జెట్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు
ఢిల్లీ: ఓ బాంబు బెదిరింపు కాల్ కారణంగా గోరక్ పూర్ బయల్దేరాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానం సుమారు రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. 55 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బందితో సహా ప్రయాణానికి సిద్ధంగా ఉన్న విమానాన్ని వైమానిక సంస్థ కార్యాలయానికి బాంబు బెదిరిపు కాల్ రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా నిలిపివేశారు. విమానం బయల్దేరేందుకు సిద్ధంగా ఉండగా బాంబు బెదిరింపు కాల్ రావడం ఆలస్యానికి కారణమైందని, తర్వాత అది బూటకపు కాల్ అని తెలుసుకున్నట్లు ఎయిర్ లైన్స్ తెలిపింది.
ఏటీ ఆర్ నిర్వహిస్తున్న జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 9W-2467 విమానం ఢిల్లీనుంచి గోరక్ పూర్ కు మధ్యాహ్నం 1.30 కి బయల్దేరాల్సి ఉంది. సుమారు 12.30 సమయంలో వైమానిక సంస్థ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. బాంబు భయం ఉన్నమాట నిజమేనని తాము అధికారికంగా నిర్వహిస్తున్న ట్విట్టర్ ద్వారా తమకు తెలిసినట్లు ఢిల్లీ పోలీసులు కూడ ధృవీకరించారు. దీంతో విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన సిబ్బంది అటువంటిదేమీ లేదని నిర్థారించి విమానం బయల్దేరేందుకు ఏర్పాట్లు చేశారు.
భద్రతా హెచ్చరికల మేరకు తనిఖీ ప్రక్రియ చేపట్టామని, ప్రయాణీకులకు ఎటువంటి ప్రమాదం లేదని, అంతా సురక్షితమేనని ఢిల్లీ పోలీసులు ఓ ట్వీట్లో తెలిపారు. సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత విమానం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు బయల్దేరినట్లు ఎయిర్ లైన్స్ ప్రకటించింది.