పటికీ ఆ దిశగా ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవు.
అధినేత్రి సోనియా నిర్ణయంలో జాప్యంతో కాంగ్రెస్ చీఫ్ హోదాలో రాహుల్ గుజరాత్ ఎన్నికల ప్రచార బరిలో దిగుతారని ఆశించిన ఆ పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నాయి.మరోవైపు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతోత్సవాల సందర్భంగా నవంబర్ 9 నుంచి నవంబర్ 19 మధ్య ఏ క్షణమైనా రాహుల్‌ను పార్టీ చీఫ్‌గా ఎంపిక చేస్తారనే ప్రచారం సాగుతున్నా దీనిపై ఎలాంటి స్పష్టతా లేదు. సోనియా గోవాలో ఉండటం, రాహుల్ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో కీలక నిర్ణయం వాయిదా పడుతూవస్తోందని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
గుజరాత్,హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చినా బీజేపీకే అధికార పీఠం దక్కుతుందని పలు సర్వేలు పేర్కొంటున్న క్రమంలో రాహుల్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై అధినేత్రి తటపటాయిస్తున్నట్టు సమాచారం. ఇక రాహుల్‌కు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమై ఎన్నికల ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే క్రమంలో గుజరాత్ ఎన్నికల ప్రచారంలో అడ్డంకులు ఎదురవుతాయనే కోణంలోనూ కొంత వెనక్కితగ్గినట్టు చెబుతున్నారు.
సంస్థాగత ఎన్నికలు నిర్వహించి ఆపై ఏఐసీసీ ఎన్నికలు చేపట్టి రాహుల్ ఎంపికను పూర్తిచేయాల్సి ఉంది. ఇంత హడావిడిగా రాహుల్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టినా హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బలు తగిలితే యువనేత ఇమేజ్‌కు భంగం వాటిల్లుతుందనే ఆందోళనతోనూ అధినేత్రి పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం. తాజా పరిణామాల ప్రకారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అనంతరమే రాహుల్ పార్టీ పగ్గాలు అందుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment